వేగంగా విస్తరిస్తోన్న ఔచ్... ప్యాచ్
ABN , Publish Date - Jul 26 , 2026 | 10:53 AM
ఒళ్లునొప్పులకో, సౌందర్య పోషణకో... ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు వేసుకోవడం... ఆయింట్‌మెంట్లు, ఆయిల్స్ రాసుకోవడం గతం... ఒక ప్యాచ్ వేసుకొని ముందుకు సాగడం వర్తమానం.
ఒళ్లునొప్పులకో, సౌందర్య పోషణకో... ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు వేసుకోవడం... ఆయింట్‌మెంట్లు, ఆయిల్స్ రాసుకోవడం గతం... ఒక ప్యాచ్ వేసుకొని ముందుకు సాగడం వర్తమానం. ఒకప్పటి బ్యాండెయిడ్ లాంటి ప్యాచ్‌లు ఎన్నో వచ్చేశాయిప్పుడు. మొటిమలకైనా, ప్రయాణంలో బడలికకైనా, చివరికి సిగరెట్ వ్యసనాన్ని మానేయాలన్నా... ప్రతీదానికి ప్యాచ్‌లే పరమార్థంగా కనిపిస్తున్నాయి. నొప్పితో, అసౌకర్యంతో ‘ఔచ్’ అన్న ప్రతీసారి... సరికొత్త ‘ప్యాచ్’ వైపు చూస్తోన్న ఆధునిక పోకడలపై ఫోకస్...
కూరగాయలు తరుగుతుంటేనో, ఏదైనా పని చేస్తుంటేనో ప్రమాదవశాత్తు చిన్నగా చేయి తెగితే... వెంటనే బ్యాండెయిడ్ వేయడం తెలుసు. అలాగే కండరాల నొప్పులు, ఇతరత్రా నొప్పులకు పెయిన్ కిల్లర్లు వేసుకోవడమూ తెలుసు. ఇక బరువు తగ్గాలనుకున్నప్పుడు, హార్మోన్లలో తేడా ఉంటే... మందుబిళ్లలే దిక్కు. ఇది ఒకప్పుడు... ప్రస్తుతం మోడ్రన్ జీవితంలో సింపుల్‌గా అన్నింటికీ ప్యాచ్‌లు వచ్చేశాయి. ఇవి సాధారణ పెయిన్ కిల్లర్ మందుబిళ్లల్లా కాకుండా... చర్మం ద్వారా మందును నేరుగా నొప్పి ఉన్న చోటుకే పంపిస్తాయి. ఈ ఆధునిక ప్యాచ్‌ల వల్ల కడుపులో మంట, అల్సర్ల వంటి సైడ్ ఎఫెక్ట్‌లు... లివర్, కిడ్నీలపై పడే భారం ఉండదంటున్నారు. ఇప్పుడిప్పుడే ఈ ప్యాచ్‌ల సంస్కృతి మన దగ్గర నగరాల నుంచి పట్టణాలకు కూడా విస్తరిస్తోంది. ఆన్‌లైన్‌లో ప్రతీ నొప్పికి, కొన్ని ఆరోగ్య సమస్యలకు, సౌందర్య సమస్యలకు ప్రత్యేకంగా ప్యాచ్‌లు లభిస్తున్నాయి. వాటిని వేసుకొని ఎలాంటి అసౌకర్యం లేకుండా ముందుకు సాగుతున్నారు.
నొప్పి తగ్గేందుకు...
కండరాల నొప్పా? మజిల్ పట్టేసిందా? నొప్పి నివారణ కోసం మందులు వేసుకోవాల్సిన అవసరం లేకుండా ‘పెయిన్ రిలీఫ్ ప్యాచ్’ని ఉపయోగించొచ్చు. సెలబ్రిటీలు ముఖ్యంగా క్రీడాకారులు ఈ ప్యాచ్‌లు వేసుకొని కనిపిస్తుంటారు. వీటిల్లో చాలా రకాలున్నాయి. లిడోకైన్ అనేది నొప్పులను తగ్గించే మందు. దీంతో తయారు చేసిన ప్యాచ్‌లను నొప్పి ఉన్న చోట వేయగానే... మొదట అక్కడ చర్మం మొద్దుబారినట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో మందు పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇక డిక్లోఫెనాక్ అనే పెయిన్‌కిల్లర్‌తో చేసే ప్యాచ్‌లను కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు ఉన్న చోట వేసుకుంటే కొన్ని నిమిషాల్లో రిలీఫ్‌గా ఫీలవుతారు. కండరాల బిగుతూ, వాపును తగ్గించడానికి హెర్బల్ లేదా ఆయుర్వేదిక్ ప్యాచ్‌లున్నాయి. ఇవేకాకుండా.. మెంథాల్, కర్పూరం, క్యాప్సైసిన్ వంటి పదార్థాలతో తయారుచేసిన కంటెరిరెంట్ ప్యాచ్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. నొప్పిని తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులను... నేరుగా నొప్పిగా ఉన్న ప్రాంతాల్లో వేసే ప్యాచ్‌లు కూడా దొరుకుతాయి. తీవ్రమైన, దీర్ఘకాలిక నొప్పులను నియంత్రించడానికి ఓపియాయిడ్ ప్యాచ్‌లున్నాయి.
