బహుజనుల బాణాన్ని నేను
ABN , Publish Date - Sep 21 , 2026 | 05:44 AM
కోస్గి పాంచజన్య సంకల్ప సభలో కవిత కీలక వ్యాఖ్యలు చేస్తూ బహుజన రాజ్యం, యువత ఉద్యోగాలు, విద్య, వైద్యం, సాగునీటిపై తన రాజకీయ కార్యాచరణను వివరించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, అధికారంలోకి వస్తే పలు సంక్షేమ హామీలు అమలు చేస్తామని ప్రకటించారు.
మగ మహారాజులను చాలెంజ్ చేస్తున్న వీరవనితను
బహుజన రాజ్యం రావాలంటే కాంగ్రె్‌సను గద్దె దించాలి
బలవంతుడినని సీఎం రేవంత్ విర్రవీగుతున్నారు
ఆంధ్రావాళ్ల వల్లే యువతకు ఉద్యోగాలు రాలేదన్నాం
తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు రావడం లేదు
నన్ను ఆశీర్వదిస్తే రేవంత్, కేసీఆర్, మోదీలతో పోరాడతా
కోస్గి పాంచజన్య సభలో టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత
కోస్గి/కొడంగల్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను బహుజనుల బాణాన్ని, యువకుల యుద్ధ నినాదాన్ని. సావిత్రీబాయి పూలే ఆశయాలను నింపుకొని మగ మహారాజులను చాలెంజ్ చేస్తున్న వీర వనితను. నన్ను ఆశీర్వదిస్తే సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలతో పోరాడతా’’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని కోస్గిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె ప్రసంగించారు. తాను రెండోసారి కొడంగల్ గడ్డకు వచ్చానని.. 2009లో టీడీపీతో పొత్తులో భాగంగా కోస్గికి చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలతో కలిసి వచ్చానని, ఇప్పుడు వారిద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నారని చెప్పారు.
రానున్న రోజుల్లో కోస్గి, కొడంగల్ ప్రజల ఆశీర్వాదం, తెలంగాణ ప్రజల అండతో తాను కూడా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తానన్న విశ్వాసంతో ఉందని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఉండగా ఇంకో పార్టీ ఎందుకని మా అక్కాచెల్లెళ్లు ఆలోచిస్తున్నారు. కానీ ఆ పార్టీలతో మన బతుకులు ఏమైనా మారాయా? మన యువతకు ఉద్యోగాలు రాకపోతే ఆంధ్రావాళ్లు కారణమని భావించాం. కానీ తెలంగాణ వచ్చాక కూడా యువతకు ఉద్యోగాలు రావడం లేదు. అందుకే ఈ తంగేడుపువ్వు రంగు జెండాతో మీ ముందుకు వచ్చి ఆశీర్వాదం కోరుతున్నా. సమాజంలో అధర్మం పెరిగినప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం ఊది పోరాటం చేయాలని చెప్పాడు. అదే పేరుతో ప్రజలకోసం పోరాటం చేయాలని భావిస్తున్నా..’’ అని కవిత చెప్పారు.
ప్రజల కోసం బాధ్యతగా ఉండేవారు కావాలి..
ఇప్పుడు అసెంబ్లీలో చాలా వరకు పార్టీలు, బాధ్యత లేని నాయకులు ఉన్నారని కవిత విమర్శించారు. అందుకే ఇప్పుడు బాధ్యతగల ప్రజల కోసం కదన రంగంలో యుద్ధం చేసే నాయకులు అవసరమన్నారు. తాము పెట్టిన పార్టీ తన కోసమో, కొందరు నాయకుల కోసమో కాదని.. పూర్తిగా తెలంగాణ ప్రజల కోసమేనని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతీ బిడ్డను చదివించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఎంత పెద్ద జబ్బు అయినా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే చికిత్స చేయిస్తుందని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే జూరాల నుంచి ఇబ్రహీంపట్నం వరకు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు.
యువతను ప్రోత్సహిస్తామని.. వారి వ్యాపార ప్రణాళికను బట్టి రూ.2 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు రుణం ఇస్తామని ప్రకటించారు. ఇదంతా చెబుతుంటే కొంత మంది నవ్వుతూ ‘నేను చిన్న పిల్లను.. ఆడబిడ్డను.. ఏం తెలుసని ఎద్దేవా చేస్తున్నారని.. కానీ ఒక తల్లి ఎప్పుడూ తల్లీబిడ్డల బాగోగుల కోసం ఆలోచిస్తుందని స్పష్టం చేశారు. తాను బలవంతుడనని ఈ ముఖ్యమంత్రి విర్రవీగుతున్నారని, బలమైన సర్పం చలి చీమల చేతిలో చిక్కి చచ్చినట్టు ప్రజలు ఆయనను గద్దె దించే సమయం దగ్గరపడిందని పేర్కొన్నారు. కాగా, కోస్గి సభ కోసం కవిత హైదరాబాద్ నుంచి వందకుపైగా వాహనాలతో భారీ ర్యాలీగా వెళ్లారు. కొడంగల్ అంబేడ్కర్ చౌరస్తాలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కోస్గికి చేరుకున్నారు.
వార్తలనూ చదవండి:
హైరైజ్ భూములకు రైతుబంధు!
ఫ్యూచర్ సిటీకి హైస్పీడ్ కనెక్టివిటీ
Read Latest Telangana News And Telugu News