శ్రామికుణ్ని వరించిన అదృష్టం.. గంటలో కోటీశ్వరుడిగా మార్చిన లాటరీ టికెట్
ABN , Publish Date - Sep 22 , 2026 | 10:30 AM
ఒక్క గంటలో ఓ శ్రామికుడు కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఒక లాటరీ టికెట్‌తో ఏకంగా మూడు కోట్లు గెలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఓ శ్రామికుడి జీవితం గంటలో మారిపోయింది. రూ.500 కోసం రోజంతా కష్టపడే అతణ్ని అదృష్టం వరించింది. గంట ముందు కొన్న లాటరీ టికెట్ అక్షరాలా మూడు కోట్ల రూపాయలను గెలుచుకుంది. దీంతో ఆ శ్రామికుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన మధు సింగ్ అనే వ్యక్తి రోజూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. అక్కడ వేతనం చాలక ఈ మధ్యనే పంజాబ్‌లోని బంగాకు వలస వచ్చాడు. అయితే ఓ రోజు కూలీ పనుల ముగించుకుని తిరిగి వస్తున్న మధు సింగ్‌కు ఒక లాటరీ స్టాల్ కనిపించింది. ఇంకో గంటలోనే లాటరీ ఫలితాలు వెలువడతాయని తెలుసుకున్న అతడు.. ఓ టికెట్ కొన్నాడు. అంతే అక్కడితో కథ మారిపోయింది. గంట తరువాత ‘మీరు లాటరీ గెలుచుకున్నారు. దాని విలువ రూ.3 కోట్లు’ అని మధుకు ఫోన్ కాల్ వచ్చింది. కానీ అతడికి అది నమ్మబుద్ధి కాలేదు. అయినా లాటరీ స్టాల్ దగ్గరకు వెళ్లి అడిగితే.. విషయం తెలిసింది. దాంతో మధు సింగ్‌కు పట్టలేనంత ఆనందం కలిగింది. కుటుంబానికి లాటరీ గురించి చెప్పగానే వారూ ఎగిరి గంతేశారు. ఒక గంటలో జీవితాలు మారిపోయినందుకు వారి సంతోషానికి అవధుల్లేవు.
అన్ని వివరాలూ పరిశీలించాక మధుకు బహుమతి అందజేస్తామని లాటరీ నిర్వాహకులు వెల్లడించారు. ఈ భారీ మొత్తంతో ఏం చేస్తావని సదరు శ్రామికుణ్ని అడగగా.. మంచి ఇల్లు నిర్మించుకుంటానని, కుటుంబాన్ని బాగా చూసుకుంటానని, కొంత స్వగ్రామం కోసం ఖర్చుపెడతానని అతడు చెబుతున్నాడు.
ఈ వార్తలూ చదవండి
మరుగుతున్న మసాలా టీలో ఐఫోన్ 18 ప్రో మాక్స్.. వీడియో వైరల్
తీర్థయాత్రలో తప్పిపోయిన వృద్ధుడు.. కలిపిన చాట్‌జీపీటీ