అమెరికా క్షీణిస్తున్న దేశం
ABN , Publish Date - May 16 , 2026 | 03:59 AM
చైనా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అడుగడుగునా ఇబ్బందికర పరిస్థితులే ఎదురయ్యాయి. తమతో అమెరికా ఎలా మసలుకోవాలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మొహమాటం లేకుండా ట్రంప్‌కు చెప్పేశారు.
ట్రంప్‌తో ఏకాంత చర్చల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యాఖ్యలు
బీజింగ్, మే 15: చైనా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అడుగడుగునా ఇబ్బందికర పరిస్థితులే ఎదురయ్యాయి. తమతో అమెరికా ఎలా మసలుకోవాలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మొహమాటం లేకుండా ట్రంప్‌కు చెప్పేశారు. గురువారం ఇద్దరు నేతలు జరిపిన ఏకాంత చర్చల్లో అమెరికా క్షీణిస్తున్న దేశమని జిన్‌పింగ్ సెటైర్లు వేశారు. తైవాన్ విషయంలో సరిగ్గా వ్యవహరించకపోతే ఘర్షణ తప్పదని ట్రంప్ ముఖంమీదే తెగేసి చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబి యో.. చైనాలోకి ప్రవేశించకుండా 2020లో విధించిన నిషేధాన్ని ఎత్తివేయకుండా.. ఆయన పేరు మార్చి ట్రంప్ వెంట రావటానికి అనుమతి ఇచ్చారు. అమెరికా మీడియాను చైనా అఽధికారులు ఎక్కడికక్కడ నియంత్రించారు. ఇంత జరిగినా చైనాలో తన పర్యటన అద్భుతంగా సాగిందని ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికా క్షీణిస్తున్న దేశమన్న జిన్‌పింగ్ వ్యాఖ్యలతో ట్రంప్ ఏకీభవించటం గమనార్హం. ఈ అంశంపై ఆయన సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో శుక్రవారం సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘అమెరికా క్షీణిస్తున్న దేశమని అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎంతో అందంగా చెప్పినప్పటికీ.. నాలుగు సంవత్సరాల జో బైడెన్ నిద్రావస్థ ప్రభుత్వ హయాంలో మా దేశానికి జరిగిన నష్టం దృష్ట్యా చూస్తే అది వందశాతం నిజం. ఆ నాలుగేళ్లలో అధిక పన్నులు, అన్నిరంగాల్లో లింగమార్పిడి వ్యక్తులకు ప్రవేశం కల్పించటం, మహిళా క్రీడల్లో పురుషుల ప్రవేశం, ప్రమాదకరమైన వాణిజ్య ఒప్పందాలు, నేరాల పెరుగుదల, సరిహద్దులను బార్లా తెరవటం తదితర అనేక పను ల వల్ల పూడ్చలేని నష్టం జరిగింది. ప్రపంచంపై చెరగని ముద్ర వేసిన గత 16 నెలల నా అద్భుత పాలన గురించి జిన్‌పింగ్ ప్రస్తావించలేదు. అమెరికా మళ్లీ ఆర్థిక శక్తిగా మారింది. అతి తక్కువ సమయంలోనే అద్భుత విజయాలు సాధించినందుకు జిన్‌పింగ్ నన్ను అభినందించారు. చైనాతో మా సంబంధాలు గతం కంటే మరింత బలపడుతాయని ఆశిస్తున్నా’ అని ట్రంప్ రాసుకొచ్చారు.
పరస్పర ఘర్షణ వద్దు: జిన్‌పింగ్
ట్రంప్‌తో తాను జరిపిన చర్చలు రెండు దేశాల మధ్య సహకారం మరింత బలపడేందుకు దోహదపడుతాయని జిన్‌పింగ్ అన్నారు. అమెరికా, చైనా ‘థూసిడిడీజ్ ట్రాప్’లో పడరాదని ట్రంప్‌కు జిన్‌పింగ్ సూచించారు. (ఇప్పటికే శక్తిమంతంగా ఉన్న ఒకదేశాన్ని కొత్తగా ఆర్థిక, సైనిక శక్తిగా ఎదుగుతున్న దేశం సవాల్ చేయటాన్నే థూసిడిడీజ్ ట్రాప్ అంటా రు. ప్రాచీనకాలంలో గ్రీస్‌లో ఆధిపత్యం కోసం స్పార్టా, ఏథెన్స్ నగర రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాలను ఆ దేశ చరిత్రకారుడు థూసిడిడీజ్ వివరించారు. ఆధునిక కాలంలో అలాంటి పరిస్థితిని హార్వర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ గ్రాహమ్ అలిసన్ సిద్ధాంతీకరిస్తూ.. దానికి థూసిడిడీజ్ ట్రాప్ అని పేరు పెట్టారు). రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు స్థిరంగా కొనసాగేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ట్రంప్.. తన పర్యటన ముగించుకొని అమెరికా వెళ్లారు.
అమెరికా మీడియాకు అవమానం
ట్రంప్ పర్యటనను రిపోర్టు చేసేందుకు ఆయన వెంట వచ్చిన అమెరికా మీడియా ప్రతినిధులకు చైనాలో అడుగడుగునా అవమానాలే ఎదురయ్యా యి. చైనా అధికారులు కఠిన ఆంక్షలతో అమెరికా మీడియాను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. దీంతో పలు సందర్భాల్లో అధికారులతో మీడియా ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. ట్రంప్-జిన్‌పింగ్ అధికారిక చర్చలకు మీడియాను దూరంగా ఉంచారు. అయితే, గరువారం తొలిదఫా చర్చల సమయంలో భారీ సంఖ్యలో గుమికూడిన చైనా మీడియా ప్రతినిధులు దురుసుగా ప్రవర్తించి, అమెరికా జర్నలిస్టులను తోసివేశారు. దీంతో ఒక అమెరికా జర్నలిస్టుకు స్వల్ప గాయాలయ్యాయి. ట్రంప్-జిన్‌పింగ్ టెంపుల్ ఆఫ్ హెవెన్ పర్యటన సమయంలోనూ చైనా అధికారులు అమెరికా జర్నలిస్టులను ఒకగదిలో చాలాసేపు బలవంతంగా ఉంచి, ఆ పర్యటనను కవర్ చేయకుండా కట్టడి చేశారు. టెంపుల్ ఆవరణలోకి ఆయుధంతో వెళ్లేందుకు ప్రయత్నించిన అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంటును అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య అరగంటపాటు వాగ్వాదం జరిగింది. తమకు చైనా అధికారులు కనీసం తాగునీరు, బాత్రూమ్ సౌకర్యం కూడా సరిగా కల్పించలేదని అమెరికా మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో చైనా పాలకులు అమెరికాలో పర్యటిస్తే తాము కూడా ఇలాగే వ్యవహరిస్తామని తెలిపారు.