వాహనదారులపై ఇంధన భారం.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు
ABN , Publish Date - May 17 , 2026 | 10:35 AM
దేశ రాజధాని అయిన ఢిల్లీలో సీఎన్జీ వాహనదారులకు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలే ఈ ఆకస్మిక ధరల పెంపునకు ప్రధాన కారణంగా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది. దేశవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడికి సీఎన్‌జీ (CNG) కంపెనీలు మరో గట్టి షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలే ఈ ఆకస్మిక ధరల పెంపునకు ప్రధాన కారణంగా మారాయి. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం దేశీయంగా సీఎన్‌జీ (CNG) ధరలను మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో పెను భారం పడినట్లైంది. తాజాగా, కేజీ సీఎన్‌జీపై ఒక రూపాయి చొప్పున ధరను పెంచారు. ఈ పెంపుతో అటు సొంత వాహనదారులు, ఇటు ఆటో, క్యాబ్ డ్రైవర్ల బడ్జెట్ తలకిందులైంది.
గడిచిన 48 గంటల్లోనే సీఎన్‌జీ ధరలు పెరగడం ఇది రెండోసారి. అంతకు ముందు మే 15వ తేదీన చమురు కంపెనీలు సీఎన్‌జీ ధర కిలో రూ.2 మేర పెంచాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సీఎన్‌జీ వాహనదారులపై మొత్తంగా మూడు రూపాయల అదనపు భారం పడినట్లయింది. తాజా పెంపుతో రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ ధర కేజీ రూ.80.09కి చేరింది. అలాగే, ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడా-గాజియాబాద్ ప్రాంతంలో ఈ రేటు రూ.88.70గా నమోదు కాగా.. హైదరాబాద్‌లో అత్యధికంగా రూ.100కు చేరింది. పశ్చిమాసియా యుద్ధం, హర్మూజ్ జలసంధిలో విధించిన ఆంక్షల నేపథ్యంలో గ్యాస్, చమురు ట్యాంకర్ల రవాణా నిలిచిపోయింది. ఈ పరిణామాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు భారీగా పెరగడంతో, దేశీయంగానూ ఇంధన ధరలను పెంచడం అనివార్యమైంది. నిరంతరం పెరుగుతున్న ఈ ధరలు సామాన్య, మధ్యతరగతి వాహనదారుల జేబుకు చిల్లు పెడుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
మరో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు ఖతం.. ట్రంప్ ప్రకటన
ఇరాన్‌పై మరోసారి దాడులు? ట్రంప్ నిర్ణయంపై ఉత్కంఠ