Share News

ఫ్యూచర్‌ సిటీకి హైస్పీడ్‌ కనెక్టివిటీ

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:32 AM

ఫ్యూచర్‌ సిటీలో అంతర్గత రద్దీని తగ్గించి హైస్పీడ్‌ కనెక్టివిటీ పెంచేందుకు రూ.140 కోట్లతో లింక్‌ రోడ్లు, కల్వర్టుల విస్తరణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జాతీయ, రాష్ట్ర రహదారులకు అనుసంధానం చేస్తూ సిగ్నల్‌ రహిత జంక్షన్లు, కీలక గ్రామాల్లో కొత్త రోడ్లు అభివృద్ధి చేయాలని ఎఫ్‌సీడీఏ ప్రణాళిక రూపొందించింది.

ఫ్యూచర్‌ సిటీకి హైస్పీడ్‌ కనెక్టివిటీ
Future City Development

  • 140 కోట్లతో లింకు రోడ్లు, కల్వర్టుల విస్తరణ..

  • నిధులు మంజూరు చేసిన సర్కారు

  • పారిశ్రామిక, నివాస ప్రాంతాల్లో సిగ్నల్‌ రహిత జంక్షన్లు

  • వాటితో జాతీయ, రాష్ట్ర రహదారులకు అనుసంధానం

  • అంతర్గత రద్దీని తగ్గించడం.. హైస్పీడ్‌ కనెక్టివిటీ లక్ష్యం

  • ఇప్పటికే పలు గ్రామాల్లో ప్రారంభమైన పనులు

రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మున్ముందు ఫ్యూచర్‌ సిటీలో అంతర్గత రద్దీని తగ్గించడం, హైస్పీడ్‌ కనెక్టివిటీ పెంచడం లక్ష్యంగా లింకురోడ్ల అభివృద్ధి, కల్వర్టుల విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)కి బలమైన పునాది వేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జాతీయ రహదారి-844, శ్రీశైలం జాతీయ రహదారి-765 నుంచి నాగార్జునసాగర్‌ రహదారికి అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు, లింకురోడ్ల అభివృద్ధి, కల్వర్టుల విస్తరణకు ప్రభుత్వం ఇటీవల రూ.140 కోట్ల నిధులను మంజూరు చేసింది.


ఇందులో రూ.18 కోట్లతో మీర్‌ఖాన్‌పేట జంక్షన్‌ నుంచి మేడపల్లి-మల్కీజుగూడ, నందివనపర్తి-యాచారం జంక్షన్‌ నాగార్జున సాగర్‌ రహదారి కలుపుతూ రోడ్డు, అలాగే రూ.35 కోట్లతో మేడిపల్లి నుంచి నానక్‌నగర్‌-పిల్లిపల్లి (నందివనపర్తి)-తాడిపర్తి వరకు, కుర్మిద్ద-మీర్‌ఖాన్‌పేట జంక్షన్‌ వరకు రూ.35 కోట్లతో రోడ్డు నిర్మిస్తోంది. దీంతో పాటు రూ.20 కోట్లతో శ్రీశైలం జాతీయ రహదారి నుంచి రాచలూరు-తిమ్మాపూర్‌ జంక్షన్‌ వరకు మేజర్‌ లింకురోడ్డును నిర్మించనుంది. ఇక, రూ.22 కోట్లతో రాచలూరు జంక్షన్‌ నుంచి వయా బేగంపేట, గుమ్మడవెల్లి-కొనల్‌గూడ జంక్షన్‌ వరకు, రూ.30 కోట్లతో కొనల్‌గూడ నుంచి తులేకర్దు, చౌదర్‌పల్లి, యాచారం జంక్షన్‌ వరకు లింకురోడ్డును అభివృద్ధి చేయబోతోంది.


లింక్‌రోడ్ల నుంచి మేజర్‌ గ్రామపంచాయతీలకు అనుసంధానంగా రోడ్లు నిర్మించేందుకు రూ.7 కోట్లు వెచ్చించనుంది. ఈ పనులన్నీ ఏడాదిన్నర లోగా పూర్తి చేయాలని ఎఫ్‌సీడీఏ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ తరుణంలో పలు గ్రామాల పరిధిలోని లింకు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీ మీదుగా ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌-13 నుంచి అమన్‌గల్‌ మండలం ఆకుతోటపల్లి వరకు మొత్తం 41.5 కి.మీ. వరకు 100 మీటర్ల వెడల్పుతో 6 వరుసలుగా రతన్‌టాటా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డును నిర్మిస్తోంది. మరోవైపు ఫ్యూచర్‌సిటీలో అంతర్గత పారిశ్రామిక, ఐటీ, నివాస ప్రాంతాల్లో సిగ్నల్స్‌ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయడంతో పాటు జాతీయ, రాష్ట్ర రహదారులకు వాటిని అనుసంధానం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.


మేజర్‌ గ్రామాల్లో కూడళ్లు

ఫ్యూచర్‌ సిటీలో కీలక ప్రాంతాలను కలుపుతూ మేజర్‌ గ్రామాల్లో కూడళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం కొత్తూరు నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు రోడ్డు పూర్తయింది. మీర్‌ఖాన్‌పేట-యాచారం పనులు ప్రారంభం కాలేదు. ఈ రోడ్డుకు అనుసంధానంగా మీర్‌ఖాన్‌పేట్‌-బేగరికంచ, యాచారం-నందివనపర్తి, తిమ్మాపూర్‌, రాచలూరు, కొనల్‌గూడ వద్ద జంక్షన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. వీటితో దక్షిణ హైదరాబాద్‌ కారిడార్‌ అంతటా హైస్పీడ్‌ కనెక్టివిటీ మెరుగుపడనుంది.


ఈ వార్తలనూ చదవండి:

హైరైజ్‌ భూములకు రైతుబంధు!
పిడుగుపాటుకు ఫోన్‌ పేలి బాలుడి మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 05:34 AM