ఒకవైపు హత్యలు..మరోవైపు దొంగతనాలు..ఈ నగరానికి ఏమైంది?
ABN , Publish Date - Sep 18 , 2026 | 07:56 AM
హైదరాబాద్ నగర ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంటోంది.
15 రోజుల్లో 8 హత్యలు..
రాత్రి, పగలు తేడాలేకుండా అరాచకం
అర్ధరాత్రి రెచ్చిపోతున్న రౌడీషీటర్స్, అల్లరిమూకలు
వరుస ఘటనలతో నగర ప్రజల బెంబేలు
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగర ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంటోంది. ఒకవైపు రౌడీషీటర్ల అరాచకాలు, హత్యలు, మహిళలపై లైంగిక దాడులు, మరోవైపు అంతర్రాష్ట్ర దొంగల బీభత్సం వంటి ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా అల్లరిమూకలు రెచ్చిపోతుండడంతో భయానక వాతావరణం నెలకొంది. రెండు వారాల పరిధిలోనే 8 హత్యలు జరగడం, వరుస దొంగతనాలు వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
పగటిపూటే నడిరోడ్డుపై..
చిన్న చిన్న విషయాలకు, పాతకక్షల నేపథ్యంలో దుండగులు తెగబడుతున్నారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు రౌడీషీటర్ల వర్గాల మధ్య జరిగిన గొడవలో.. ప్రత్యర్థులు కత్తులు, రాడ్లతో పగటిపూటే ఓ రౌడీషీటర్‌ను అత్యంత కిరాతకంగా హతమార్చారు. సీసీటీవీల్లో రికార్డైన ఈ భయానక దృశ్యాలు స్థానికులను వణికించాయి. అలాగే మూడు రోజుల క్రితం లాలాగూడలో జరిగిన ఓ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. పాత కక్షలను మనసులో పెట్టుకున్న యువకులు కొందరు గణేష్ విగ్రహం విషయమై వాగ్వాదానికి దిగి ఓ యువకుడిపై మూకుమ్మడిగా దాడిచేసి కత్తితో హతమార్చారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. ఇలా చిలకలగూడ, మైలార్‌దేవ్‌పల్లి, ఆల్వాల్ ఇలా రెండు రోజులకో మర్డర్ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
తాళం వేసిన ఇళ్లే టార్గెట్..
హత్యలతో పాటు నగరంలో వరుస చోరీలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మల్కాజిగిరిలో ఓ బిల్డర్ ఇంట్లో 48 తులాల బంగారు ఆభరణాలు, అంబర్‌పేట, హయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లో తాళం వేసిన ఇళ్లలో దొంగలు భారీగా నగదు, బంగారం, వజ్రాలను దోచుకెళ్లారు. ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా వెళ్లే యువకులను లక్ష్యంగా చేసుకుని దారిదోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి.
పబ్‌లలో గ్యాంగ్‌వార్లు
జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో చిన్న విషయానికి రెండు గ్రూప్‌లు రోడ్డుపైకి వచ్చి కొట్టుకున్న ఘటన తీవ్ర సంచలనమైంది. ఈ గొడవలో ఓ ప్రముఖ ఎంపీ సోదరుడు ఉండటం గమనార్హం. మరోవైపు సనత్‌నగర్‌లో ఐడీ ప్రూఫ్ అడిగినందుకు హోటల్ సిబ్బందిపై నలుగురు వ్యక్తులు కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేసి అరాచకం సృష్టించారు.
జైలుకు వెళ్లొచ్చినా..
శాంతి భద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నా కొత్త నేరస్థులు పుట్టుకొస్తున్నారు. కొందరు నేరగాళ్లు తుపాకులు, కత్తులతో తిరుగుతూ రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒకసారి రౌడీషీటర్‌గా ముద్రపడి, జైలుకెళ్లి వచ్చిన తర్వాత అదే బ్రాండ్‌ను కొనసాగిస్తూ.. హంతకులుగా మారుతున్నారు. రౌడీషీటర్స్ మధ్య వస్తున్న విభేదాల వల్లే ఒకరినొకరు, ప్రత్యర్థులుగా చేసుకొని హత్యలకు పాల్పడినట్లుగా ఇటీవల పోలీసుల విచారణలో తేలింది. కొత్త గ్యాంగ్‌ల్లో 20-30 ఏళ్ల వయసులో ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. నగరంలో వరుసగా వెలుగు చూస్తున్న ఈ నేర ఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుండగా.. నేరాల నియంత్రణకు పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News