Share News

నా ప్రత్యర్థులంతా పిరికివాళ్లే.. ఒలింపిక్ ఛాంపియన్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 05 , 2026 | 01:20 PM

ఒలింపిక్ ఛాంపియన్, నార్వే స్టార్ అథ్లెట్ జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను పిరికివాళ్లతో పోటీ పడ్డానంటూ ఘాటుగా స్పందించాడు.

నా ప్రత్యర్థులంతా పిరికివాళ్లే.. ఒలింపిక్ ఛాంపియన్ సంచలన వ్యాఖ్యలు
Jakob Ingebrigtsen

ఇంటర్నెట్ డెస్క్: ఒలింపిక్ ఛాంపియన్, నార్వే స్టార్ అథ్లెట్ జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. డైమండ్ లీగ్ ఫైనల్‌లో పురుషుల 1500 మీటర్ల రేసులో జాకబ్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఆ ఓటమి తర్వాత అతడు ప్రత్యర్థుల రేసింగ్ వ్యూహాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తాను పిరికివాళ్లతో పోటీ పడ్డానంటూ ఘాటుగా స్పందించాడు. ఈ పోరులో ఆస్ట్రేలియా అథ్లెట్ కామెరాన్ మైయర్స్ 3:30.14 టైమింగ్‌తో డైమండ్‌ లీగ్‌ టైటిల్‌ సాధించాడు. కెన్యాకు చెందిన ఫానుయెల్‌ కిప్‌కోగ్సెయి కేవలం 0.04 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. అమెరికాకు చెందిన ఈతన్‌ స్ట్రాండ్‌ 3:30.50తో మూడో స్థానంలో ఉండగా.. జాకబ్ 3:30.52 టైమింగ్‌తో నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.


‘నా ప్రత్యర్థులందరూ ఒకరి వెనుక ఒకరు వరుసలో పరిగెత్తుతూ దాక్కోవాలని అనుకున్నారు. నేను మాత్రం అలా దాక్కుని రేసులో పాల్గొనే వ్యక్తిని కాదు. పేస్‌మేకర్‌ సరిగ్గా వ్యవహరించలేదు. నన్ను వేవ్‌లైట్‌ నుంచి, నిర్ణయించిన వేగం నుంచి దూరం చేశాడు. నేను అలా పరిగెత్తాలని అసలు అనుకోలేదు. అమెరికా స్టార్ కోల్ హాకర్ రేసింగ్ వ్యూహం కూడా చెత్తగా ఉంది. ఫ్రెంచ్‌ పేస్‌మేకర్‌ స్థానంలో తన సొంత సహచరుడిని తీసుకొచ్చాడు. అతడు పేస్‌మేకర్‌ను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాడని అందరూ అనుకున్నారు. కానీ అది ఒక వ్యూహం. అతడు మనందరినీ మోసం చేశాడు. మిగతావాళ్ల వెనుక దాక్కుని పరిగెత్తాడు. ఈ రేసు, ఫలితం నన్ను తీవ్రంగా నిరాశపరిచాయి. నేను పిరికివాళ్లతో పోటీ పడ్డాను. అంతే! కామెరాన్‌ మాత్రమే నిజాయతీగా ఆడాడు. బాగా రేస్‌ చేశాడు. మిగతావాళ్లంతా ఓడిపోయిన వాళ్లలా కనిపించారు. అందులో నేనూ ఉన్నాను’ అని జాకబ్ వ్యాఖ్యానించాడు.


ఇవి కూడా చదవండి:

ఒకేరోజు రిటైర్‌మెంట్.. ఆ విషయం చెప్పగానే ధోని షాకయ్యాడు: సురేశ్ రైనా

యూఎస్ ఓపెన్: గంజాయి వాసన వస్తోందని మ్యాచ్ ఆపేసిన సబలెంకా

Updated Date - Sep 05 , 2026 | 01:20 PM