సరదాగా సరిహద్దుల్లోకి...
ABN , Publish Date - May 17 , 2026 | 11:24 AM
మనదేశంలో ఉదయం టిఫిన్ చేసి, మధ్యాహ్న భోజనానికి నేపాల్ లేదా భూటాన్ వెళ్లి... రాత్రికి తిరిగి వచ్చే దగ్గర దారి ఉందని తెలుసా? ఇలా ఒకేరోజు రెండు, ఒక్కోసారి మూడు దేశాలలో విహరించే అవకాశాన్ని కొన్ని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలు కల్పిస్తున్నాయి.
మనదేశంలో ఉదయం టిఫిన్ చేసి, మధ్యాహ్న భోజనానికి నేపాల్ లేదా భూటాన్ వెళ్లి... రాత్రికి తిరిగి వచ్చే దగ్గర దారి ఉందని తెలుసా? ఇలా ఒకేరోజు రెండు, ఒక్కోసారి మూడు దేశాలలో విహరించే అవకాశాన్ని కొన్ని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాలు కల్పిస్తున్నాయి. అంటే సరిహద్దుకు ఇవతల ఒక దేశం... అవతల మరో దేశం... అలాంటి ఆసక్తికర టూరిస్టు హాట్ స్పాట్‌లను సరదాగా ఓసారి చూసొద్దాం...
అత్యంత చిన్న సరిహద్దు
ప్రపంచంలోనే అత్యంత చిన్న సరిహద్దు రేఖ పెనాన్ డీ వెలెజ్ డీ లా గోమెరా. స్పెయిన్, మొరాకో దేశాల మధ్య ఉన్న ఈ సరిహద్దు ప్రాంతం పొడవు 86 మీటర్లు మాత్రమే. స్పెయిన్ వైపు కంచె వేసి ఉంటుంది. ఓ చిన్న గేటు కూడా ఉంది. మధ్యధరా సముద్రంలో చిన్న ద్వీపం ‘పెనాన్ డీ వెలెజ్ డీ లా గోమెరా. దీన్నే ‘హజర్ బడిస్’ అని కూడా పిలుస్తారు. ఈ భూభాగం 1564 నుంచి స్పెయిన్ అధీనంలో ఉంది. అయితే 1930లో వచ్చిన భూకంపం వల్ల ఇది ద్వీపకల్పంగా మారి మొరాకోతో కలిసింది.
ఈ ద్వీపకల్పం వల్ల రెండు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతుంటాయి. ఇక్కడ స్పెయిన్ పౌరులు ఎవరూ నివసించరు. కేవలం సైనిక స్థావరంగానే ఆ దేశం భావిస్తోంది. 60 మంది స్పెయిన్ సైనికులు ఎల్లప్పుడూ ఈ సరిహద్దులో కాపలా కాస్తూ ఉంటారు. అప్పట్లో ఇక్కడి నుంచి యూరప్‌కి అక్రమ వలసలు జోరుగా సాగేవట. అందుకే అంతటి కట్టుదిట్టమైన పహారా. ఈ సరిహద్దుకి సమీపంలో ఇరు దేశాల బోర్డర్ సెక్యూరిటీ నౌకలు కూడా గస్తీలో ఉంటాయి. అయితే ఈ చిన్న సరిహద్దును చూసేందుకు మొరాకో టూరిస్టులు ఈమధ్య ఎక్కువగా వెళ్తున్నారు. కంచెలో నుంచి చేయి పెట్టి స్పెయిన్ భూభాగాన్ని ముట్టుకుని సంబరపడుతుంటారు. అంతేకానీ అక్కడ అడుగుపెట్టడానికి మాత్రం వీలు లేదండోయ్...
చెక్‌పోస్ట్ దాటి...
ప్రపంచ గణతంత్ర రాజ్యాలలో అతి పురాతనమైనది శాన్ మారినో. ఇటలీ భూభాగంలో ఉన్న శాన్ మారినో ఇప్పుడు ఓ స్వతంత్ర దేశం. జనాభా 35 వేల లోపే. పేరుకి చిన్న దేశమే అయినా కట్టిపడేసే ప్రకృతి రమణీయత ఈ దేశం సొంతం. అందుకే ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వాలిపోయి సేదతీరుతుంటారు. ఇక్కడి ‘టిటానో’ పర్వతం మీద ఉన్న మధ్యయుగాల నాటి కోట దేశం మొత్తానికి ప్రధాన టూరిస్ట్ అట్రాక్షన్. అయితే ఈ దేశం చుట్టూ 39 కిలోమీటర్ల మేర ఇటలీతో సరిహద్దు రేఖ ఉంది. ఈ సరిహద్దు పొడవునా రోడ్లు, రైల్వే లైన్లు, కొండలూ గుట్టలూ మామూలే. అయితే ‘దొగానా’ అనే చెక్‌పోస్ట్ మాత్రం సందర్శకుల కోసం 24 గంటలూ తెరిచే ఉంటుంది. ఇటూ అటూ సరిహద్దులు దాటి టూరిస్టులు వీసాలు లేకుండానే వెళ్లిరావచ్చు. కానీ యూరోపియన్ యూనియన్ స్థానికులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.
