Share News

ప్రీతిరెడ్డి పుట్టిన రోజు ఫ్లెక్సీలో.. కేసీఆర్‌, కేటీఆర్‌ ఫొటోలు లేవెందుకు?

ABN , Publish Date - Sep 18 , 2026 | 06:52 AM

ప్రీతిరెడ్డి పుట్టినరోజు ఫ్లెక్సీల్లో కేసీఆర్‌, కేటీఆర్‌ ఫొటోలు లేకపోవడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఫ్లెక్సీల చించివేతపై స్పందించిన ప్రీతిరెడ్డి, తన పుట్టినరోజు వేడుక రాజకీయ కార్యక్రమం కాదని తెలిపారు.

ప్రీతిరెడ్డి పుట్టిన రోజు ఫ్లెక్సీలో.. కేసీఆర్‌, కేటీఆర్‌ ఫొటోలు లేవెందుకు?
Preethi Reddy birthday flexis

  • బీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆగ్రహం.. ఫ్లెక్సీల చించివేత

  • నా మనోబలాన్ని, అభిమానాన్ని చించలేరు..

  • మాజీమంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి

పేట్‌బషీరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు డాక్టర్‌ ప్రీతిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని పలుకూడల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌, స్థానిక ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ల ఫొటోలను ఫ్లెక్సీల్లో పెట్టలేదని, పక్క నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల ఫొటోలతో ఫ్లెక్సీలను, కట్‌అవుట్‌లను ఏర్పాటు చేయడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నారు. నియోజకవర్గంలోని సుచిత్రా, చింతల్‌, జీడిమెట్ల, ఐడీపీఎల్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీఆర్‌ఎస్‌ శ్రేణులు చించివేశారు. తమ పార్టీ ముఖ్య నేతలను, స్థానిక ప్రజా ప్రతినిధులను విస్మరించి, మరొక మారు ఫ్లెక్సీలను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు హెచ్చరించారు.


ఇది పార్టీ కార్యక్రమం కాదు: ప్రీతిరెడ్డి

కొంపల్లిలోని డాక్టర్‌ ప్రీతిరెడ్డి ఆమె నివాసంలో గురువారం పుట్టినరోజు వేడుకలను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీల చించివేతపై ప్రీతిరెడ్డి స్పందించారు. ఇది పార్టీ కార్యక్రమం కాదని, ఇది రాజకీయ వేడుక అయ్యి ఉంటే ప్రొటోకాల్‌ ప్రకారం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేటీఆర్‌, ఇతర ముఖ్య నాయకుల ఫొటోలను ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేసేవాళ్లం అని చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా తనపై ఉన్న అభిమానంతో తమ కాలేజీ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారన్నారు. కొంతమంది అసూయతో తన ఫ్లెక్సీలను చించివేశారు కానీ, తన మనో బలాన్ని ప్రజలు, అభిమానులు తపై చూపిస్తున్న ప్రేమను చించలేరని వ్యాఖ్యానించారు.


ఈ వార్తలనూ చదవండి:

నిజాంను పొగిడిన రేవంత్‌, కేసీఆర్‌లు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
కాంగ్రెస్‌ది ‘ప్రజా వంచన’ పాలన

Updated Date - Sep 18 , 2026 | 06:52 AM