రైతులు, మిల్లర్ల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Sep 18 , 2026 | 09:35 PM
రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మిల్లర్ల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణలో రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలకంగా ముందడుగు వేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మిల్లర్ల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సానుకూల వాతావరణంలో జరిగిన చర్చల్లో మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, పెనాల్టీలు, టెండర్ ధరలు, స్టాక్ వ్యత్యాసాలు, పెండింగ్ సరఫరాలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. మిల్లర్లను ప్రభుత్వం ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చూస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతుల ప్రయోజనాలు.. ప్రజాధనం పరిరక్షణతో పాటు మిల్లింగ్ రంగం స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. మిల్లర్లపై అనవసర భారం మోపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు.
మిల్లర్లు సమర్పించిన వినతులను సానుకూలంగా పరిశీలించి సాధ్యమైన పరిష్కారాలను చూపుతామని మంత్రి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సరఫరాలపై అధికారులతో ప్రత్యేకంగా కసరత్తు చేయాలని సూచించినట్లు చెప్పారు. సమస్యలపై మరోసారి నాలుగైదు రోజుల్లో మిల్లర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఏకపక్ష నిర్ణయాలకు తావులేకుండా చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరిస్తామని ఉత్తమ్ అన్నారు. రైతుల ప్రయోజనాలు, ప్రజాధనం, మిల్లింగ్ రంగం స్థిరత్వం మధ్య సమతుల్యత సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేస్తూ.. ప్రస్తుతం కొనసాగుతున్న సమ్మెను విరమించి ప్రభుత్వంతో చర్చలకు సహకరించాలని మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు.
Also Read:
కాంగ్రెస్ అభ్యర్థికి మమతా బెనర్జీ మద్దతు.. ఇంతలోనే అరెస్టు
విమానయాన ఖర్చులపై వైసీపీ దుష్ప్రచారం.. ప్రభుత్వ వర్గాల వివరణ