Share News

తీర్థయాత్రలో తప్పిపోయిన వృద్ధుడు.. కలిపిన చాట్‌జీపీటీ

ABN , Publish Date - Sep 21 , 2026 | 07:30 AM

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ తీర్థయాత్ర కోసం వెళ్లిన ఓ వృద్ధుడు తప్పిపోయారు. అయితే ఓ వ్యక్తి చాట్‌జీపీటీ సహాయంతో ఆ వృద్ధుడిని కుటుంబంతో కలిపారు. వివరాల్లోకి వెళితే..

తీర్థయాత్రలో తప్పిపోయిన వృద్ధుడు.. కలిపిన చాట్‌జీపీటీ
Missing Elderly Man Chaman Lal

ఇంటర్నెట్ డెస్క్: ఏ పని అయినా ఇట్టే చేయగల ఏఐ.. తాజాగా తీర్థయాత్రలో తప్పిపోయిన వృద్ధుడిని కుటుంబంతో కలపడంలో సహాయపడింది. పంజాబ్‌లోని లూధియానా జిల్లా ఫతేగఢ్ గుజ్రాన్ గ్రామంలో చమన్ లాల్ అనే వృద్ధుడు కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల 11న ఈ కుటుంబం పంజాబ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ముఖ్యమంత్రి తీర్థయాత్ర పథకం’ కింద అమృత్‌సర్ గోల్డెన్‌ టెంపుల్ యాత్రకు వెళ్లారు. అయితే మతిమరుపు సమస్య ఉన్న చమన్ లాల్ యాత్ర మధ్యలో కుటుంబం నుంచి విడిపోయారు. తిరిగి ఇంటికి చేరుకునేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లిన ఆ వృద్ధుడు లూధియానాకు బదులు బిహార్ రైలు ఎక్కేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు ఆయన కోసం వెతుకుతూనే ఉన్నారు.


ఆ తరువాత చమన్ లాల్ బిహార్‌లోని గయలో రైలు దిగారు. అయోమయంలో ఉన్న ఆయన్ను గమనించిన నీరజ్ అనే స్థానిక వ్యక్తి సహాయం అందించారు. ఆ వృద్ధుడికి భోజనం పెట్టి ఆరా తీశారు. చమన్ లాల్‌కు ఊరి పేరు తప్ప మరేదీ గుర్తు లేదు. ఫతేగఢ్ గుజ్రాన్ తమ గ్రామమని ఆయన చెప్పారు. నాలుగు రోజులు ఆ వృద్ధుడికి నీరజ్ ఆశ్రయమిచ్చారు.


చాట్‌జీపీటీ సహాయం

చమన్ చెబుతున్న గ్రామం ఎక్కడుందో తెలసుకునేందుకు నీరజ్ చాట్‌జీపీటీకి పని చెప్పారు. ఫతేగఢ్ గుజ్రాన్ కోసం మూడు రోజుల పాటు ఇంటర్నెట్‌లో శోధించారు. ఎట్టకేలకు చాట్‌జీపీటీ ద్వారా ఆ గ్రామం పంజాబ్‌లోని లూధియానా జిల్లాలో ఉందన్న విషయం తెలిసింది. అయితే మతిమరుపు ఉన్న చమన్ లాల్‌ను ఒంటరిగా పంపించడానికి నీరజ్‌కు మనసు ఒప్పుకోలేదు. అందుకే తను కూడా ఆయనతో పాటే బిహార్ నుంచి పంజాబ్‌కు బయలుదేరారు. అక్కడి ప్రజల ద్వారా అడ్రస్ తెలుసుకుని చమన్‌ను క్షేమంగా ఇంటికి చేర్చారు. వృద్ధుడిని తమ వద్దకు తీసుకువచ్చినందుకు ఆయన కుటుంబం నీరజ్‌కు ధన్యవాదాలు తెలిపింది.


ఈ వార్తలూ చదవండి

ఏఐకి కొత్త పేరు పెట్టండి.. ప్రజలకు ట్రంప్ పోలింగ్

స్విగ్గీ డెలివరీ బాయ్‌ సంపాదన.. రూ.53 లక్షలు

Updated Date - Sep 21 , 2026 | 07:59 AM