Share News

హైరైజ్‌ భూములకు రైతుబంధు!

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:05 AM

అది హైరైజ్‌ భవనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకొనే ప్రాంతం. అక్కడ అన్నీ 30 నుంచి 40 అంతస్తుల భవనాలే. వాటిలో ఒకటైన ‘సాస్‌’ భవనం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది. మరికొన్ని రోజుల్లో ఇక్కడ 60 నుంచి 70 అంత స్తుల భవనాలు కూడా రానున్నాయి.

హైరైజ్‌ భూములకు రైతుబంధు!
High Rise Lands

  • సాగుభూమి లేకపోయినా పెట్టుబడి సాయం

  • గత నెలలోనూ 512 మందికి 30 లక్షలు

  • గండిపేటలో మూడేళ్లుగా ఇదే తంతు

నార్సింగ్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): అది హైరైజ్‌ భవనాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకొనే ప్రాంతం. అక్కడ అన్నీ 30 నుంచి 40 అంతస్తుల భవనాలే. వాటిలో ఒకటైన ‘సాస్‌’ భవనం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది. మరికొన్ని రోజుల్లో ఇక్కడ 60 నుంచి 70 అంత స్తుల భవనాలు కూడా రానున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఆధునిక హైదరాబాద్‌గా వర్థిల్లుతోంది. ఇలాంటి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పుణ్యమా అని.. ఇంత పెద్ద భవనాల మధ్య కొంత మంది రైతులు వ్యవసాయం చేస్తున్నట్లుగా వారికి ప్రతి ఏటా రైతుబంధు సాయం అందజేస్తున్నారు. పేద రైతులకు పంటల సాగు కోసం పెట్టుబడిగా ఉపయోగపడాల్సిన డబ్బులను శ్రీమంతులకు అప్పనంగా ఇచ్చేస్తున్నారు. ఇలా.. సర్కారు ఖజానా నుంచి ఏటా లక్షల రూపాయలు సదరు సోకాల్డ్‌ రైతుల జేబుల్లోకి వెళుతున్నాయి.


ఐటీ కారిడార్‌లోని రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో నాలుగేళ్ల క్రితం వరకు 2వేల మంది రైతులకు ప్రభుత్వం రైతుబంధు సాయం అందించింది. అయితే వాణిజ్య రంగం అభివృద్ధిలో భాగంగా ఇక్కడ వ్యవసాయం నిలిచిపోయి.. ప్రస్తుతం ఎకరం రూ.40-240 కోట్ల వరకు ధర పలుకుతోంది. మండలంలోని పలు ప్రాంతాల్లో భారీ భవనాలు వెలుస్తున్నాయి. అయినా వ్యవసాయశాఖాధికారులు మాత్రం ఇక్కడి భూరికార్డుల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నట్లుగానే పేర్కొంటున్నారు. వారికి ఏటా రైతుబంధు పథకం కింద లక్షల రూపాయలు అప్పనంగా అందజేస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకు గండిపేట మండలంలో 1500మంది రైతులు ఉన్నారని, అప్పట్లో వారికి రూ.కోటి వరకు రైతుబంధు సాయం అందించామని ఆనాటి అధికారి ఒకరు చెప్పారు. కానీ, గత ఏడాది ఈ మండలంలో 518 మంది రైతులు మాత్రమే ఉన్నట్లు తేల్చారు. వీరికి గత ఏడాది యాసంగి సీజన్‌లో రైతుబంధు కింద రూ.24,07,005లక్షలు చెల్లించారు. గత నెల (ఆగస్టు)లో 512మంది రైతులకు రూ.30,16,854 లక్షలు చెల్లించారు.


వ్యవసాయం చేయకపోయినా.. పాస్‌ పుస్తకాల ఆధారంగా రైతుబంధు అందుకుంటున్న వారిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బడాబాబులు, వీవీఐపీలే అధికంగా ఉండడం గమనార్హం. ఈ మండలంలోని కోకాపేట, నార్సింగ్‌, మణికొండ, పుప్పాలగూడ, బండ్లగూడ, పీరం చెరువు, కిస్మత్‌పూర్‌లలో అంతర్జాతీయంగా పేరుగాంచిన భారీ టవర్లు ఉన్నాయి. ఇక జీవో 111 పరిధిలో ఉన్న ఖానాపూర్‌, వట్టినాగులపల్లిలో భూములకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈ రెండు గ్రామాల్లో 5 శాతం మాత్రమే వ్యవసాయం కనిపిస్తుంది. మిగతా అంతా లే-అవుట్‌లు, గుట్టలే ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో వందల మంది రైతులు ఎక్కడ వ్యవసాయం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఈ ప్రాంతానికి చెందిన రైతులు ఒక్కొక్కరు10 గుంటలు లేదా 20 గుంటల భూమిని సాగు చేసినా.. ఏటా ఇక్కడ 250 నుంచి 300 ఎకరాల్లో వ్యవసాయం జరుగుతుండాలి. అయితే భారీ భవనాలు నిర్మితమైన, నిర్మాణం జరుగుతున్న ఈ ప్రాంతంలో వ్యవసాయ పనులు ఎక్కడ జరుగుతున్నాయో అధికారులకే తెలియాలి.


రైతు బంధు సాయం కోసమే ఓ అధికారి..!

హైరైజ్‌ భవనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన కోకాపేటలో 42 మంది రైతులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో తొమ్మిది మందికే రైతుబంధు ఇచ్చామని గండిపేట వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) గీత తెలిపారు. మరి మిగతావారి సంగతి ఏమిటనేది తెలియని పరిస్థితి. కాగా, వ్యవసాయశాఖ అధికారుల లెక్కల ప్రకారం.. ప్రతి మండలానికి ఒక వ్యవసాయ అధికారి (ఏవో) ఇన్‌చార్జిగా ఉంటారు. అయితే గండిపేటలో వ్యవసాయం లేదంటూ ఇక్కడ ఉన్న ఏవో ఉదయ్‌కాంత్‌ను ఐదే ళ్ల క్రితం బదిలీ చేశారు. తిరిగి ఇప్పటివరకూ కొత్త ఏవోను నియమించలేదు. అయితే ఇక్కడ లేని వ్యవసాయానికి ప్రస్తుతం ఉన్న ఏఈవో చాలునంటూ శ్రీనివాస్‌ గౌడ్‌ అనే ఏఈవోకు బాధ్యతలు అప్పగించారు. ఆయనను మూడు నెలల క్రితం బదిలీ చేసి.. ఆయన స్థానంలో గీత అనే అధికారిణిని నియమించారు. పెద్దగా సిబ్బంది లేకపోయినా.. కేవలం వ్యవసాయం చేయని రైతులకు రైతుబంధు ఇవ్వడానికి మాత్రమే ఆమె ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. పక్కనే ఉన్న శేరిలింగంపల్లి మండలాన్ని పూర్తిగా అర్బన్‌ మండలంగా ప్రకటించిన అధికారులు.. గండిపేటను ఎందుకు ప్రకటించలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. నిజంగా ఇక్కడ వ్యవసాయం ఉంటే వ్యవసాయశాఖ పూర్తిస్థాయి అధికారిని ఎందుకు నియమించలేదు? పూర్తిస్థాయి సిబ్బంది ఎందుకు లేరు? అన్నవి సమాధానాలు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

బాబోయ్‌.. ఎంజీఎం
పిడుగుపాటుకు ఫోన్‌ పేలి బాలుడి మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 05:26 AM