విమానయాన ఖర్చులపై వైసీపీ దుష్ప్రచారం.. ప్రభుత్వ వర్గాల వివరణ
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:39 PM
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ విమానయాన ఖర్చులపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. పవన్ కల్యాణ్, లోకేశ్ అధికారిక పర్యటనలకు APACL నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విమానయాన ఖర్చులపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశాయి. పవన్ కల్యాణ్, నారా లోకేశ్ అధికారిక పర్యటనలకు ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APACL) నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని అధికారులు తెలిపారు. APACL బడ్జెట్ మొత్తం సీఎం పర్యటనలకే ఖర్చు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తుండడాన్ని ప్రభుత్వ వర్గాలు తప్పుపట్టాయి.
గవర్నర్, కేంద్ర మంత్రుల పర్యటనలకు సంబంధించిన హెలికాప్టర్ సేవలు, గిరిజన ప్రాంతాల్లో ఎయిర్ అంబులెన్స్ సేవలు కూడా APACL పరిధిలోనే ఉంటాయని వివరించాయి. అలాగే నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను తరలించేందుకు ప్రత్యేక విమానాలకు అయిన ఖర్చులు కూడా ఇందులో ఉన్నాయని పేర్కొన్నాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగానే సీఎం చంద్రబాబు తరచూ జిల్లాల పర్యటనలు చేస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. ‘పేదల సేవలో’, ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’, ‘మీ భూమి–మీ హక్కు’, ‘సంజీవని’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి నెలా క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తున్నారని పేర్కొంది.
2026-27 ఆర్థిక సంవత్సరానికి APACLకు రూ.54.63 కోట్లు కేటాయించగా.. తొలి రెండు త్రైమాసికాలకు రూ.30.95 కోట్లు మాత్రమే విడుదలైనట్లు అధికారులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల పర్యటనలకు విమానయాన సేవల కోసం భారీగా ఖర్చు చేశారని కూటమి ప్రభుత్వం లెక్కలను విడుదల చేసింది. 2021-22 నుంచి 2023-24 వరకు ఏటా రూ.55 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు పేర్కొంది. కోవిడ్ ఆంక్షలు ఉన్న 2020-21లోనూ సుమారు రూ.30 కోట్లు విమానయాన ఖర్చుల కోసం వినియోగించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
గత ప్రభుత్వ హయాంలో ఎగ్ పఫ్స్, సమోసాలు, ఇంటి భద్రత పేరుతో గ్రిల్స్ ఏర్పాటుకు కూడా ప్రజాధనం ఖర్చు చేశారని కూటమి నేతలు విమర్శించారు. తమ ప్రభుత్వం రెండేళ్లలో రూ.1.5 లక్షల కోట్లకు పైగా సంక్షేమంపై ఖర్చు చేసిందని పేర్కొంటూ.. వైసీపీ దుష్ప్రచారాన్ని మానుకోవాలని సూచించారు. దుష్ప్రచారమే పునాదిగా రాజకీయాలు చేస్తే ప్రజల్లో ఆదరణ కోల్పోతారని వైసీపీని కూటమి నేతలు హెచ్చరించారు.
Also Read:
అమెజాన్ రిటర్న్ పాలసీతో భారీ మోసం.. వ్యాపారికి రూ.16.28 లక్షల నష్టం
ఈ 2 విషయాల్లో క్షమాపణ చెప్పినా తప్పులేదు