మొయినాబాద్ జంట హత్యల కేసు.. అప్పు తీర్చమని అడిగినందుకు..
ABN , Publish Date - May 17 , 2026 | 11:13 AM
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలో కలకలం రేపిన జంట హత్యల కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..
మొయినాబాద్, మే 17: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలో కలకలం రేపిన జంట హత్యల కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించమని ఒత్తిడి చేసినందుకు ఇద్దరు మహిళలను అత్యంత కిరాతకంగా అంతమొందించినట్లు పోలీసులు నిర్ధారించారు. నమ్మించి ప్రాణాలు తీసిన ఈ ఘోర ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల కథనం మేరకు.. ప్రధాన నిందితురాలైన కరీమాబేగం బాధితుల వద్ద పెద్ద మొత్తంలో అప్పు తీసుకుంది. గత కొంతకాలంగా ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని బాధితులు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఎలాగైనా వారిని అంతం చేయాలనుకుంది. అందుకోసం కరీమాబేగం పక్కా స్కెచ్ వేసింది. బాకీ ఉన్న డబ్బులు మొత్తం ఒకేసారి చెల్లిస్తానని నమ్మబలికి, బాధితులిద్దరినీ మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌కు రప్పించింది.
డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికిన కరీమాబేగం.. బాధితులిద్దరినీ మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌కు పిలిపించింది. ఈ ఘాతుకానికి పాల్పడేందుకు కరీమాబేగం తన ఇద్దరు ప్రియులైన రెహమాన్, నయీమ్‌లను రంగంలోకి దించింది. ఫామ్‌హౌస్‌కు చేరుకున్న ఇద్దరు మహిళలపై నిందితులు ముగ్గురూ కలిసి ఒక్కసారిగా దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాలను అక్కడే దాచిపెట్టి పరారయ్యారు. బాధితుల అదృశ్యంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కరీమాబేగం కదలికలపై అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే కరీమాబేగంతో పాటు ఆమె ప్రియులు రెహమాన్, నయీమ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో వారిని నేరుగా క్రైమ్ స్పాట్‌కు తరలించారు. అక్కడ ఫామ్‌హౌస్ ఆవరణలో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఇద్దరు మహిళల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులు నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి ‘మెడికల్ దర్శనం’ కోటాను విస్తరించండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News