టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!
ABN , Publish Date - Jun 15 , 2026 | 06:00 PM
హిమాచల్ ప్రదేశ్‌లోని కసోల్‌లో కొందరు టూరిస్టుల వింతచేష్టలు వివాదానికి తెరతీశాయి. కారు టాప్‌పై కూర్చొని అర్ధనగ్నంగా ప్రయాణించిన వారి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కసోల్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే.. ఈసారి అక్కడి ప్రకృతి సౌందర్యమో లేక పర్యాటక ఆకర్షణలోనో కాదు.. కొందరు టూరిస్టుల వింత ప్రవర్తనతో. ఆ పర్యాటకుల విచిత్ర విన్యాసాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు యువకులు కారు టాప్‌పై చొక్కాల్లేకుండా అర్ధనగ్నంగా ప్రయాణించంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఈ వీడియోను నిఖిల్ సైనీ ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షేర్ చేస్తూ సదరు పర్యాటకుల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీచ్ ప్రాంతాల్లో ఇలాంటివి ఓకే.. కానీ కొండప్రాంతాల్లో, మహిళలు తిరగాడుతున్న ప్రదేశాల్లో ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది కేవలం దుస్తుల విషయమే కాదని, పర్యాటక ప్రదేశాల్లో పాటించాల్సిన కనీస మర్యాద, బాధ్యత అని పలువురు అంటున్నారు. ఇలాంటి కొందరి వికృత చేష్టల వల్ల పర్యాటక ప్రాంతాల ప్రతిష్ఠ దెబ్బతినడం సహా ఆ ప్రాంతానికీ చెడ్డపేరొచ్చే అవకాశముందని కొందరు వాపోతున్నారు. కదులుతున్న కారు పైకప్పుపై కూర్చోవడం ప్రమాదకరమని, అలాంటి స్టంట్లు ప్రాణాంతకమని మరికొందరు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో దేశంలోని పలు పర్యాటక ప్రాంతాల్లో చెత్త వేయడం, ప్రమాదకర డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర ప్రవర్తనలు వంటి ఘటనలు తరచూ తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కసోల్ ఘటన మరోసారి బాధ్యతాయుత పర్యాటకాన్ని గుర్తుచేసింది. టూరిజమ్ అంటే కొత్త ప్రాంతాలను ఆస్వాదించడం మాత్రమే కాదని.. అక్కడి స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల మనోభావాలనూ గౌరవించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అన్నది పక్కన పెడితే.. ఈ ఘటన మాత్రం పర్యాటకుల ప్రవర్తన, సామాజిక బాధ్యత, ప్రజల పట్ల మర్యాదలపై మరోసారి చర్చకు తెరతీసింది.
ఇవీ చదవండి:
పైలట్ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!
జపాన్ జనాల పద్ధతే వేరు.. ప్రపంచం ఫిదా