తొలి అడుగులోనే ‘కృత్రిమ’ గండం!
ABN , Publish Date - Sep 21 , 2026 | 06:10 AM
AI విస్తరణతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై ప్రభావం పెరుగుతోందని గోల్డ్‌మన్ సాక్స్ నివేదిక పేర్కొంది. కాల్ సెంటర్లు సహా పలు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో టెక్నికల్ స్కిల్స్ కీలకంగా మారుతున్నాయి.
ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించే వారికి ‘ఏఐ’ ముప్పు!
డిగ్రీలున్నా దక్కని కొలువు.. ఏఐవైపే కంపెనీల మొగ్గు
కాల్ సెంటర్‌తో పాటు పలు రంగాల్లో తగ్గుతున్న ఉద్యోగాలు
గోల్డ్‌మన్ సాక్స్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): చేతిలో డిగ్రీ పట్టా పట్టుకుని, మంచి కంపెనీలో తొలి ఉద్యోగం సాధించాలని బయలుదేరుతున్న యువతకు మొదటి మెట్టు దగ్గరే కృత్రిమ మేధ రూపంలో సవాలు ఎదురవుతోంది. వేగంగా విస్తరిస్తున్న ఏఐ సాంకేతికతతో ఉద్యోగ ప్రపంచంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సులభంగా ఆటోమేట్ చేయగల ప్రాథమిక స్థాయి(ఎంట్రీ లెవెల్) పనులకు కొత్తగా మనుషులను తీసుకోవడంపై కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ‘గోల్డ్‌మన్ సాక్స్ రీసెర్చ్’ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది.
ఎంట్రీ లెవల్ పైనే తీవ్ర ప్రభావం!
జెనరేటివ్ ఏఐ సాధనాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కంపెనీల నియామక విధానాల్లో స్పష్టమైన మార్పు మొదలైందని నివేదిక పేర్కొంది. ఆటోమేషన్‌కు ఎక్కువ అవకాశం ఉన్న పరిశ్రమల్లో 2022 ద్వితీయార్థం నుంచి ఉద్యోగాలు తగ్గడం ప్రారంభమైంది. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియాల్లో వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించిందని నివేదిక వెల్లడించింది. అనుభవజ్ఞులైన ఉద్యోగులు ఏఐ పరిజ్ఞానాన్ని నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను మార్చుకునే వెసులుబాటు పొందుతుండగా, కెరీర్ ప్రారంభించే జూనియర్ ఉద్యోగులకు మాత్రం అవకాశాలు సన్నగిల్లి తీవ్ర పోటీ నెలకొంటోంది. గతంలో కొత్తగా చేరిన ఉద్యోగులకు అప్పగించే డేటా నిర్వహణ, సాధారణ కస్టమర్ సపోర్ట్, ప్రాథమిక కంటెంట్ తయారీ వంటి పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ చిటికెలో పూర్తి చేస్తున్నాయి.
పలురంగాల్లో తగ్గుతున్న అవకాశాలు
ఏఐ తుఫాను ధాటికి అత్యధికంగా దెబ్బతింటున్న రంగాల్లో ‘కాల్ సెంటర్లు’ ముందు వరుసలో నిలుస్తున్నాయి. దీర్ఘకాలిక ధోరణితో పోలిేస్త అమెరికాలో కాల్‌సెంటర్ ఉద్యోగాలు ఏకంగా 39 శాతం మేర తగ్గాయి. కెనడాలో 33 శాతం, జర్మనీలో 27 శాతం తక్కువగా నమోదయ్యాయి. భారత కాల్ సెంటర్లలోనూ గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయని ‘ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్’ తన నివేదికలో పేర్కొంది.
కస్టమర్లతో మాట్లాడటం, సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సమాచారాన్ని సేకరించడం వంటి పనులను ఏఐ ఆధారిత చాట్‌బాట్లు, వాయిస్ ఏజెంట్లు సులువుగా చేస్తుండటంతో సంక్లిష్టమైన సమస్యలకే మానవ వనరుల అవసరం ఏర్పడుతోందని అధ్యయనం చెబుతోంది. ఏఐ సాధనాల రాకతో సంప్రదాయ డిగ్రీల విలువ తగ్గిపోతోందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం డిగ్రీతోనే సరిపెట్టుకోకుండా ఏఐ సాధనాలపై పట్టు సాధిస్తేనే కొత్తతరం ఉద్యోగార్థులకు ఆశించిన స్థాయిలో అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.
వార్తలనూ చదవండి:
2,800 ఓట్ల తొలగింపు!
రేవంత్‌ది రాక్షస పాలన
Read Latest Telangana News And Telugu News