త్రిభుజాకార లోగిలి
యూరప్‌కి హాలీడేకి వెళితే ఆస్ట్రియా, స్లొవేకియా, హంగేరీ... కలిసే ప్రదేశంలో కాఫీ తాగడం గమ్మత్తయిన అనుభవం. ఈ ప్రదేశంలో టూరిస్టుల కోసమే ప్రత్యేకంగా ఓ టేబుల్, మూడు బల్లలూ వేశారు. ‘ట్రయాంగిల్ పిక్నిక్ టేబుల్’గా పిలుస్తారు. ‘ట్రైపాయింట్’ అనీ అంటారు. ఇక్కడ కూర్చుంటే మూడు దేశాల్లో ఒకేసారి అడుగుపెట్టినట్టు. ఈ ప్రదేశం స్లొవేకియాలోని బ్రాటిస్లేవాకు దగ్గరలో ఉంటుంది. ఆస్ట్రియాకు చెందిన కిట్సీ నగరం, హంగేరీ నగరం రాజ్కాకు పది కిలోమీట్లర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇవన్నీ సైకిల్ దారులే. చాలామంది టూరిస్టులు సైకిళ్లపై అక్కడికి వెళ్లి మూడు దేశాల్ని ఒకేసారి టచ్ చేశామనే ఆనందం వ్యక్తం చేస్తారు. ఆస్ట్రో - హంగేరియన్ రాజ్య పతనం తరవాత 1920 లో ఈ ‘ట్రైపాయింట్’ను ఏర్పాటుచేశారు. అలా ఆ మూడు దేశాల ప్రభుత్వాలే తమ సరిహద్దులు కలిసే ప్రాంతంలో స్నేహపూర్వక ప్రదేశాన్ని నెలకొల్పడం విశేషం.
స్నేహపూర్వక వంతెన
మన పక్క దేశాలైన నేపాల్, చైనాల మధ్య ఉన్న సరిహద్దును అత్యంత ఎత్తైన సరిహద్దుల్లో ఒకటిగా పేర్కొంటారు. హిమాలయ పర్వత శ్రేణి వెంట విస్తరించిన ఈ సరిహద్దు సగటు ఎత్తు 5 వేల మీటర్లు. అంతేకాదు అత్యంత దుర్భేద్యమైన సరిహద్దుల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే ఎత్తైన పర్వత శిఖరాలు, గడ్డ కట్టే చలి వల్ల మానవ సంచారమే ఉండదు. ఈ నేపాల్, చైనా సరిహద్దు రేఖ పొడవు 1414 కిలోమీటర్లు. ఈ రేఖ మీద నదులు, హిమపాతాలతో పాటు అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ లాంటివి కొలువుతీరి ఉంటాయి. ఖాట్మాండు నుంచి లాసా నగరానికి వెళ్లేందుకు ఇదే ముఖ్య దారి. ప్రధాన ఎంట్రీ పాయింట్ ‘రసువగాధి బోర్డర్ పాయింట్’. ఇక్కడ లిండే నది మీద నిర్మించిన రసువగాధి - కేరంగ్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జి ద్వారా 70 శాతం వాణిజ్యం, రవాణా సాగుతుంటుంది. గతేడాది మెరుపు వరదల్లో ధ్వంసమైన ఈ బ్రిడ్జిని చైనా ఆరు నెలల్లో పునరుద్ధరించడం విశేషం. ఎత్తైన ఈ దారిలో హిమాలయ పర్వత సానువులు రెప్ప వాల్చనీయవు.
జిప్‌లైన్‌లో...
