వాన నీటి కచేరీ
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:35 AM
ఓ సంగీత కచేరీ నిర్వహించాలంటే... వాద్య పరికరాలు కావాలి. సంగీత దర్శకుడు కావాలి. సంగీతకారులు కావాలి.
ఓ సంగీత కచేరీ నిర్వహించాలంటే... వాద్య పరికరాలు కావాలి. సంగీత దర్శకుడు కావాలి. సంగీతకారులు కావాలి. కానీ జర్మనీలోని డ్రెస్టెన్ నగరంలో సంగీత కచేరీకి మాత్రం ఇవన్నీ అవసరం లేదు. కేవలం వర్షం ఉంటే చాలు... వాన నీటితోనే సంగీత కచేరీ ప్రారంభమవుతుంది. ఈ ప్రకృతి కచేరీ వినేందుకు స్థానికులే కాదు... పర్యాటకులూ అమితాసక్తి కనబరుస్తుంటారు.
ఆకాశం నుంచి పడే వర్షపు నీటి శబ్దం ఆహ్లాదభరితంగా ఉంటుంది. రేకుల ఇల్లయితే వాన చినుకుల శబ్దం గమ్మత్తుగా వినిపిస్తుంది. అయితే జర్మనీలోని డ్రెస్టెన్ నగరంలో ఉన్న ఒక ఇంటిపై వాన పడుతుంటే మాత్రం... ఒక వినసొంపైన సంగీత కచేరీ మొదలవుతుంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? వర్షపు నీరే ఆ ఇంటికి అమర్చిన గొట్టాలలో నుంచి పడి లయ బద్ధంగా సంగీతం వినిపిస్తుంది. డ్రెస్టెన్ నగరంలోని కున్‌స్టోఫ్‌పాసేజ్ ప్రాంతంలో ఉందా సంగీతభరితమైన ఇల్లు. స్థానికులు ఆ ఇంటిని ‘సింగింగ్ డ్రెయిన్ పైప్స్’ అని పిలుస్తారు. వినూత్నమైన నిర్మాణాలలో ఈ ఇల్లు ఒకటిగా గుర్తింపు పొందింది.
విభిన్నంగా పైపుల అమరిక...
ఒకప్పుడు అన్ని భవనాల్లాగే... ఇది కూడా సాధారణ భవనంగానే ఉండేది. అయితే శిల్పి అన్నెట్ పాల్, డిజైనర్లు క్రిస్టోఫ్ రోస్‌నర్, ఆండ్రే టెంపెల్ కలిసి ఈ భవనాన్ని మ్యూజికల్ బిల్డింగ్‌గా తీర్చిదిద్దారు. భవనం బయట ఏర్పాటు చేసిన అల్యూమినియం పైపులు, గరాటాలు, లోహపు గొట్టాలను వివిధ ఆకారాల్లో అమర్చారు. వర్షం ప్రారంభమైన వెంటనే నీటి బిందువులు ఈ గరాటాల్లో పడతాయి. అక్కడి నుంచి వాటికి అమర్చిన పైపుల గుండా మెలికలు తిరుగుతూ ప్రయాణిస్తూ... ఒక్కో గొట్టాన్ని తాకే కొద్దీ భిన్నమైన శబ్దాలను సృష్టిస్తాయి. ఆ శబ్దాలన్నీ కలిసి ఒక మధురమైన సంగీతంలా వినిపిస్తాయి. ఆ శబ్దం అచ్చంగా ఎవరో సంగీత కళాకారుడు వాయిస్తున్న వాద్యంలా అనిపిస్తుంది. ప్రకృతి సంగీత దర్శకురాలిగా మారిందా? అనిపిస్తుంది. అయితే ప్రతీసారి ఒకే రకమైన సంగీతం వినిపించదు సుమా! వర్షపు చినుకుల వేగం, గాలి దిశ, నీటి పరిమాణాన్ని బట్టి సంగీతం కూడా మారిపోతుంది.
మొత్తానికి ఆ బిల్డింగ్‌పై పడే ప్రతీ వర్షపు చుక్క ఒక సరికొత్త కచేరీని మొదలెడుతుంది. పూర్తిగా వర్షపు నీరు, గురుత్వాకర్షణ, పైపుల రూపకల్పనే ఈ అరుదైన సంగీతానికి కారణం. ఈ విచిత్ర సంగీత భవనం ఉన్న ప్రాంగణాన్ని ‘కోర్ట్‌యార్డ్ ఆఫ్ ఎలిమెంట్స్’ గా పిలుస్తారు. వానాకాలంలో ఈ సంగీతాన్ని వినడానికి పర్యాటకులు ప్రత్యేకంగా అక్కడికి వెళ్తుంటారు. గొడుగులు పట్టుకుని గంటల తరబడి అక్కడే నిలబడి ప్రకృతి సంగీతాన్ని ఆస్వాదిస్తారు. నీటిని బయటకు పంపే డ్రెయిన్ పైపులను కూడా సృజనాత్మకతతో ఏర్పాటుచేసి, పర్యాటక ఆకర్షణగా మార్చవచ్చని నిరూపించారు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిలాగే వాన చినుకులు సంగీత ప్రవాహంగా మారడం అబ్బురమే కదా!
ఈ వార్తలు కూడా చదవండి:
స్కూలు పుస్తకంలో తన కథే ఓ పాఠంగా..!
Read Latest AP News And Telangana News And International News And Telugu News