శక్తిమేర పనిచేసే కొత్తిమీర
ABN , Publish Date - May 17 , 2026 | 12:07 PM
ముదిరిన కొత్తిమీర మొక్క వేళ్ళ కొనలు మెలితిరిగి పిలక కొత్తెంలా కనిపిస్తాయి. కొత్తెం అంటే, కొన మెలితిరిగినదని! ‘ఈరం’ అంటే పొద. కొత్తెము+ఈరము కొత్తిమీర అయి ఉండ వచ్చు.
ముదిరిన కొత్తిమీర మొక్క వేళ్ళ కొనలు మెలితిరిగి పిలక కొత్తెంలా కనిపిస్తాయి. కొత్తెం అంటే, కొన మెలితిరిగినదని! ‘ఈరం’ అంటే పొద. కొత్తెము+ఈరము కొత్తిమీర అయి ఉండ వచ్చు. డచ్‌లో కెతొంబర్, మలయాలో కెతుం బర్, అమెరికాలో సిలియాంట్రో అంటారు. దక్షిణాదిలో ఉత్తంపరి, కుస్తుంబరి అంటారు. తెలుగులో కొత్తమల్లి అనటం కూడా ఉంది.
కొత్తిమీర పరిమళ ద్రవ్యం. ఔషధ గుణాలతో పాటు ప్రాణవాయువును శుద్ధి చేసే పర్యావరణ పరిరక్షకం కూడా! ఒక గాజు గ్లాసులో నీళ్ళుపోసి, వేళ్ళతో సహా కొత్తిమీర మొక్కల కట్టని అందులో ఉంచితే రోజంతా గదిలో దుర్వాసన రాకుండా డియోడరెంట్‌గా ఉపయోగపడుతుంది.
కొత్తిమీర పరిమళం దాని ఆకులలో కన్నా వేళ్ళలోనే ఎక్కువ. తెలుగువాళ్ళు ఏ కారణం చేతో వేళ్ళని పారేసి, ఆకులు మాత్రమే వాడు తున్నారు. కానీ, థాయిలాండ్ వంటకాల్లో కొత్తి మీర వేళ్ళనే ఎక్కువ వాడతారు. లేత కొత్తిమీర వేళ్ళను శుభ్రపరచి, ఆకులతో సహా నూరి పచ్చడి చేసుకోవచ్చు. ఎక్కువ ఆరోగ్యదాయకం కూడా! ముదిరిన వేళ్ళను చిన్న ముక్కలుగా తరిగి, నేతి బొట్టు వేసి, దోరగా వేగించితే ఆ వేళ్ళలోంచి సుగంధం బయటకు వస్తుంది. వాటిని పులుసులోనూ, చారులోనూ వాడుకోవచ్చు.
కొత్తిమీర వేళ్ళతో సహా దంచి రసం తీసుకుని తాగితే జ్వరం వెంటనే తగ్గుతుంది. మానసిక ఆందోళనలను అదుపు చేస్తుంది. నిద్రపట్టిస్తుంది. విషదోషాలను హరిస్తుంది. బీపీని తగ్గిస్తుంది. పైత్య వికారాలు, తలతిరు గుడు వ్యాధులలో ఈ రసం పనిచేస్తుంది. చలవనిస్తుంది. పేగులు, కిడ్నీలు, లివరుకు సంబంధించిన సమస్యలపైన పనిచేస్తుంది. దప్పిక తీరుస్తుంది. గుండెకు బలాన్నిస్తుంది. మలమూత్రాలు ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. అమీబియాసిస్ వ్యాధిలో బ్యాక్టీరియాని ఎదుర్కొంటుంది.
మూత్రాశయ వ్యాధులు, మూత్రంలోంచి వీర్యం పోతున్న వారికి దీని ఆకురసంమంచిది. పేగుపూతకు విలువైన ఔషధం. నరాల జబ్బులు, చర్మవ్యాధులు, ఎలర్జీ సంబంధ వ్యాధుల్లో ఇది ఔషధమే! కామెర్లను, రక్తహీన తను తగ్గిస్తుంది. సున్నితమైన శరీరతత్వం వున్న వారికి కొత్తిమీర మంచి నేస్తం. కళ్ళ మంటలు, కళ్లు ఎర్రపడటం, తలనొప్పి, తలలో వేడి తగ్గుతాయి. తరచూ నోటిపూత, పళ్ళ లోంచి నెత్తురు కారడం లాంటి వ్యాధులు వచ్చేవారు కొత్తిమీర ఆకుల రసాన్ని తేనెకలిపి తాగితే నోటిపూత, పేగుపూత, అరికాళ్ల మం టలు, గుండెలో మంటగా ఉండటంతగ్గుతాయి.
సలాడ్, సూప్ లాంటి పేర్లతో తయారు చేసుకొనే సాసేజీ వంటకాల్లో కొత్తిమీర, ధని యాల పొడి తగినంత చేర్చుకొంటే ఆ వంటకం ఆరోగ్యకరంగా వుంటుంది. ఆమ్లెట్లు, చట్నీలు, కుకీలు, కేకులు, చాట్ మసాలాలు ఇవన్నీ కొత్తిమీరకు అనుకూలంగా ఉంటాయి. కొత్తి మీరని మెత్తగా రుబ్బిన గుజ్జుని వేడి అన్నంలో కలిపి తాలింపు పెట్టిన కొత్తిమీర రైస్ రుచిగా జీర్ణశక్తిని బలసంపన్నం చేసేదిగా వుంటుంది. బిరియానీ. ఫ్రైడ్ రైస్ లకన్నా మేలైనది.
చింత ఆకుని కొత్తిమీరని నీడన ఎండించి వాటికి సమానమైన తూకంతో ధనియాలు ఇతర సుగంధ్ర ద్రవ్యాలను వేగించి కలిపి నూరిన కారప్పొడి ఆరోగ్యదాయకం. ధని యాలు, మిరియాలు, జీలకర్ర వగైరా సుగంధ ద్రవ్యాలను, ఎత్తుకెత్తు కొత్తిమీరని కలిపి మిక్సీ పట్టి కాచిన చారు జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది.
కొత్తిమీర మనకు తెలియకుండానే మనం తినే సీసం, పాదరసం లాంటి కఠిన ఖనిజ విషాలను శరీరంలోంచి బయటకు వెళ్ళగొట్టడానికి దోహదపడ్తుంది.
కొత్తిమీరను తినని వారుండరు. విచిత్రం ఏమంటే దాని గుణాలను ఆయుర్వేద గ్రంథాలు మాత్రమే విశ్లేషించాయి. అవి తప్పనిగానీ ఒప్పనిగానీ నిర్ధారించే ప్రయత్నాలు జరగలేదు. కొత్తిమీరపైన ఆధునిక పరిశోధనలు కూడా కొత్త పరిశోధనా విశేషాలు ప్రకటించినవి తక్కువ. ఒక విలువైన ఆహార పరిమళ ద్రవ్యాన్ని శాస్త్రీయంగా ఉపయోగించు కోవటంలో మనం విఫలం అవటం విచిత్రమే!
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి ‘మెడికల్ దర్శనం’ కోటాను విస్తరించండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News