Share News

గురువే హంతకుడు

ABN , Publish Date - Sep 21 , 2026 | 06:45 AM

పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి మృతి కేసును పోలీసులు ఛేదించి, ఆమె గురువు జెట్టి నవీన్‌కుమార్‌ను నిందితుడిగా అరెస్టు చేశారు. విద్యార్థినిపై సింగరేణి ఓవర్‌మన్‌ రవికుమార్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలగా, ఆమెతో అతని సాన్నిహిత్యాన్ని ఓర్వలేక నవీన్‌కుమార్‌ ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

గురువే హంతకుడు
Akshitharani case

  • వీడిన అక్షితారాణి హత్య కేసు మిస్టరీ

  • సింగరేణి ఓవర్‌మన్‌తో సాన్నిహిత్యాన్ని ఓర్వలేకే హత్య

  • శిక్షణకు వచ్చిన విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఓవర్‌మన్‌ రవికుమార్‌

కోల్‌సిటీ, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని తాండ్ర అక్షితారాణి (20) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ (మైనింగ్‌) చదువుతున్న ఆ యువతిని, ఆమె గురువు, పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ జెట్టి నవీన్‌కుమార్‌ కడతేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బొగ్గుగనుల్లో శిక్షణకు వచ్చిన ఆమెపై ఓవర్‌మన్‌ (సూపర్‌వైజర్‌) బొమ్మకంటి రవికుమార్‌ అత్యాచారం చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. హత్య, అత్యాచారం కేసుల్లో ఈ ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి వెల్లడించారు.


సుల్తానాబాద్‌ మండ లం గర్రెపల్లికి చెందిన అక్షితారాణి.. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని సింగరేణి పాలిటెక్నిక్‌లో 2022లో డిప్లొమా చేసింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన జెట్టి నవీన్‌కుమార్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరిదీ ఒకే గ్రామం కావడంతో పరిచయం పెంచుకుని సన్నిహిత సంబంధాలు కొనసాగించాడు. భార్యతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటున్న నవీన్‌కుమార్‌.. అక్షితారాణిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ మైనింగ్‌లో చేరింది. ఆమె కుటుంబం కూడా గోదావరిఖనికి మారడంతో అక్కడి బొగ్గుగనుల్లో 12 రోజుల ఇంటర్న్‌షిప్‌ కోసం జనవరిలో చేరింది.


ఆ గనిలో ఓవర్‌మన్‌గా పనిచేస్తున్న బొమ్మకంటి రవికుమార్‌ తాను కూడా నస్పూర్‌ పాలిటెక్నిక్‌ విద్యార్థినని, నవీన్‌కుమార్‌ శిష్యుడినని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ఆమెను లైంగికంగా వేధించడంతో బాధితురాలు రవికుమార్‌పై సింగరేణి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీనిపై కమిటీ వేసి విచారణ జరిపిన యాజమాన్యం.. ఇందులో రవికుమార్‌ తప్పిదం లేదని నిర్ధారించింది. తర్వాత బాధితురాలిని రవికుమార్‌ లైంగికంగా లొంగదీసుకున్నాడు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని గుర్తించిన నవీన్‌కుమార్‌ తట్టుకోలేకపోయాడు.


బాధితురాలిని కడతేర్చాలని నిర్ణయించుకుని ఈనెల 12న ఆమెను కారులో ఎక్కించుకుని తిప్పుతూ.. బలవంతంగా పురుగు మందు తాగించాడు. తర్వాత ఆమె తో సూసైడ్‌ నోట్‌ రాయించి, ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. బాధితురాలు స్పృహ కోల్పోగా..ఆమె మొబైల్‌ఫోన్‌ నుంచే వారి తండ్రికి ఫోన్‌చేసి, ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి పరారయ్యాడు. బాధితురాలు చికిత్స పొందుతూ 13న మరణించింది. పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్‌ రికార్డులు, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని ఆదివారం గోదావరిఖనిలో అరెస్టు చేశారు. మరో నిందితుడు రవికుమార్‌ను రిమాండ్‌కు తరలించారు.


వార్తలనూ చదవండి:

ఆడుకునేందుకు కారెక్కి.. ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి మృతి
సీఎం సన్నిహితుడు గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 06:45 AM