Share News

ఆ దీవిలో ఒక్కటే కుటుంబం!

ABN , Publish Date - May 17 , 2026 | 01:39 PM

పచ్చని కొబ్బరిచెట్లు... చుట్టూ నీలి సముద్రం.... ఆ దీవిలోకి అడుగుపెడితే స్వర్గంలో ఉన్న అనుభూతి.

ఆ దీవిలో ఒక్కటే కుటుంబం!
Palmerston Island

పచ్చని కొబ్బరిచెట్లు... చుట్టూ నీలి సముద్రం.... ఆ దీవిలోకి అడుగుపెడితే స్వర్గంలో ఉన్న అనుభూతి. విచిత్రం ఏమిటంటే అలాంటి దీవిలో ఉండేది ఒకే ఒక్క కుటుంబం. అక్కడ నివసించేవారంతా ఒకే కుటుంబ సభ్యులు...

న్యూజీలాండ్‌కు 3200 కి.మీ దూరంలో పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న అతి చిన్న దీవి ‘పాల్మెర్‌స్టన్‌’. ఈ దీవిలో ప్రస్తుతం 62 మంది నివసిస్తున్నారు. ఇందులోని వారంతా ఒకే కుటుంబసభ్యులే. జీవనోపాధి కోసం కొబ్బరిబొండాలు తీయడం, చేపలు పట్టడం చేస్తారు. ఖాళీ సమయాల్లో ఈతకొట్టడం, వాలీబాల్‌ ఆడటం చేస్తుంటారు. నడి సంద్రంలో ఉన్నారు కాబట్టి ఎలాంటి సౌకర్యాలు ఉండవనుకుంటే పొరపాటే. ఈ దీవికి విద్యుత్తు, ఇంటర్నెట్‌ వంటి సదుపాయాలున్నాయి. అయితే అవి కొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.


కొద్దిమంది మొబైల్‌ ఫోన్‌, శాటిలైట్‌ టీవీని ఉపయోగిస్తున్నారు. దీవిలో ఎలాంటి వస్తువుల అమ్మకాలు జరగవు. బయటి నుంచి సరుకులు కొనుగోలు చేయడానికి మాత్రమే డబ్బులు ఉపయోగిస్తారు. ఇక దీవిలో రెండు టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. తాగునీటి అవసరాలకు వర్షపు నీటిని పట్టుకుని దాచుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం ప్రార్థన కోసం చర్చి గంట మోగిన తరువాత అందరూ పనులన్నీ పక్కన పెట్టేస్తారు. సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా గడుపుతారు.


xxx.jpgకెప్టెన్‌ కుక్‌ కనిపెట్టాడు...

ఈ విచిత్ర దీవికి పడవల ద్వారా మాత్రమే చేరుకోవాల్సి ఉంటుంది. పాల్మెర్‌స్టన్‌ దీవి, కుక్‌ దీవుల మధ్య ఉంది. ఈ దీవులను జేమ్స్‌ కుక్‌ 1777లో కనిపెట్టారు. ఆయనే ఈ దీవికి పాల్మెర్‌స్టన్‌ అని నామకరణం చేశారు. ఆ తర్వాత 8 దశాబ్దాల పాటు ఆ దీవిలో ఎవరూ నివసించలేదు. 19వ శతాబ్దం మధ్యలో ఆంగ్లేయుడైన విలియం మార్‌స్టర్స్‌ ఈ దీవిని చూసి ముగ్ధుడయ్యాడు. ఆ సమయంలో దీవి బ్రిటిష్‌ జాతీయుడైన జాన్‌ బ్రాండర్‌ అధీనంలో ఉండేది. విలియం ఆయనను కలసి దీవి బాధ్యతను తీసుకున్నాడు.


అక్కడ కొబ్బరి చెట్లను నాటడం, వాటి సంరక్షణ బాధ్యతలు చూడటం విలియం పని. 1863లో విలియం తన భార్యను, మరొక మహిళను, ఆమె కజిన్లు ఇద్దరిని కూడా దీవికి తీసుకెళ్లాడు. ఏడాదికి రెండుసార్లు ఒక ఓడ సామగ్రితో దీవికి వచ్చేది. సరుకులకు బదులుగా వారికి విలియం కొబ్బరినూనె ఇచ్చేవాడు. అయితే కొంతకాలానికి ఓడలు రావడం మానేశాయి. అయినా విలియం కుంగిపోలేదు. బతకడానికి మరో మార్గం ఎంచుకున్నాడు. ఓడ ప్రమాదంలో కొట్టుకొచ్చిన కలపతో ఇల్లు నిర్మించు కున్నాడు. కొన్నాళ్లకు బ్రాండర్‌ చనిపోవడంతో దీవి యాజమాన్య బాధ్యతలు విలియంకు దక్కాయి.


xxxx.jpgవిలియం చనిపోయే ముందు ద్వీపాన్ని ఇద్దరు భార్యలకు రాసిచ్చాడు. 1950 నుంచి 1970 మధ్య ఆ దీవిలో 300 మంది వరకు నివసించేవారు. కొంతమంది వలస వెళ్లిపోయారు. ప్రస్తుతం 62 మంది మిగిలారు. ఎవరైనా ఈ దీవిని సందర్శించాలంటే సాహసోపేతమైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్కడ హోటళ్లు, రిసార్టులు ఉండవు. దీవిలో ఎవరిని ముందుగా పలకరిస్తారో వాళ్లే బస కల్పిస్తారు. అడ్వెంచర్‌ టూరిజంను ఇష్టపడేవారు ఈ దీవిని సందర్శిస్తుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సరదాగా సరిహద్దుల్లోకి...

శ్రీవారి ‘మెడికల్‌ దర్శనం’ కోటాను విస్తరించండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 17 , 2026 | 01:39 PM