‘సైలెంట్ కిల్లర్’ను గుర్తిస్తున్నారా?
ABN , Publish Date - May 17 , 2026 | 10:29 AM
పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా... ఈ రోజుల్లో అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) బారినపడుతున్నవారి సంఖ్య బాగా పెరుగుతోంది.
పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా... ఈ రోజుల్లో అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) బారినపడుతున్నవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ముఖ్యంగా 30-40 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఈ సమస్య ఆందోళనకరంగా మారుతోంది. ఆధునిక జీవనశైలి కూడా ఇందుకు ఒక కారణం.
నేడు ‘వరల్డ్ హైపర్ టెన్షన్ డే’ సందర్భంగా ఓ అవగాహన కోసం...
అధిక రక్తపోటు సమస్య ఉన్నవారిలో సగం మందికి అసలు తమకీ సమస్య ఉందనే తెలియదు. 12.5 శాతం నుంచి 15 శాతం మంది మాత్రమే సరైన చికిత్స తీసుకుంటున్నారు.
మనదేశంలో సుమారు 22 కోట్ల మంది ‘హైపర్‌టెన్షన్’తో బాధపడుతున్నారు. పట్టణాల్లో 33.8 శాతం, గ్రామాల్లో 27.6 శాతం. పెద్దవారిలో ప్రతీ నలుగురిలో ఒకరికి (25 శాతం నుంచి 28.5 శాతం) ఈ సమస్య ఉన్నట్లు అంచనా. మహిళల (21.2 శాతం) కన్నా పురుషుల్లో (24.1 శాతం) ఈ సమస్య కొంచెం ఎక్కువ.

హైపర్ టెన్షన్ వల్ల తీవ్రమైన గుండెపోటు, కిడ్నీ సమస్యలూ వస్తాయి. మెదడులోని రక్తనాళాలు చిట్లిపోయి బ్రెయిన్ స్ర్టోక్, పక్షవాతం రావొచ్చు. కళ్లలోని రక్తనాళాలు దెబ్బతిని కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే దీనిని ‘సైలెంట్ కిల్లర్’గా చెపుతుంటారు.
హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్.. రెండూ ఒకటే. వాడుక భాషలో ‘హై బీపీ’ అంటుంటారు. వైద్య పరిభాషలో ‘హైపర్ టెన్షన్’ అంటారు. రక్తనాళాల గోడలపై రక్తం చూపే ఒత్తిడి పెరగటం హై బీపీ. రక్తపోటు ఎక్కువగా ఉన్నపుడు డాక్టర్లు హైపర్ టెన్షన్ అంటారు.
చాలామంది హైపర్ టెన్షన్ అంటే మానసిక ఒత్తిడి అని పొరబడుతుంటారు. మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు పెరగవచ్చు. కానీ హైపర్ టెన్షన్ అనేది శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన శారీరక సమస్య.
సాధారణంగా రక్తపోటు 120/80 ఎఎంహెచ్‌జీ ఉంటే ఆరోగ్యకరంగా ఉన్నట్టు లెక్క. 140/90 కన్నా నిరంతరం ఎక్కువగా ఉంటే దాన్ని అధిక రక్తపోటుగా గుర్తిస్తారు.
రక్తపోటు తీవ్రస్థాయికి పెరిగి నపుడు కనిపించే లక్షణాలు... తలనొప్పి, విపరీతమైన అలసట, కళ్లు తిరగడం, చూపు మందగించడం, నిద్రలేమి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, మెడనొప్పి, ఛాతీలో నొప్పి, గుండె దడ, తికమకపడటం, మతిమరుపు.

హైపర్ టెన్షన్‌కు ముఖ్య కారణాలు- ఉప్పు అధిక వాడకం, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, మానసిక ఒత్తిడి, ఆందోళన, మితిమీరిన మద్యసేవనం, ధూమపానం, స్లీప్ ఆప్నియా లాంటివి.
ఈ సమస్య నియంత్రణకు మందులతో పాటు జీవనశైలి మార్పులు అవసరం. రోజుకు టీ స్పూన్ కన్నా తక్కువ ఉప్పు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాల వాడకం పెంచాలి. రోజూ కనీసం అరగంట నడక, 7-8 గంటల నిద్ర అవసరం.
అధిక రక్తపోటు కేసులను కనిష్ఠ స్థాయికి తగ్గించాలని కేంద్రప్రభుత్వం, ఐసీఎంఆర్‌లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకు ‘ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్’ లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి.
30 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ ఏడాదికి కనీసం ఒకసారైనా రక్తపోటు పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ ఏడాది ‘హైపర్‌టెన్షన్ డే’ థీమ్... ‘కంట్రోలింగ్ హైపర్‌టెన్షన్ టుగెదర్’. కావున అవగాహనతో దీనిని అదుపులో ఉంచుకునేందుకు అందరూ ప్రయత్నించాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి ‘మెడికల్ దర్శనం’ కోటాను విస్తరించండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News