Share News

ఇరాన్‌పై మరోసారి దాడులు? ట్రంప్ నిర్ణయంపై ఉత్కంఠ

ABN , Publish Date - May 16 , 2026 | 09:34 AM

చైనా పర్యటన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై దృష్టి పెట్టారు. ట్రంప్ ఒప్పుకుంటే మరోసారి ఇరాన్‌పై ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్‌ను మొదలుపెట్టేందుకు వీలుగా సైన్యం ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఇరాన్‌పై మరోసారి దాడులు? ట్రంప్ నిర్ణయంపై ఉత్కంఠ
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: చైనా పర్యటన ముగించుకుని వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి విషయంలో దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది. దీన్ని తొలగించేందుకు ట్రంప్ మరోసారి ఇరాన్‌పై దాడులకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించేందుకు ప్రస్తుతం అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. యూఎస్‌లో మిడ్‌టర్మ్ ఎన్నికలకు మునుపే ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.


చైనా నుంచి తిరిగొస్తున్న సమయంలో ట్రంప్ మరోసారి తన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో ముచ్చటించారు. ఇరాన్ ప్రతిపాదనలను మరోసారి చూశానని చెప్పారు. వాటిల్లో మొదటి లైన్ తనకు నచ్చకపోయినా మొత్తం ప్రతిపాదనను చెత్తబుట్టలో వేస్తానని స్పష్టం చేశారు. ఇరాన్‌ గురించి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చించానని అన్నారు. అయితే, ఇరాన్‌ను రాజీకి ఒప్పించాలని మాత్రం తాను జిన్‌పింగ్‌ను కోరలేదని స్పష్టం చేశారు. ఇరాన్‌కు కీలక మిత్రదేశంగా ఉన్న చైనా పర్యటన అనంతరం ట్రంప్ మరోసారి దూకుడుగా ఇలాంటి వార్నింగ్స్ ఇవ్వడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ఇక ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అమెరికా రక్షణ శాఖ చర్యలు తీసుకుంటోంది. ట్రంప్ అనుమతి ఇస్తే ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్‌కు వీలుగా మిలిటరీ ఏర్పాట్లు చేసుకుంటోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికా క్షీణిస్తున్న దేశం.. చైనా అధ్యక్షుడి వ్యాఖ్య

పశ్చిమాసియాలో శాంతికి సహకరిస్తాం: ప్రధాని మోదీ

Updated Date - May 16 , 2026 | 09:51 AM