2,800 ఓట్ల తొలగింపు!
ABN , Publish Date - Sep 21 , 2026 | 06:02 AM
తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో విచారణ అనంతరం ఆధారాలు సమర్పించని 2,800 మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. 80 లక్షలకు పైగా ఓటర్లకు నోటీసులు జారీ కాగా, 59 లక్షల మందికి విచారణ పూర్తయిందన్నారు.
సర్ నోటీసుల విచారణ అనంతరం ఈఆర్వోల నిర్ణయం
80 లక్షల ఓటర్లకు నోటీస్‌లు..
59 లక్షల మంది విచారణ పూర్తి
ఓటు తొలగించాలంటే కారణాలతో కూడిన ‘స్పీకింగ్ ఆర్డర్’ తప్పనిసరి
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఓటర్లకు నోటీసుల జారీ, విచారణ ప్రక్రియతోపాటు అనర్హుల పేర్ల తొలగింపు సైతం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) స్థాయిలోనే జరుగుతున్నట్లు ఎన్నికల విభాగం అధికారులు తెలిపారు. విచారణలో తగిన ఆధారాలు చూపని 2,800 మంది ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించినట్లు తెలిసింది. అయితే, ఈఆర్వో నిర్ణయానికి జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో), ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) స్థాయిలో ఆమోద ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది అన్నదానిపై స్పష్టత లేదు.
ఓట్ల తొలగింపునకు ముందు సంబంధిత ఓటర్లకు నోటీసులు ఇచ్చారా? వారికి తమ వాదన వినిపించే అవకాశం కల్పించారా? పత్రాలను పరిశీలించారా? కారణాలతో కూడిన స్పీకింగ్ ఆర్డర్లు జారీచేశారా? అనేఅంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. సర్ ముసాయిదా జాబితా వెల్లడించిన అనంతరం అనామలీస్ కేటగిరీలో 60,50,918 మంది, సమగ్ర వివరాలు నమోదుచేయని 32,36,659 మందితో కలిపి మొత్తం 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీచే యాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 80 లక్షలకు పైగా నోటీసులు జారీచేశారు. వారిలో 59 లక్షల మంది ఓటర్ల విచారణ పూర్తయినట్లు తెలిసింది. ఈసీ మార్గదర్శకాల ప్రకారం ఓటు తొలగించాలంటే కారణాలతో కూడిన ‘స్పీకింగ్ ఆర్డర్’ తప్పనిసరిగా ఇవ్వాలి.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఈఆర్వోపై చర్యలు
ఓటరు పేరును తొలగించే విషయంలో ఈఆర్వోకు పూర్తి స్వేచ్ఛ లేదని, ఓటు తొలగింపు నిర్ణయానికి కారణాలను స్పష్టంగా నమోదు చేస్తూ ‘స్పీకింగ్ ఆర్డర్’ జారీ చేయాలని ఈసీఐ సర్ మార్గదర్శకాల్లోనే పేర్కొంది. దీని ప్రకారం ఓటరు నుంచి వివరణ, అవసరమైన పత్రాలు స్వీకరించిన తర్వాత ఈఆర్వోలు విచారణ నిర్వహించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఓటు తిరస్కరణకు గల కారణాలను రికార్డులో నమోదు చేయాలి. ఈ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత ఈఆర్వోపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈఆర్వో స్థాయిలో తమ పేరును ఓటరు జాబితా నుంచి తొలగిస్తే... వారు జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు.
అక్కడ న్యాయం జరగలేదని భావిస్తే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)కు అప్పీల్ చేయవచ్చు. పై స్థాయిలో విచారణ సందర్భంగా అర్హుడిగా గుర్తిస్తే తిరిగి ఓటరు జాబితాలో చేర్చుతారు. కాగా, సర్ నోటీసుల విచారణ పూర్తయిన అనంతరం అర్హత ఉన్న ఓటర్లను తుది జాబితాలో చేర్చేందుకు సిద్ధంచేసినట్లు సమాచారం. అనామలీ్‌సలో 70-80 శాతం పేర్లలో అక్షర దోషాలు, చిన్నపాటి వివరాల వ్యత్యాసాలేనని అధికారులు చెబుతున్నారు. మిగిలినవి వయసుకు సంబంధించిన వ్యత్యాసాలు, పాత ఓటరు వివరాలతో కొత్త వివరాల మ్యాపింగ్‌లో తేడాలు, కుటుంబ సభ్యుల వివరాల్లో వ్యత్యాసాలు వంటివి ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో తోబుట్టువుల మధ్య 9 నెలల కంటే తక్కువ వయస్సు తేడా ఉండటం వంటి వివరాలు అనుమానాస్పద డేటాగా గుర్తించినట్లు తెలిపారు.
వార్తలనూ చదవండి:
బహుజనుల బాణాన్ని నేను
రేవంత్‌ది రాక్షస పాలన
Read Latest Telangana News And Telugu News