Share News

యాసంగిలో వరికి క్రాప్‌ హాలిడే!

ABN , Publish Date - Sep 21 , 2026 | 04:05 AM

వర్షాభావ పరిస్థితులు, నీటి లభ్యత లేకపోవటం, భూగర్భ జలాలు కూడా పడిపోతున్న నేపథ్యంలో.. వచ్చే యాసంగి సీజన్‌లో వరిసాగును పూర్తిగా నిలిపివేయాలనే ప్రతిపాదనను వ్యవసాయ శాస్త్రవేత్తలు తెరపైకి తెస్తున్నారు.

యాసంగిలో వరికి క్రాప్‌ హాలిడే!
Paddy Crop Holiday

  • నీటి లభ్యత లేదని, వరి వద్దని సూచిస్తున్న శాస్త్రవేత్తలు

  • ప్రత్యామ్నాయ ప్రణాళికపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి

  • ఆరుతడి పంటలు సాగుచేయాలని ఇప్పటి నుంచే ప్రచారం

  • ఎకరం వరి సాగయ్యే నీటితో మూడెకరాల మొక్కజొన్న సాగు

  • తక్కువ నీరు, తేమతోనే పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు

  • ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొంటూనే.. అన్నదాతలకు నష్టం కలగకుండా చూడాలన్నదే లక్ష్యం

  • ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్‌ భద్రత కోరుతున్న రైతులు

  • ఖరీ్‌ఫలో వద్దన్నా వరి సాగు.. అతికష్టంగా గట్టెక్కే పరిస్థితి

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితులు, నీటి లభ్యత లేకపోవటం, భూగర్భ జలాలు కూడా పడిపోతున్న నేపథ్యంలో.. వచ్చే యాసంగి సీజన్‌లో వరిసాగును పూర్తిగా నిలిపివేయాలనే ప్రతిపాదనను వ్యవసాయ శాస్త్రవేత్తలు తెరపైకి తెస్తున్నారు. వరికి క్రాప్‌ హాలిడే ప్రకటించి.. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని స్పష్టం చేస్తున్నారు. నిజానికి వరిసాగును తగ్గించాలని ఖరీఫ్‌ సీజన్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా, వ్యవసాయశాఖ విస్తృత ప్రచారం చేసినా.. రైతులు తగ్గించలేదు. సుమారు 56 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఇప్పుడా పంట అతి కష్టమ్మీద గట్టెక్కే పరిస్థితినెలకొంది.


కానీ వచ్చే యాసంగిలో వరి సాగు సాధ్యంకాదని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అంశంలో స్పష్టమైన వైఖరితో ఉన్నాయి. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొంటూనే, రైతులకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికలపై దృష్టి సారించాలని ఆలోచనకు వచ్చాయి. ఈ క్రమంలో వరి సాగును నియంత్రించాలని తాజాగా హైదరాబాద్‌లో కేంద్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సు’లో నిర్ణయించారు.


ఉధృతమవుతున్న ఎల్‌నినో ప్రభావం

ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. నైరుతి రుతుపవనాలు నిరాశపరిచాయి. లోటు వర్షపాతం ఏర్పడింది. జలాశయాలు, చెరువులు, కుంటలేవీ నిండలేదు. ఈ ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన శాస్త్రవేత్తలు ఖరీఫ్‌ సీజన్‌లోనే హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎల్‌నినో అంశంపై పెద్దఎత్తున ప్రచారం చేసింది. వరికి బదులు పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, చిరుధాన్యాలు సాగుచేయాలని వ్యవసాయశాఖ ప్రచారం చేసింది. అయినా రైతులు సుమారు 56 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఇది సాధారణం విస్తీర్ణం 66 లక్షల ఎకరాలతో పోలిస్తే తక్కువే అయినా అడపాదడపా వానలు, గత ఏడాది నుంచీ ఉన్న నీటి నిల్వలతో గట్టెక్కే అవకాశం నెలకొంది.


కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రధాన జలాశయాలైన నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌ నిండలే దు. కాల్వల ద్వారా నదీ జలాలు వచ్చే పరిస్థితి లేదు. భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఖరీఫ్‌ సాగుకు వాడకంతో చెరువులు, కుంటలు, ఇతర జలాశయాల్లో ఉన్న కాస్త నీటి నిల్వలూ అడుగంటుతున్నాయి. దీనితో ఉన్నకాస్త నీటి నిల్వలను తాగు అవసరాలకే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో వరి సాగు అసలే చేయొద్దని, పెట్టుబడి నష్టపోవద్దని జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. రైతునేస్తం వేదికలు, అవగాహన సదస్సులు, మీడియా చర్చలు, నిత్యం శాస్త్రవేత్తలతో ఫోన్‌లో సంప్రదింపుల్లో ఉండే ప్రొగ్రెసివ్‌ రైతులకు కూడా వరిసాగు వద్దని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచిస్తున్నారు.


నీటి వాడకం తక్కువ ఉండే పంటలతో మేలు..

వరి సాగుకు నీటి వాడకం చాలా ఎక్కువ. ఒక ఎకరం వరి సాగుచేసే నీటితో 3 ఎకరాల మొక్క జొన్న, 3 ఎకరాల పొద్దుతిరుగుడు పంటలు సాగుచేయొచ్చని, పప్పు దినుసులైతే 4 ఎకరాలు కూడా సాగుచేయొచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నువ్వులు, పెసర్లు, మినుములైతే భూమిలో ఉన్న తేమతోనే పండుతాయని స్పష్టం చేస్తున్నారు. చెలక నేలల్లో ఆరుతడి పంటల సాగు సరేగానీ, వరి పండించే పొలాల్లో ఈ పంటలు సాగుచేయొచ్చా? అనే సందేహాలు అవసరం లేదని చెబుతున్నారు. వరి సాగుచేసిన నేలల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర్లు, మినుముల వంటివి సులువుగా సాగుచేయొచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.


జిల్లాలవారీగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నట్లు తాజాగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని.. అందుకే దేశాన్నో, రాష్ట్రాన్నో యూనిట్‌గా తీసుకోకుండా.. జిల్లాలవారీగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 19న అధికారులతో సమీక్షించారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులను మళ్లించాలని, అవసరమయ్యే విత్తనాలను ముందస్తుగా సిద్ధం చేయాలని సూచించారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం 7సన్న రకాల వరికి క్వింటాల్‌కు రూ.500చొప్పున బోనస్‌ ఇస్తుండటంతో.. వరిపై రైతులు మొగ్గుచూపుతున్నారు. కానీ యాసంగి సీజన్‌లో వరికి బోనస్‌ ఇవ్వకూడదని సర్కారు నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ధాన్యం, బియ్యం నిల్వలు గణనీయంగా ఉన్నాయి. ఈ క్రమంలో యాసంగిలో వరికి క్రాప్‌ హాలీడే ప్రకటిస్తే మంచిదని శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు.


ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్‌ భద్రత

ఎన్ని లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తిచేసినా.. రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొంటోంది. కనీస మద్దతు ధర చెల్లిస్తోంది. ఇతర పంటలకు ఇలాంటి మార్కెట్‌ భద్రత లేదు. ఇప్పుడు వరికి బదులుగా.. పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, చిరుధాన్యాలు సాగుచేస్తే.. మార్కెట్‌ భద్రత ఉంటుందా? ప్రభుత్వం కొనుగోలుచేస్తుందా? ఽగిట్టుబాటు ధర లభిస్తుందా? అని రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని... ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధర, బోనస్‌ ప్రకటించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, పంటలు కొంటామని హామీ ఇస్తే.. రైతులు సాగుకు ముందుకు వస్తారని నిపుణులు పేర్కొంటున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

దళితుల భూములకు సంపూర్ణ రక్షణ
ఒక్కొక్కరికి రెండు మూడు ఫాంహౌస్‌లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 04:05 AM