Share News

సీఎం... ఆఫీ‘సర్‌’

ABN , Publish Date - May 17 , 2026 | 05:13 AM

క్యారియర్‌ రెడీనా? షూ పాలిష్‌? బాబోయ్‌ టైమ్‌ అవుతోంది.... ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ల ఇళ్లలో ఉదయాన్నే కనిపించే చిత్రమిది...

సీఎం... ఆఫీ‘సర్‌’

  • అచ్చు ప్రభుత్వ అధికారిలా విజయ్‌ తీరు

  • రోజూ పావుగంట ముందే సెక్రటేరియట్‌కు

  • ఇంటి నుంచే ‘లంచ్‌ బాక్స్‌’.. చాంబర్‌లో భోజనం.. సీఎంగా విజయ్‌ ప్రత్యేక ముద్ర

(చెన్నై - ఆంధ్రజ్యోతి)

‘క్యారియర్‌ రెడీనా? షూ పాలిష్‌? బాబోయ్‌ టైమ్‌ అవుతోంది.... ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ల ఇళ్లలో ఉదయాన్నే కనిపించే చిత్రమిది! అనేక సినిమాల్లో ఇలాంటి పాత్రలు పోషించిన జోసెఫ్‌ విజయ్‌... తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో అచ్చం ఒక ప్రభుత్వ అధికారి తరహాలో వ్యవహరిస్తున్నారు. విజయ్‌ అంతకుముందు వరకు తెల్లచొక్కా, కలర్‌ప్యాంటుతో కనిపించేవారు. ప్రమాణ స్వీకారం నుంచి డ్రెస్‌ మార్చేశారు. వైట్‌షర్ట్‌పై బ్లాక్‌ బ్లేజర్‌, బ్లాక్‌ ప్యాంటు ధరిస్తున్నారు. ప్రతిరోజూ ఠంచనుగా సచివాలయానికి వస్తున్నారు. అదికూడా... ‘ఆఫీస్‌ టైమ్‌’కు పావుగంట ముందే! అంతే కాదు... రోజూ ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ఇంటి నుంచి లంచ్‌ బాక్స్‌ తెచ్చుకుంటున్నారు. భోజన విరామ సమయంలోతన చాంబర్‌లోనే మధ్యాహ్నం భోజనం ముగించి... మళ్లీ విధులకు హాజరవుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీల అమలుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. కీలక ఫైళ్లను పరిశీలిస్తూ... ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు.


‘టైమింగ్‌’ తప్పదు...

సమయ పాలనలో విజయ్‌ ప్రత్యేక ముద్ర కనబరుస్తున్నారు. ఈ నెల 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. కానీ... విజయ్‌ 9 గంటలకే సభకు వచ్చేశారు. అలాగే సభాపతి, ఉపసభాపతి ఎన్నికలు జరిగిన మంగళవారం ఉదయం 9.30గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగా, సీఎం విజయ్‌ 8.55గంటలకే హాజరయ్యారు. బలపరీక్ష జరిగిన రోజునా అరగంట ముందే సభకు వచ్చి కూర్చున్నారు. ఇక రోజూ సచివాలయానికీ... ఆఫీ్‌సటైమ్‌ కంటే పావుగంట ముందే వచ్చేస్తున్నారు.

టర్కీ టవల్‌ తొలగించి...

విజయ్‌ సీఎం పదవి చేపట్టినప్పటి నుంచీ ఆయన ఆహార్యం, వ్యవహార శైలిపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా... ఆయన కుర్చీపై ఉన్న తెల్ల టవల్‌ కూడా వార్తల్లోకి ఎక్కింది. నిజానికి... ఇలా కుర్చీపై టర్కీ టవల్‌ వేసుకోవడాన్ని ‘వీఐపీ సంస్కృతి’గా భావిస్తూ కరుణానిధి దానిని పక్కనపెట్టారు. ఆ తర్వాత సీఎంలు అయిన జయలలిత, పళనిస్వామి, స్టాలిన్‌ తమ కుర్చీలో వీపు, తలను ఆనించే చోట టర్కీ టవల్‌ లేకుండా సచివాలయంలో రోజువారీ కార్యకలాపాలు నిర్వహించారు. తాజాగా... విజయ్‌ కుర్చీలో టర్కీ టవల్‌ మళ్లీ ప్రత్యక్షమైంది. ఇది బ్రిటిష్‌ సంస్కృతి అని, దీనికి స్వస్తి పలకాలని 14 ఏళ్ల పర్యావరణ కార్యకర్త లిసీ ప్రియా గంగుజమ్‌ ఈ నెల 14న సోషల్‌ మీడియా పేజీలో విజయ్‌ని ట్యాగ్‌ చేసి ఓ పోస్టు చేశారు. కాగా, శుక్రవారం విడుదల చేసిన ఫొటోల్లో ఆయన కుర్చీపై టర్కీ టవల్‌ కనిపించలేదు.

Updated Date - May 17 , 2026 | 05:13 AM