బీసీల కోసం దేశవ్యాప్త ఐక్య పోరాటం
ABN , Publish Date - Sep 21 , 2026 | 07:00 AM
2027 జనగణనలో ప్రత్యేక ఓబీసీ కాలమ్ చేర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీసీల జనాభాను శాస్త్రీయంగా లెక్కించి జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
2027 జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలి
50 శాతం రిజర్వేషన్ పరిమితిపై కేంద్రం పునరాలోచించాలి
జాతీయ ఓబీసీ సదస్సులో మంత్రి పొన్నం
హైదరాబాద్, అమీర్‌పేట, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): బీసీల హక్కులు, సామాజిక న్యాయం సాధించేందుకు దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం అవసరమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో... ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల జనాభా ఎంతుందో శాస్త్రీయంగా లెక్కించినప్పుడే వారికి జనాభా ప్రాతిపదికన న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించడం సాధ్యమవుతుందన్నారు. ఆదివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో... ‘ఓబీసీ జన గణనపై కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఓబీసీల తక్షణ బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణ’ అంశంపై నిర్వహించిన జాతీయ ఓబీసీ సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపట్టామని.. ఇంటింటికీ వెళ్లి స్వీయ ప్రకటన ఆధారంగా వివరాలు సేకరించామని, ప్రతి 150 కుటుంబాలకు ఒక ప్రభుత్వోద్యోగిని కేటాయించి గణన పూర్తిచేసామని తెలిపారు. కులగణన కేవలం జనాభా లెక్కల ప్రక్రియ కాదని, సామాజిక న్యాయానికి పునాది అన్నారు. ఈడబ్యూఎస్ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన పొన్నం... బీసీలకు వారి జనాభా ప్రాతిపాదికన న్యాయం జరిగే విషయంలో 50 శాతం పరిమితిపై పునరాలోచించాలన్నారు.
ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు మాట్లాడుతూ బీసీ కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వంద రోజుల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం రాహుల్ గాంధీ నాయకత్వంలో ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. కాగా కేంద్రం తెలంగాణను రోల్ మోడల్‌గా తీసుకుని జనగణనలో కులగణన చేపట్టాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ కోరారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, ముదిరాజ్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ.. జనగణనలో ఓబీసీ కాలమ్‌తో పాటు ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
వార్తలనూ చదవండి:
గురువే హంతకుడు
సీఎం సన్నిహితుడు గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు!
Read Latest Telangana News And Telugu News