రేవంత్‌ది రాక్షస పాలన
ABN , Publish Date - Sep 21 , 2026 | 05:56 AM
హరీశ్‌రావు రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ, రాష్ట్రంలో కరువు, విద్యుత్తు కోతలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, ప్రజలు మళ్లీ కేసీఆర్‌కు మద్దతు ఇస్తారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎల్‌నినో కంటే ప్రమాదకారి
నిలదీస్తున్నందుకే డైవర్షన్ పాలిటిక్స్
మళ్లీ కేసీఆర్‌కే ప్రజల పట్టం: హరీశ్
యాదాద్రి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనపై ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎవరు గెలుస్తారంటూ చేసిన సర్వేలన్నీ మళ్లీ కేసీఆర్‌కే పట్టం కడుతున్నాయని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నాయకుడు హరీశ్‌రావు చెప్పారు. కేసీఆర్ పాలన రైతు పాలన, సంక్షేమ పాలన అయితే.. రేవంత్‌రెడ్డిది రాక్షస పాలన అని ప్రజలు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు ఏ వర్గం చూసినా కేసీఆర్ పాలనే బాగుండేదని ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో కాంగ్రెస్ నుంచి పలువురు నాయకులు బీఆర్‌ఎ్‌సలో చేరిన సందర్భంగా జరిగిన సభలో హరీశ్‌రావు మాట్లాడారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులకు, కరెంటు కోతలకు ఎల్‌నినో కారణం కాదని, రేవంత్‌రెడ్డికి పాలన చేతకాక వచ్చిన కరువు అని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో విద్యుత్తు ఉత్పత్తి కోసం థర్మల్ విద్యుత్తు ప్లాంట్లను వడ్డించిన విస్తరిలా సిద్ధం చేసిపెడితే, రాష్ట్రంలో బొగ్గు లేదనే సాకుతో 35వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని బంద్ పెట్టారన్నారు. కేసీఆర్ హయాంలో 24 గంటలు కరెంటు సరఫరా జరిగిందని, ఎప్పుడో ఒకప్పుడు 21 గంటలో, 22 గంటలో జరిగితే.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సబ్‌స్టేషన్ల లాగ్‌బుక్ పరిశీలించి రచ్చ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆరేడు గంటలు కూడా విద్యుత్తు సరఫరా కాకున్నా ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. అన్ని వనరులు, హంగులు ఉన్నా ప్రజలకు అందించకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌నినో కన్నా ప్రమాదకారి అని పేర్కొన్నారు.
కమీషన్ల ప్రభుత్వం
ఫైల్ క్లియర్‌కు 30శాతం, బిల్లు పాస్ కావాలంటే 15శాతం తీసుకుంటున్నారని, ఇది ముమ్మాటికీ 30శాతం కమీషన్ల ప్రభుత్వమని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పాలనలో అన్నిరంగాల్లో విఫలమైన ప్రభుత్వంపై ప్రజలు ఎక్కడ తిరగబడతారనే భయంతో డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారన్నారు. మీరెంత బురదజల్లి, నీచపు రాజకీయాలు చేసినా ప్రజల పక్షాన నిలబడి నిలదీస్తామని హెచ్చరించారు. తమ భూములు, ఆస్తులు తెరిచిన పుస్తకం వంటివని, తమకు ఎటువంటి గెస్ట్‌హౌ్‌సలు లేవని స్పష్టం చేశారు. సీఎం తమ్ముడి ఇల్లు శిఖం భూమిలో ఉందనే విషయం ప్రభుత్వానికి కనిపించటం లేదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులు కేవీపీ, పట్నం మహేందర్‌రెడ్డి, మండలి చైర్మన్ ఇళ్లు కూడా వివాదాస్పద స్థలాల్లోనే ఉన్నాయని, తొలుత వాటిని కూలగొట్టాలని డిమాండ్ చేశారు. తాము బెదిరింపులకు భయపడమని, పోరాటాలు, కేసులు, జైళ్లు తమకు కొత్తకాదన్నారు. ఈ సభలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, విద్యుత్తు కోతలపై ఆరా తీయడానికి హరీశ్‌రావు మోటకొండూరు సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. అక్కడి ఆపరేటర్‌ను లాగ్‌బుక్‌ను చూపించమని కోరగా, ప్రస్తుతం మాన్యువల్ లాగ్ బుక్ నిర్వహించడం లేదని, ఆన్‌లైన్ యాప్ ద్వారా నమోదవుతున్నట్టు సమాధానం ఇచ్చాడు. విద్యుత్తు సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వం బండారం బయటపడుతుందనే లాగ్‌బుక్ మాయం చేశారని హరీశ్‌రావు ఆరోపించారు.
వార్తలనూ చదవండి:
బహుజనుల బాణాన్ని నేను
ఫ్యూచర్ సిటీకి హైస్పీడ్ కనెక్టివిటీ
Read Latest Telangana News And Telugu News