స్పెయిన్‌లోని శాన్లుకార్ డీ గ్వాడియానా నగరం నుంచి పోర్చుగల్‌లోని ఆల్‌కౌటిమ్ నగరానికి ఒక్క నిమిషంలో జిప్‌లైన్‌లో వెళ్లొచ్చు. అలా వెళ్లి ఓ గంట కాలాన్ని వెనక్కి తెచ్చుకోవచ్చు కూడా. పోర్చుగల్ కాలమానం స్పెయిన్ కన్నా ఓ గంట వెనక ఉండడమే దీనికి కారణం. 2365 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే తొలి ‘క్రాస్ బార్డర్ జిప్‌లైన్’ ఇది. సాహసికులు చాలామంది ఇలా జిప్‌లైన్ టికెట్ తీసుకుని పోర్చుగల్‌లోకి దూకేస్తున్నారు. అయితే వెనక్కి వెళ్లాలంటే మాత్రం వేరే మార్గాలు వెతుక్కోవలసిందే. స్పెయిన్, పోర్చుగల్ దేశాల మధ్య ఉన్న సరిహద్దుని ప్రపంచంలో అతి పురాతన సరిహద్దుల్లో ఒకటిగా పేర్కొంటారు. సుమారు 1200 కిలోమీటర్లు ఉన్న ఈ సరిహద్దులో అనేక చెక్‌పోస్టులు, నిఘా ఉంటాయి.
అతి పొడవైనది...
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా దేశాల మధ్య ప్రపంచంలోనే అతి పొడవైన అవిచ్ఛిన్న సరిహద్దు రేఖ ఉంది. ఈ సరిహద్దు పొడవు అక్షరాలా 8,800 కిలోమీటర్లు. 13 అమెరికా రాష్ట్రాలు, ఎనిమిది కెనడా ప్రావిన్సులు ఇందులో భాగం. ఇంత పెద్ద సరిహద్దును నియంత్రించడం ఆషామాషీ కాదు. ఈ సరిహద్దును తొమ్మిది విభాగాలుగా విభజించారు. ప్రతీ భాగాన్ని సరిహద్దు రక్షణ దళాలు కట్టుదిట్టంగా ప్రహరీ కాస్తుంటాయి. ఎలక్ర్టానిక్ సర్వియలెన్స్ కూడా ఉంటుంది. ఏటా లక్షలాది టూరిస్టులు ఈ సరిహద్దు చెక్‌పోస్ట్‌ల నుంచే అటూ ఇటూ వెళ్తుంటారు. ఇక్కడి రెయిన్‌బో బ్రిడ్జి మీదుగా టూరిస్టులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లవచ్చు. అయితే చిన్న ట్రిప్‌లకు కూడా పాస్‌పోర్ట్ మాత్రం తప్పనిసరి.
కాసేపు తెరిచే ఉంటుంది...
ఒకటి సంపన్న దేశం, మరొకటి చాలా పేద దేశం. రెండింటి మధ్య సరిహద్దుల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో ఊహించడం కష్టం కాదు. హైతీ, దొమినికన్ రిపబ్లిక్ దేశాల మధ్య ఉన్న సరిహద్దును అత్యంత ప్రమాదకర సరిహద్దుల్లో ఒకటిగా పేర్కొంటారు. ఇక్కడ అనునిత్యం రక్తపాతమే. హిస్పానియోలా దగ్గర 391 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ సరిహద్దు ఉంది. దొమినికన్‌లోకి అక్రమంగా చొరబడేందుకు హైతీ పౌరులు నిత్యం ప్రయత్నిస్తుంటారు. అందుకే అత్యాధునిక రక్షణ వలయంతో 164 కిలోమీటర్ల మేర అడ్డుగోడను దొమినికన్ ప్రభుత్వం నిర్మించి, వలసలను అరికట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ సరిహద్దును బైవీక్లీ మార్కెట్ల కోసం కాసేపు తెరచి, మూసేస్తుంటారు.
యమా డేంజర్
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉందనే విషయం తెలిసిందే. అయితే ఈ రెండు దేశాల మధ్య 250 కిలోమీటర్ల మేర ‘డీమిలిటరైజ్డ్ జోన్ (డీఎంజెడ్)’ ఉంది. ఇదే ఆ రెండు దేశాలను విభజిస్తూ అప్రకటిత సరిహద్దుగా పేరుతెచ్చుకుంది. అటూ ఇటూ నాలుగు కిలోమీటర్ల వెడల్పున జనావాసాలు లేని బఫర్‌జోన్‌గా ఏర్పాటుచేయడం వల్ల వన్యప్రాణులకు అభయారణ్యంగా మారింది. అయితే, డీఎంజెడ్‌ను ప్రమాదకర సరిహద్దుగా పేర్కొంటారు. అత్యంత కట్టుదిట్టమైన ప్రహరీ ఉంటుంది. కొన్నిచోట్ల మందుపాతరలు, సొరంగాలు కూడా ఉన్నాయి.
