కార్పొరేషన్ ముద్ర లేకుండానే మాంసం విక్రమాలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:21 PM
నగరంలోని మటన్ షాపుల్లో కార్పొరేషన్ అధికారుల ముద్రలు లేకుండానే మాంసం విక్రయాలు చేపడుతున్నారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని మటన్ షాపుల్లో కార్పొరేషన్ అధికారుల ముద్రలు లేకుండానే మాంసం విక్రయాలు చేపడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న గొర్రెలు, మేకలను ఇంటివద్ద, పొలాల వద్ద కోసుకొచ్చి షాపుల్లో విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ వ్యాపారులు లాభాలు అర్జిస్తూ ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారు. నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంతో వ్యాపారులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనల ప్రకారం ప్రతీ మేక, గొర్రెకు ముద్ర..
నిబంధనల ప్రకారం మేక, గొర్రెను కోసినా ముందుగా పశు వైద్యుడు పరీక్షించాలి. జంతువుకు ఏమైనా రోగాలు ఉన్నాయా? లేదా? నిర్దారించి దానిపై నీలిరంగును ముద్రను వేస్తారు. ఆ ముద్ర ఉంటేనే మాంసం తినడానికి సురక్షితమని అర్థం. కానీ నగరంలోని చాలా చోట్ల ముద్రలు లేకుండానే విక్రయాలు చేపడుతున్నారు.
ప్రతీ జంతువుకు రూ.20 రుసుము
ఏదైనా జంతువును వధించి విక్రయించడానికి స్థానిక పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్ కార్యాలయాలకు ప్రతీ మేక, గొర్రెకు పరీక్షించి ముద్ర వేయడానికి రూ.20 రుసుము చెల్లించాలి. వ్యాపారులు రెండు లేదా మూడు జంతువులకు ముద్రలు వేసుకుని అనధికారింగా, అనారోగ్యంగా ఉన్న గొర్రెల, మేకలను పదుల సంఖ్యలో విక్రయిస్తున్నారు.
వ్యాపారుల్లో పోటీతో ఫిర్యాదులు..
మాంసం వ్యాపారుల్లో ఉన్న పోటీ కారణంగా ఆదివారం కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే వన్‌టౌన్ వద్ద ఉన్న మటన్ మార్కెట్‌కు కార్పొరేషన్ అధికారులు పరిశీలించి, ముద్రలు లేకుంగా మాంసాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారికి మొదటి తప్పుగా భావించి, మరోసారి ముద్రలు లేని మాసం విక్రయిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
వినియోగదారుల ఆవేదన..
కేజీ మటన్ రూ.900 పెట్టి కొనుగోలు చేస్తున్నాం. అంత డబ్బు పెట్టి కొంటే వాటిలో ఏది మంచిదో.. చెడ్డదో తెలియడం లేదు. ఈ మాంసం తిని అనారోగ్యాల బారిన పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని కోరుతున్నారు.