Share News

పిడుగుపాటుకు ఫోన్‌ పేలి బాలుడి మృతి

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:03 AM

తెలంగాణలో పిడుగులు, భారీ వర్షాల కారణంగా ఓ విద్యార్థి మృతి చెందగా ఇద్దరు రైతులు గాయపడ్డారు. పలు జిల్లాల్లో పశువులు మృత్యువాతపడగా, మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

పిడుగుపాటుకు ఫోన్‌ పేలి బాలుడి మృతి
charan singh

  • కామారెడ్డిలో మరో ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు..

  • 20కి పైగా మూగజీవాల మృత్యువాత

  • నేడు, రేపు భారీ వర్షాలు

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు విరుచుకుపడిన పిడుగుల ధాటికి సెల్‌ ఫోన్‌ పేలి ఒక విద్యార్థి మృతిచెందగా, కామారెడ్డి జిల్లాలో మరో ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో పాడి పశువులు, గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండాకు చెందిన ఇంటర్‌ విద్యార్థి చరణ్‌ సింగ్‌ (18) పొలంలో బాబాయ్‌కి సాయం చేసి తిరిగొస్తుండగా వర్షం మొదలైంది. భారీ ఉరుములతో పాటు ఒక్కసారిగా పడిన పిడుగు యువకుడి జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ను తాకడంతో అది పేలిపోయింది.


Lightning-Strikes-Kill-Stud.jpg

దీంతో అపస్మారక స్థితికి చేరుకున్న చరణ్‌ను నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. స్టేషన్‌ తండాలోని సబ్‌స్టేషన్‌లో, సిర్నాపల్లి గ్రామంలో విద్యుత్‌ స్తంభంపై కూడా పిడుగులు పడటంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని బొప్పాజీవాడకు చెందిన మేకల సూర్యకాంత్‌, బుర్గుల్‌ గ్రామానికి చెందిన గైని శంకర్‌ పత్తి చేనులో గుంటుకు కొడుతున్నారు. వర్షం రావడంతో ఇద్దరు గొడుగు పట్టుకుని నిలుచున్నారు. ఈ క్రమంలో వారి సమీపంలో పిడుగు పడటంతో వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు పేలిపోయాయి. దీంతో ఇద్దరు అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే రైతులను గాంధారి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే మండల కేంద్రంలోని సేవాలాల్‌ ఆలయంపై కూడా పిడుగు పడటంతో గుడి పాక్షికంగా దెబ్బతిన్నది.


పిడుగుపాటు ధాటికి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీగా మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. నిర్మల్‌ జిల్లా రూరల్‌ మండలంలో పిడుగు పడి ఆరు గేదెలు, ఒక ఆవు మృతి చెందాయి. సోన్‌ మండలం జాఫ్రాపూర్‌ గ్రామంలోని హనుమాన్‌ ఆలయం వెనుక ఉన్న ఓ ఇంటి ఆవరణలోని చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రామారావుపల్లిలో పిడుగు పడి 12 గొర్రెలు అక్కడికక్కడే మరణించాయి. ఆదిలాబాద్‌ జిల్లా లోహరా గ్రామంలో ఒక ఎద్దు, ఆవు, భాద్రాది జిల్లా ఉదోసనపల్లిలో రెండు ఆవులు పిడుగుపాటుకు బలికావడంతో బాధితులు లక్ష్యల్లో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.


వర్షాల కారణంగా పలు చోట్ల రాకపోకలు నిలిచిపోగా రహదారులు జలమయమయ్యాయి. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ - మైల్వార్‌ మధ్య రూ.39 కోట్లతో చేపడుతున్న రోడ్డు నిర్మాణానికి సంబంధించి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్‌ రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌ నగరంలో కాప్రా, మేడ్చల్‌, షేక్‌పేట్‌, నాగారం, దమ్మాయిగూడ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కుత్బుల్లాపూర్‌ దూలపల్లిలో ప్రధాన రహదారిపై విద్యుత్‌తీగలు తెగిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.


కొన్ని జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడక్కడ పడే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

బాబోయ్‌.. ఎంజీఎం
పచ్చ ప్లేటుతో పొట్టగొట్టొద్దు సారూ!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 06:39 AM