హోర్ముజ్‌లో నౌక సీజ్.. చైనాకు ఇరాన్ వార్నింగ్!
ABN , Publish Date - May 17 , 2026 | 10:43 AM
హోర్ముజ్ జలసంధిలో చైనాకు చెందిన ఒక నౌకను ఇరాన్ సీజ్ చేసింది. ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన ఈ నౌకను తనిఖీల పేరిట ఇరాన్ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయంగా తనకు అండగా ఉంటున్న చైనాకే ఇరాన్ వార్నింగ్ ఇచ్చిందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. చైనా సంస్థకు చెందిన ఒక నౌకను ఇరాన్ ఇటీవల అదుపులోకి తీసుకోవడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. చైనాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఇరాన్ ఈ చర్యకు దిగడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
అసలేం జరిగిందంటే..
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, చైనాకు చెందిన ఒక షిప్పింగ్ సెక్యూరిటీ సంస్థ నౌకను ఇరాన్ హోర్ముజ్ జలసంధిలో సీజ్ చేసింది. సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలంటూ నౌకను ఇరాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. యూఏఈలోని ఫుజైరా తీరానికి కొంత దూరంలో నౌకను నిలిపి తనిఖీలు నిర్వహించారు. ఈ నౌక సైనోగార్డ్స్ మెరీన్ సెక్యూరిటీ అనే సంస్థకు చెందినదని తెలుస్తోంది. సంస్థ హాంకాంగ్‌లో రిజస్టర్ అయ్యింది. ఇక నౌక హాండురస్ దేశ జెండాతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హోర్ముజ్‌లో ఇతర నౌకలకు సాయుధ దళాలతో భద్రత కల్పించేందుకు ఈ నౌకను వినియోగిస్తున్నట్టు సమాచారం.
హోర్ముజ్‌లో సాయుధ భద్రతను కల్పించేందుకు తమకు మాత్రమే హక్కు ఉందని ఇరాన్ చెబుతోంది. ఈ విషయంలో మిత్ర దేశాలకు కూడా మినహాయింపులు లేవనే స్పష్టమైన సందేశాన్ని పంపించేందుకు నౌకను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఉదంతంపై సైనోగార్డ్స్ కంపెనీ మాత్రం ఇంకా స్పందించలేదు. ఇతర నౌకలకు భద్రతగా ఈ నౌకను హోర్ముజ్‌కు పంపించిందా? లేదా? అనే ప్రశ్నకు స్పందించలేదు. హోర్ముజ్ విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేందుకే చైనా నౌకను ఇరాన్ సీజ్ చేసిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమ సహనానికీ ఒక హద్దు ఉందని ఇరాన్ పరోక్షంగా తన మిత్రదేశాలకు చెప్పినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఇది తుపానుకు ముందు ప్రశాంతత.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
విదేశీ కార్లపై శ్రీలంకలో 50శాతం సర్‌ఛార్జి