డీఎంజెడ్‌లోని ఉమ్మడి భద్రతా ప్రాంతంలో మాత్రమే సైనికులు ముఖాముఖిగా నిలబడతారు. అలాగే దౌత్యపరమైన చర్చలు కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతుంటాయి. దక్షిణ కొరియా వైపు సరిహద్దులో మాత్రం కొన్ని భాగాలలో సందర్శకులకు అనుమతి ఉంది. కానీ నిబంధనలను మాత్రం కచ్చితంగా పాటించాల్సిందే.
సెలవులు వచ్చాయంటే వివిధ రకాల పర్యటనలు జోష్‌ను పెంచుతాయి. ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వాళ్లు టూర్లు ప్లాన్ చేస్తుంటారు. వాటిల్లో సరిహద్దు టూర్లు కూడా పర్యాటకులకు ఆటవిడుపుగా, సరికొత్త అనుభూతుల్ని పంచుతున్నాయి. అందర్నీ ఆకర్షిస్తున్నాయి. వెరైటీ కోరుకునేవారికి అదో సరదానే కదా!
ఫొటో ఐడీ చాలు...
మనకు కూత వేటు దూరంలో ఉండే చిన్న దేశం భూటాన్. అందమైన, ప్రశాంతమైన హిమాలయ పర్వత దేశం ఇది. ఉదయం ఇండియాలో టిఫిన్ చేసి, రోడ్డు మార్గంలో మధ్యాహ్న భోజనానికి భూటాన్‌కు వెళ్లి, రాత్రి భోజనానికి తిరిగిరావొచ్చు. 24 గంటల లోపు ప్రయాణానికి పాస్‌పోర్ట్ కూడా అవసరం లేదు. ‘ఆధార్’ లాంటి ఏదైనా ఫొటో ఐడీ ఉంటే చాలు. పశ్చిమబెంగాల్‌లో అలీపూర్‌ద్వార్ జిల్లాలోని జైగావ్ నుంచి వాహనాల్లో కేవలం 17 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే... భూటాన్ సరిహద్దు వస్తుంది. అక్కడి ‘భూటాన్ గేట్’ ద్వారా ఆ దేశంలోకి ప్రవేశించొచ్చు. సమీపంలోని ఫుయెంత్‌షోలింగ్ నగరంలో షాపింగ్ చేసుకోవడం, ఆ నగర విశేషాలను చూసుకుని తిరిగి అదే రోజు వెనక్కి రావచ్చు. భూటాన్ రాజఽధాని ‘థింపు’కి వెళ్లాలంటే మాత్రం వీసా ఫీజు కట్టాల్సిందే. అలాగే అక్కడి రించెంగ్డింగ్ చెక్ పోస్ట్ దాటాలంటే వాహనాలకు దాదాపు అయిదు వేల రూపాయల గ్రీన్ ట్యాక్స్ చెల్లించాలి. ఇవేవీ అవసరం లేకుండా కేవలం ఒకరోజు భూటాన్‌లో గడిపి వచ్చే వాళ్లూ ఉన్నారు.
ఆకాశ రాజ్యం
దక్షిణాఫ్రికా భూభాగంలో ఉన్న ‘లెసోతో’ ప్రత్యేక రాజ్యమని చాలామందికి తెలియదు. ఎత్తైన కొండలతో కూడుకున్న లెసోతోని ‘ఆకాశంలో ఉన్న రాజ్యం’గా పిలుస్తారు. లెసోతో చుట్టూ దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర దక్షిణాఫ్రికా సరిహద్దు రేఖ ఉంది. దారంతా నదులు, పర్వతాలతో అందంగా ఉంటుంది. ఎన్నో బోర్డర్ చెక్ పోస్టులు దారి వెంట కనిపిస్తాయి. అయితే చాలా వాటిని సాయంత్రానికి మూసేస్తారు. కానీ ‘మసేరు బ్రిడ్జి’ బోర్డర్ పోస్ట్‌ను మాత్రం 24 గంటలూ తెరిచే ఉంచుతారు. ఈ మధ్య చెక్‌పోస్ట్ దగ్గర టూరిస్టుల సందడి ఎక్కువయ్యింది.
- సండే డెస్క్
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి ‘మెడికల్ దర్శనం’ కోటాను విస్తరించండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News