ఆడుకునేందుకు కారెక్కి.. ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి మృతి
ABN , Publish Date - Sep 21 , 2026 | 06:30 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కారులో చిక్కుకున్న నాలుగేళ్ల చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. ఇంటి వద్ద ఆడుకుంటూ కారులోకి వెళ్లిన చిన్నారి బయటకు రాలేక ఈ విషాదం చోటుచేసుకుంది.
భద్రాద్రి జిల్లాలో విషాదం..
మృతురాలు సర్పంచ్ కుమార్తె
జూలూరుపాడు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆడుకునేందుకు కారెక్కిన ఓ చిన్నారి.. అందులోనే చిక్కుకొని ఊపిరాడక మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని వినోభానగర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ గంగావత్ నవీన్, ఐశ్వర్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు తన్వితశ్రీ (4), సురక్ష ఉన్నారు. పెద్ద కుమార్తె తన్వితశ్రీ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటూ అక్కడున్న లాక్ చేయని తమ కారులోకి ఎక్కింది. ఆమె లోపలికి వెళ్లగానే కారు డోరు లాక్ కావడంతో బయటకు రాలేకపోయిన చిన్నారి.. అందులోనే చిక్కుకొని ఊపిరాడక సృహ కోల్పోయింది.
కొద్దిసేపటి తర్వాత తల్లి ఐశ్వర్య తన కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురై బంధువులతో కలసి ఇంటి సమీపంలోని గణేశ్ మండపం వద్ద వెతికింది. అయినా ఎక్కడా కనిపించలేదు. గ్రామస్తులకు అనుమానం వచ్చి కారులో చూడగా.. చిన్నారి కారు సీటు ముందు కిందపడి కనిపించింది. ఆమెను బయటకు తీసి మొదట జూలూరుపాడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడినుంచి కొత్తగూడెంలోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కన్న కూతురి మృతితో సర్పంచ్ దంపతులు గుండెలవిసేలా రోదించారు. చిన్నారి మృతదేహానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందా్‌సనాయక్ నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు.
వార్తలనూ చదవండి:
అక్కడ విద్యార్థులే వైద్యులు!
తొలి అడుగులోనే ‘కృత్రిమ’ గండం!
Read Latest Telangana News And Telugu News