Share News

గణేష్‌ మండపాల్లో సందడే.. సందడి..

ABN , Publish Date - Sep 21 , 2026 | 01:15 AM

జిల్లావ్యాప్తంగా గణేష్‌ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో పెద్దసంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో మండపాలకు తరలివచ్చారు.

గణేష్‌ మండపాల్లో సందడే.. సందడి..

పెద్ద ఎత్తున అన్నదానాలు.. కుంకుమార్చనలు

మండపాలలో గణేషుడికి మహానైవేద్యాలు

నిమజ్జనానికి అధికారుల విస్తృత ఏర్పాట్లు

పెద్దపల్లి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా గణేష్‌ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో పెద్దసంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో మండపాలకు తరలివచ్చారు. పలు ప్రాంతాల్లో నిర్వాహకులు భారీగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద ఎత్తున భక్తి కోలాహలం ఏర్పడింది. సెలవురోజు కావడంతో వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ ప్రాంతాల్లోని ఆయా కార్యక్రమాలలో పాల్గొన్నారు. మండపాల వద్ద ప్రత్యేక పూజలు, వ్రతాలు, కుంకుమార్చనలు, భజనలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. మండపాల వద్ద ఫొటోలు, సెల్ఫీలతో యువత సందడి చేస్తుండగా.. చిన్నారులు, మహిళలు ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు.

ఫ మహా నైవేద్యాలతో భక్తి వైభవం..

పలు మండపాల వద్ద రెండు, మూడురోజులుగా మహానైవేద్యాల సమర్పణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భక్తులు తమ ఇళ్లలో తయారు చేసిన వివిధ రకాల స్వీట్లు, పిండి వంటలు, ఇతర ప్రసాదాలను పెద్దఎత్తున తీసుకువచ్చి గణనాథుడికి సమర్పిస్తున్నారు. ఒక్కో మండపం వద్ద సుమారు వందనుంచి 300రకాల వరకు స్వీట్లు, పిండిపదార్థాలతో మహానైవేద్యాలను సిద్ధం చేసి స్వామికి సమర్పిస్తున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు. సుల్తానాబాద్‌ శివాలయంలో ఆలయకమిటీ ఆధ్వర్యంలో 241రకాల నైవేద్యాలు సమర్పించారు. వైశ్యాభవన్‌లోని మండపం వద్ద 171రకాల నైవేద్యాలు సమర్పించారు. ఇలా జిల్లా నలుమూలల మండపాల వద్ద మహానైవేద్యాలను సమర్పిస్తున్నారు. కొన్నిమండపాల నిర్వాహకులు నైవేద్యాలను తీసుకువచ్చిన భక్తుల పేర్లను నమోదు చేసి భక్తులకు లాటరీ నిర్వహిస్తున్నారు. లాటరీలో ఎంపికైన వారికి ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేస్తున్నారు. దీంతో భక్తుల్లో మరింత ఉత్సాహం నెలకొంటోంది.

ఫ సాయంత్రం ఆధ్యాత్మిక వాతావరణం..

సాయంత్రం వేళల్లో పలు మండపాల వద్ద భజనలు, భక్తి గేయాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డప్పులు, భజన బృందాల గానంతో ఆయాప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చిన్నారులు, యువత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వార్డుల్లో పెద్ద సంఖ్యలో గణేష్‌ విగ్రహాలను ప్రతిష్ఠించడంతో ఉత్సవాల సందడి మరింత పెరిగింది.

ఫ మండపాలకు ప్రముఖుల సందర్శన..

వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన గణేష్‌ మండపాలను మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ఎమ్మెల్యేలు, మాజీఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ, సామాజిక, వ్యాపార ప్రముఖులు సందర్శించి ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణ తీరును తెలుసుకుని అభినందిస్తున్నారు. మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఫ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు..

గణేష్‌ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లోని చెరువులు, కుంటలు, ఇతర నిమజ్జనప్రాంతాలను మున్సిపాలిటీ, గ్రామపంచా యతీ అధికారులు పరిశీలిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, విద్యుత్‌శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్‌, విద్యుత్‌ సరఫరా, పారిశుధ్యం, తాగునీరు, బారికేడ్లు తదితర సౌకర్యాలపై దృష్టి సారిస్తున్నారు. దీంతో పాటు పెద్దపలి,్ల రామగుండం, సుల్తానాబాద్‌ మంథనిప్రాంతాల్లోని నిమిజ్జన ప్రదేశాలలో గజఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు పోలీస్‌ అధికారులు, నిర్వాహకులు చెబుతున్నారు.

ఫ శాంతియుతంగా నిమజ్జనం..

గణేష్‌ నిమజ్జనోత్సవాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. కమిషనర్‌, డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులు మొదలుకుని సీఐలు, ఎస్‌ఐల వరకు తమ పరిధిలో మండపాల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిమజ్జన ఊరేగింపుల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, ట్రాఫిక్‌కు ఇబ్బం దులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యుత్‌ తీగలు, డీజేలు, ఊరేగింపు మార్గాలు తదితర అంశాలపై నిర్వాహకులకు సూచనలు చేస్తున్నారు. భక్తులు, నిర్వాహకులు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు సూచించిన నిబంధనలను పాటించి గణేష్‌ నిమజ్జనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా విజయవంతం చేయాలని అధికారులు కోరుతున్నారు. మొత్తం మీద జిల్లావ్యాప్తంగా గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, సామాజిక సేవతో కళకళలాడుతున్నాయి.

Updated Date - Sep 21 , 2026 | 01:15 AM