వంట విషయంలో గొడవ.. భార్యను కొట్టి చంపిన భర్త..
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:47 PM
వంట విషయంలో గొడవ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఓ భర్త తన భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో గురువారం చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: వంట విషయంలో గొడవ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఓ భర్త తన భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగ్‌పూర్‌కు చెందిన 41 ఏళ్ల కృష్ణలాల్ యాదవ్, యామిని కృష్ణలాల్ యాదవ్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం సాయంత్రం కృష్ణలాల్ పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. తన కోసం, పిల్లల కోసం వంట చేయమని అడిగాడు. డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్న ఆమె వంట చేయడానికి ఒప్పుకోలేదు.
దీంతో ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ఆ గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. మద్యం మత్తులో ఉన్న కృష్ణలాల్ భార్యపై విరుచుకుపడ్డాడు. ఆమె గొంతు, పొత్తి కడుపుపై బలంగా దాడి చేశాడు. దెబ్బల కారణంగా యామిని విలవిల్లాడింది. గొంతు, కడుపు విపరీతంగా నొప్పి తీస్తున్నాయని భర్తకు చెప్పింది. నొప్పుల మాత్రలు తీసుకురమ్మని అడిగింది. కృష్ణలాల్ మెడికల్ స్టోర్‌కు వెళ్లాడు. షాపు మూసి ఉండటంతో నొప్పుల మాత్రలు తేకుండానే వెనక్కు తిరిగి వచ్చాడు. ఓ గంట తర్వాత యామిని ఆరోగ్య పరిస్థితి దారుణంగా దిగజారింది.
కడుపు లోపలి అవయవాలకు గాయాలు అవ్వటంతో యామిని కడుపు బాగా ఉబ్బిపోయింది. భర్త ఆమెను ఆస్పత్రికి తరలించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యామిని ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. యాక్సిడెంటల్ డెత్‌గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యామిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో.. బలమైన గాయాల కారణంగా యామిని గొంతు ఎముక విరిగిందని, కడుపులో పేగులు తీవ్రంగా దెబ్బ తిన్నాయని తేలింది. దీంతో పోలీసులు కేసును మర్డర్ కేసుగా మార్చి, యామిని భర్తను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
TANA (తానా) ఆధ్వర్యంలో మిన్నియాపోలిస్‌లో విద్యార్థులకు బ్యాక్ ప్యాక్స్ పంపిణీ
నా ప్రత్యర్థులంతా పిరికివాళ్లే.. ఒలింపిక్ ఛాంపియన్ సంచలన వ్యాఖ్యలు