ఆర్టీసీలో వాహన వెతలు!
ABN , Publish Date - Sep 18 , 2026 | 06:41 AM
ప్రయాణికులను నిత్యం గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీని వాహనాల కొరత వేధిస్తోంది. ఒకవైపు రద్దీకి తగినన్ని బస్సుల్లేవని, ఉన్నవి కూడా పాతబడి.. లోడ్ లాగలేకపోతున్నాయని, కొత్తగా 4 వేల బస్సులు కొనుగోలు చేయాలని..
కొత్త బస్సులు కొనాలని కోరుతున్న ఉద్యోగ సంఘాలు
జేఎండీ సహా అధికారులకూ తప్పని కార్ల తిప్పలు
సర్దుబాటు చేయలేక ఏపీఎస్‌ఆర్టీసీ సతమతం
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రయాణికులను నిత్యం గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీని వాహనాల కొరత వేధిస్తోంది. ఒకవైపు రద్దీకి తగినన్ని బస్సుల్లేవని, ఉన్నవి కూడా పాతబడి.. లోడ్ లాగలేకపోతున్నాయని, కొత్తగా 4 వేల బస్సులు కొనుగోలు చేయాలని ఏపీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగ సంఘాలు కోరుతుంటే... మరోవైపు ఎండీ, జేఎండీ వంటి ఉన్నతాధికారులు తమకు కార్లు కావాలని అడుగుతున్నారు. తాము అద్దె కార్లలో తిరుగుతున్నామని వాపోతున్నారు. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) తనకు కారు లేదంటూ నెల రోజుల నుంచి చెబుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. మరోవైపు... ‘మా పనోళ్లకు ఏసీ లేని కారు ఇచ్చారు.. దాన్ని మార్చేయండి..’ అంటున్న ఇన్‌చార్జ్ ఎండీకి ఏం చెప్పాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన కార్ల కొరతకు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడమే కారణమని తెలుస్తోంది..!
అధికారుల దాటవేత ధోరణి
ఆర్టీసీలో 45 వేల మంది సిబ్బందితో పాటు 400 మంది వరకూ అధికారులు పనిచేస్తున్నారు. డిపో మేనేజర్లు, రీజినల్ మేనేజర్లు, హెచ్‌వోడీలు, ఈడీలు, జేఎండీల నుంచి సంస్థ ఎండీ వరకూ కార్లు సమకూర్చాల్సిన బాధ్యత ఆర్టీసీదే. అదే సమయంలో బోర్డు డైరెక్టర్లు, చైర్మన్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, రవాణాశాఖ మంత్రికి కూడా వాహనాలు సమకూర్చాలి. ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి కోన శశిధర్‌కు ఇటీవల కారు సమకూర్చిన అధికారులు, రెండు నెలల క్రితమే జేఎండీగా వచ్చిన ఐఎఫ్ఎస్ అధికారికి మాత్రం కారు ఇవ్వలేదు. ఆర్టీసీ హౌస్‌లో ప్రత్యేకంగా చాంబర్ సిద్ధం చేయించి అందులో ఆయన్ను కూర్చోబెట్టారు. తిరగాలంటే తనకు కారు అవసరమని, కొత్త కారు కొనాలని జేఎండీ అడుగుతుంటే.. ‘ప్రభుత్వ అనుమతి కావాలి’ అని అధికారులు దాట వేస్తున్నారు. ఆగస్టు వరకూ ఎండీగా పనిచేసి రిటైరైన ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం నుంచి కారు వెనక్కి తీసుకున్న అధికారులు దాన్ని ఇన్‌చార్జ్ ఎండీ కోన శశిధర్‌కు కేటాయించారు. అయితే ఏడాదిన్నర క్రితం పదవీ విరమణ చేసి...
ఈ ఏడాది జనవరిలో పూర్తిగా ఆర్టీసీని వదిలి వెళ్లిన ద్వారకా తిరుమల రావు నుంచి మాత్రం కార్లు వెనక్కి తీసుకోలేదు. ఆయన హైదరాబాద్‌లో ఉంటూ ఆర్టీసీకి చెందిన రెండు (ఇన్నోవా, బొలేరో) కార్లు వాడుకొంటున్నా అధికారులు వాటిని వెనక్కి తీసుకోకపోవడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ‘మా పనోళ్లకు ఇచ్చిన కారులో ఏసీ పని చేయట్లేదట.. దాన్ని మార్చేయండి’ అంటూ ఇన్‌చార్జ్ ఎండీ కోన శశిధర్ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేకపోతున్నారు. రవాణా శాఖ మంత్రి వద్ద ఉన్న రెండు ఖరీదైన (ఫార్చునర్, ఎంజీ హెక్టార్) కార్లలో ఒకటి వెనక్కి తీసుకుని జేఎండీకి ఇస్తే బాగుంటుందన్న చర్చ అధికారుల్లో జరుగుతోంది. కానీ, మంత్రి కార్యాలయాన్ని అడిగే సాహసం చేయలేకపోతున్నారు. కనీసం ఎండీ ఇంట్లో వాళ్లకోసమైనా మరో బొలేరో వాహనం ఏర్పాటు చేద్దామంటే.. తన ఇన్నోవా కారును కర్నూలులో కుటుంబసభ్యులకు ఇచ్చిన ఒక ఈడీ స్థాయి అధికారి ఇక్కడ అదనంగా ఉన్న బొలేరోలో తిరుగుతున్నట్లు తెలిసింది. దీంతో ప్రజల రద్దీకి అనుగుణంగా బస్సులు ఎలా సిద్ధం చేయాలన్న ఆలోచన నుంచి ఉన్నతాధికారులకు కార్లు ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై అధికారులు తల పట్టుకుంటున్నారు.
మంత్రి పేషీకి కాలం చెల్లిన కార్లు..
ప్రయాణికులకు సేవలందించే బస్సులే కాదు.. రవాణా మంత్రి పేషీలో పనిచేసే వారికి కూడా అధికారులు కాలం చెల్లిన వాహనాలు కేటాయించారు. అదేమిటని అడిగితే... ఇంతకంటే మరో మార్గం లేదని చెబుతున్నారు. ఆర్టీసీలో ఈడీ హోదాలో పనిచేసి పదవీ విమరణ చేశాక మంత్రి పేషీలో చేరిన కోటేశ్వరరావుకు ఆర్టీసీ కేటాయించిన ఇన్నోవా కారు (7999) వయసు 15 ఏళ్లు దాటింది. మంత్రి వ్యక్తిగత సహాయకుడు చైతన్యకు కేటాయించిన కారు (0123) పరిస్థితి కూడా అలాగే ఉంది. రవాణాశాఖ నిబంధనల మేరకు 15 ఏళ్లు దాటిన వాహనాలు వాడకూడదు. కార్ల కొరతతో రవాణా మంత్రి పేషీలో కీలకంగా వ్యవహరించే వాళ్లే ఇలా కాలం చెల్లిన వాహనాలు వాడుతుండటం చర్చనీయాంశమైంది. మరోవైపు ఎటువంటి ప్రభుత్వ ఆదేశాలు లేకుండా మంత్రి పేషీలో చేరిన ఒక వ్యక్తి తనకు కూడా కారు కావాలని తీసుకున్నా దాన్ని తిరిగి తీసుకునే ధైర్యం ఆర్టీసీ అధికారులు చేయలేక పోతున్నారు.
ఈ వార్తలనూ చదవండి: