Share News

‘చరిత్రపై తెలుగు సంతకం’.. ఒక మేల్కొలుపు

ABN , Publish Date - Sep 21 , 2026 | 07:08 AM

డీపీ అనురాధ రచించిన ‘చరిత్రపై తెలుగు సంతకం’ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. తెలుగువారి 2,500 ఏళ్ల చరిత్రను పుస్తకంలో అందించిన రచయిత్రి ప్రయత్నాన్ని వక్తలు అభినందించారు.

‘చరిత్రపై తెలుగు సంతకం’.. ఒక మేల్కొలుపు
Book launch

  • డీపీ అనురాధ పుస్తకావిష్కరణలో వక్తల ప్రశంస

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘‘మన చరిత్ర మనకంతగా చెందనిదన్నట్టు.. అందులో మన స్థానం అల్పమన్నట్టు భావించే ఆత్మన్యూనత మనలో ఎక్కువ. అలాంటి మనోభావాలకు సీనియర్‌ జర్నలిస్టు డీపీ అనురాధ రాసిన ‘చరిత్రపై తెలుగు సంతకం’ ఒక కనువిప్పు, ఒక మేల్కొలుపు’’ అని వక్తలు కొనియాడారు. భాషా వైవిధ్యం, భావోద్వేగ గాఢత, పదాలపై రచయిత్రి సాధించిన అపూర్వపట్టు- ఈ మూడింటి సమన్వయంతో ఈ పుస్తకం ఒక లయాన్విత ప్రవాహంలా ముందుకు సాగుతుందని ప్రశంసించారు. ఆదివారం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఆధ్వర్యంలో అజు పబ్లికేషన్స్‌ ప్రచురించిన ‘చరిత్రపై తెలుగు సంతకం’ పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారుడు కేవీ రమణాచారి ఆవిష్కరించారు.


తెలుగు భాషోద్యమ సమాఖ్య సామల రమే్‌షబాబుకు ఈ పుస్తకాన్ని రచయిత్రి అంకితం ఇచ్చారు. రమణాచారి మాట్లాడుతూ భౌగోళిక సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగువారి చరిత్రను అక్షరబద్ధం చేసిన రచయిత్రి ప్రయత్నం స్ఫూర్తిదాయకమన్నారు. ఈనాడు ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో 5.60 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదువుతుంటే, కేవలం 25 నుంచి 30 వేలమంది మాత్రమే తెలుగు మాధ్యమంలో అభ్యసిస్తున్నారన్నారు. ప్రముఖ స్థపతి ఈమని శివనాగిరెడ్డి పుస్తక పరిచయం చేశారు. రచయిత్రి స్పందిస్తూ గత 2,500 ఏళ్లుగా తెలుగువాళ్లు సాధించిన ఘనకీర్తిని ఈ చిన్నపుస్తకం రూపంలో అందిస్తున్నాని చెప్పారు. తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావు, తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య బీహెచ్‌ పద్మప్రియ పాల్గొన్నారు.


వార్తలనూ చదవండి:

బీసీల కోసం దేశవ్యాప్త ఐక్య పోరాటం
సీఎం సన్నిహితుడు గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 07:08 AM