Share News

ఒకేరోజు రిటైర్‌మెంట్.. ఆ విషయం చెప్పగానే ధోని షాకయ్యాడు: సురేశ్ రైనా

ABN , Publish Date - Sep 05 , 2026 | 11:13 AM

భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనితో తనకున్న అనుబంధం గురించి మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఒకే రోజు ధోనితో పాటు రిటైర్‌మెంట్ ప్రకటించడానికి గల కారణాన్ని రైనా తాజాగా వివరించాడు.

ఒకేరోజు రిటైర్‌మెంట్.. ఆ విషయం చెప్పగానే ధోని షాకయ్యాడు: సురేశ్ రైనా
Suresh Raina

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనితో తనకున్న అనుబంధం గురించి మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2020 ఆగస్టు 15న ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ధోని రిటైర్‌మెంట్ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా అనూహ్యంగా ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఒకే రోజు ధోనితో పాటు రిటైర్‌మెంట్ ప్రకటించడానికి గల కారణాన్ని రైనా తాజాగా వివరించాడు.


‘క్రికెట్ కోసమే జీవిస్తాం. దేశం కోసం ఎంతో చేస్తాం. మన తల్లిదండ్రులు కూడా ఎన్నో త్యాగాలు చేస్తారు. కానీ ఆ సమయంలో నాకు అదే సరైన నిర్ణయం అనిపించింది. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని అనిపించింది. రిటైర్‌మెంట్ ప్రకటించినప్పుడు నా వయసు 33 ఏళ్లు. ఏదైతే అది అని.. నా నిర్ణయాన్ని చెప్పేశా. అప్పటికే ధోని అధికారికంగా ఆటకు వీడ్కోలు పలికాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ధోని దగ్గరకు వెళ్లి ‘అంతా అయిపోయింది’ అని చెప్పా. వెంటనే ‘ఏం చేశావ్ నువ్వు?’ అంటూ షాకయ్యాడు’ అని రైనా గుర్తు చేసుకున్నాడు.


ధోని నా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు..

‘అప్పుడు కెప్టెన్ లేదా జట్టు కోసం క్రికెట్ ఆడేవారు. నాకు అవకాశం రావడానికి కెప్టెన్ కూడా కారణమే. ధోని తన బ్యాటింగ్ స్థానాన్ని నా కోసం త్యాగం చేశాడు. సౌరభ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ధోని టాపార్డర్‌లో ఆడేవాడు. కానీ ఆ తర్వాత బాధ్యత తీసుకుని.. యువరాజ్ సింగ్‌ను, నన్ను టాపార్డర్‌కు పంపి తాను ఫినిషర్‌గా వెళ్లాడు. ఈ వ్యక్తి తనపై కంటే నా సామర్థ్యాలపై ఎక్కువ నమ్మకం ఉంచుతున్నాడని అనిపించింది. అలాంటప్పుడు నేను అతడి కోసం తప్పక రాణించాలి అనుకున్నాను. మేమంతా జట్టులో భాగమే. అందుకే ఫీల్డింగ్‌, బౌలింగ్‌, బ్యాటింగ్‌ ఏదైనా మనసు పెట్టి ఆడాలని నిర్ణయించుకున్నాను’ అని రైనా వెల్లడించాడు.


మా స్నేహం చిరకాలం..

‘మనం ఓ దశకు చేరుకున్న తర్వాత మెదడుతో కాదు మనసుతో ఆలోచించడం మొదలుపెడతాం. మనసు ఎక్కడ అనుబంధం పెంచుకుంటే.. ఆ బంధం, స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎవరో మన కోసం ఎంతో త్యాగం చేస్తే.. మనం కూడా తిరిగి ఏదైనా ఇవ్వగలగాలి. అందరికీ డబ్బు ఉండొచ్చు. కానీ దాన్ని పంచడానికి పెద్ద మనసు ఉండాలి. మా స్నేహంలో అలాంటి పెద్ద మనసు ఉంది. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది’ అని ధోనితో ఉన్న అనుబంధాన్ని రైనా గుర్తు చేసుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. బ్యాకప్‌గా ప్రిన్స్ యాదవ్!

వన్డేల్లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాటర్: గ్లెన్ మ్యాక్స్‌వెల్

Updated Date - Sep 05 , 2026 | 11:19 AM