Share News

అక్కడ విద్యార్థులే వైద్యులు!

ABN , Publish Date - Sep 21 , 2026 | 06:18 AM

రాజేంద్రనగర్ వెటర్నరీ యూనివర్సిటీ అనుబంధ ఆస్పత్రిలో పెంపుడు జంతువులకు వైద్య సేవలు, యూజర్‌ చార్జీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్‌ వైద్యుల కొరత, అత్యవసర సేవల లేమిపై పెంపుడు జంతువుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ విద్యార్థులే వైద్యులు!
Rajendranagar veterinary hospital

  • ప్రైవేటు ఆస్పత్రులను మించి యూజర్‌ చార్జీలు

  • ఓపీలో మచ్చుకైనా కనిపించని సీనియర్‌ వైద్యులు

  • పెంపుడు జంతువుల రోగ నిర్ధారణలోనూ నిర్లక్ష్యమే

  • 30 రోజుల్లోనే 150కిపైగా పిల్లులు, శునకాల మృతి

  • రాజేంద్రనగర్‌ వెటర్నరీ వర్సిటీ అనుబంధ ఆస్పత్రి తీరిది

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.50, సెలైన్‌ ఎక్కించేందుకు రూ.150, ఎక్స్‌రే రూ.300, అలా్ట్రసౌండ్‌ రూ.750, రక్త పరీక్షలు రూ.2500.. ఇలా ఒక్కో సేవకు ఒక్కో ధర. రాజేంద్రనగర్‌లోని ప్రతిష్ఠాత్మక పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రిలో పెంపుడు జంతువుల యజమానుల ముక్కు పిండి మరీ యూజర్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక్కడకి వచ్చే ప్రతి పెంపుడు జంతువు యజమాని రూ.2వేల వరకూ చెల్లిస్తున్నా.. సరైన వైద్యం అందడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


వెటర్నరీ వర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ ఆస్పత్రిలో పెంపుడు జంతువులు, పశువులకు మెరుగైన వైద్యం అందించేందుకు జనరల్‌, గైనిక్‌, సర్జరీ, న్యూట్రిషన్‌ విభాగాలతోపాటు అలా్ట్రసౌండ్‌, ల్యాబ్‌ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రిలోని ఓపీ విభాగానికి ప్రతి రోజూ సరాసరిన 200పైగా పెంపుడు జంతువులను వాటి యజమానులు తీసుకొస్తుంటారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. కానీ, ఓపీతోపాటు ఏ విభాగంలోనూ సీనియర్‌ పశువైద్యులు కనిపించరు. వచ్చిన కాసేపూ తమ కార్యాలయాలకే పరిమితమవుతారు. బీవీఎస్సీ, ఎంవీఎస్సీ చదువుతున్న విద్యార్థులే ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏదైనా అత్యవసర కేసులు వస్తే.. జూనియర్‌ వైద్యులే ఆయా మూగ జీవాలను సీనియర్‌ వైద్యుల వద్దకు తీసుకెళ్లి చూపిస్తారు. రాష్ట్రంలోని అన్ని పశువైద్య ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తుండగా..వెటర్నరీ వర్సిటీకి అనుబంధంగా ఉన్న ఆస్పత్రిలో ప్రైవేట్‌ ఆస్పత్రులను మించి యూజర్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు.


ఇక్కడికి వచ్చిన ప్రతి సారి రూ.50 చెల్లించి రిజిస్ర్టేషన్‌ చేసుకోవాల్సి ఉండగా, పెంపుడు జంతువుకు 5ఎంఎల్‌ సెలైన్‌ ఎక్కించినా రూ. 150 చెల్లించాల్సి.ందే. ప్రైవేటు ఆస్పత్రుల్లో రక్త పరీక్షలకు రూ. 2వేలు ఉండగా.. ఇక్కడ రూ.2,500 తీసుకుంటున్నారు. ఎక్స్‌రే రూ.300, సీబీసీ రూ. 350, అలా్ట్రసౌండ్‌ రూ.750, వ్యాక్సినేషన్‌ రూ.750, 2డీ ఏకో రూ.1000, మైనర్‌ సర్జరీ రూ.500, మేజర్‌ సర్జరీ రూ.4000, హిమోడయాలసిస్‌ రూ.5000 చొప్పున వసూలు చేస్తున్నారు. వాస్తవానికి పెంపుడు జంతువులు అంతుచిక్కని రోగాల బారినపడితే సీనియర్‌ వైద్యుల పర్యవేక్షణలో రోగ నిర్ధారణ చేయాలి.


దీని కారణాలను గుర్తించాలి. ఇతర జంతువులకు, మనుషులకు ఆ వ్యాధి సంక్రమించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇక్కడ వైద్యం పొందే క్రమంలో పెంపుడు జంతువు మరణిస్తే దాని వివరాలు ప్రత్యేకంగా రికార్డు చేయాలి. కానీ ఇలాంటివి ఇక్కడ మచ్చుకైనా కనిపించడం లేదు. ఈ ఆస్పత్రిలో గత నెల రోజుల్లో 150కి పైగా కుక్కలు, పిల్లులు మృత్యువాత పడ్డాయి. ఓపీ సేవలను సాయంత్రం వరకూ అందించాలని, 24గంటల అత్యవసర సేవల విభాగం ప్రారంభించాలని, సీనియర్‌ వైద్యులను అందుబాటులో ఉంచాలని, వైద్య సేవలను ఉచితంగా అందించాలని పెంపుడు జంతువుల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


వార్తలనూ చదవండి:

2,800 ఓట్ల తొలగింపు!
తొలి అడుగులోనే ‘కృత్రిమ’ గండం!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 06:18 AM