చల్లగా... వెచ్చగా...
సాధారణంగా నొప్పి ఉన్న చోట ఐస్ పెట్టడం, లేదంటే కాపడం ద్వారా ఉపశమనం లభిస్తుందనేది అందరికీ తెలిసిందే. ఇలాంటి పనులు కూడా విచిత్రంగా ప్యాచ్‌ల్లోకి ఒదిగిపోయాయి. ప్రముఖ కంపెనీ హూప్ ‘కూలింగ్ ప్యాచెస్’ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాచుల్లో ఎక్కువగా చల్లదనాన్ని ఇచ్చే మెంథాల్ లేదా కర్పూరంతో నింపిన హైడ్రోజల్ ఉంటుంది. ఇవి కండరాల నొప్పి, బెణుకులు, కీళ్ల నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడుతాయి. నొప్పి ఉన్నచోట ముందుగా చల్లని అనుభూతిని అందించి.. ఆ నొప్పిని క్రమంగా తగ్గిస్తాయి. నొప్పిని తగ్గించేందుకు కాపడం పెట్టడమనే సంప్రదాయ ప్రక్రియ మనదేశంలో ఎప్పటి నుంచో ఉంది. దాని స్థానంలో సరికొత్తగా ‘హీట్ ప్యాచ్’లు వచ్చేశాయి. ఈరకం ప్యాచ్‌లు రక్తప్రసరణను పెంచి, బిగుసుకుపోయిన కండరాలను సడలించేందుకు ఉపయోగపడతాయి. కీళ్లనొప్పులు, మహిళలు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి నివారణకు వీటిని వాడుతుంటారు. ఇవి 4 నుంచి 12 గంటల పాటు తక్కువ స్థాయిలో వేడిని అందిస్తాయి.
ప్రయాణంలో పనికొస్తాయి...
ప్రయాణమంటేనే పడరాని బాధలు పడుతుంటారు కొంతమంది. కారులో, బస్సులో ఎక్కగానే తల తిరుగుతోందని వాంతి చేసుకుంటుంటారు. వారితోపాటు ప్రయాణిస్తున్నవారికి ఇలాంటి చర్యలతో అసౌకర్యంగా ఉంటుంది. అలాంటి వాళ్లను నిమ్మకాయో, నారింజ బిళ్లనో దగ్గర ఉంచుకోమని చెప్పేవాళ్లు ఒకప్పుడు. తర్వాతి కాలంలో చిన్న చిన్న ట్యాబ్లెట్స్ వ చ్చాయి. ఈ విధంగా ప్రయాణం అంటే పడనివారి కోసం తాజాగా ‘మోషన్ సిక్‌నెస్ ప్యాచ్’లు అందుబాటులో ఉన్నాయి. వీటిని చెవి వెనుక లేదా నాభి దగ్గర వేసుకోవాల్సి ఉంటుంది. పుదీనా, అల్లం, ఇతర ఆయిల్స్‌తో తయారుచేసిన ఈ ప్యాచ్‌లను ప్రయాణం చేయడానికి నాలుగు గంటల ముందు వేసుకోవాల్సి ఉంటుంది. మూడు రోజుల వరకు ఈ ప్యాచ్‌ని అలాగే ఉంచుకోవచ్చు. ఈ ప్యాచ్‌ల వల్ల నిద్ర మత్తులాంటిది కూడా ఉండదు. పైగా సౌకర్యంగా ఉండి ప్రయాణంలో వాంతులు, తలనొప్పి బాధలను తప్పిస్తుంది.
హార్మోన్ల సమతుల్యత...
మహిళల్లో హార్మోన్ల సమస్య తరచూ తలెత్తుతుంటుంది. అలాంటప్పుడు కూసింత కుంగుబాటుకు లోనవుతుంటారు. మందుబిళ్లలు మింగడం వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ తలెత్తుతాయి. అందుకే అలాంటివారి కోసం ‘హార్మోనల్ ప్యాచ్’లు వచ్చేశాయి. వీటిల్లోని ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ వంటి మందులు చర్మం ద్వారా శరీరంలోకి వెళ్లి పనిచేస్తాయి. వీటిని మెనోపాజ్ లక్ష ణాలను నియంత్రించడానికి, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ కోసం ఉపయోగిస్తారు. అండం విడుదలను నిరోధించడం, గర్భాశయ ముఖద్వార శ్లేష్మాన్ని చిక్కబరచడం, గర్భాశయ పొరను ఈ ప్యాచ్‌లు పలుచన చేస్తాయి. అంతేగాకుండా వేడి ఆవిర్లు, రాత్రిపూట చెమట పట్టడాన్ని తగ్గించేందుకు, బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి మెనోపాజ్ ప్యాచ్‌లను వాడుతారు. భుజం దగ్గర, నడుము మీద, వీపు మీద, నడుము కింద భాగంలో ఈ ప్యాచ్‌లను వేసుకుంటారు. కాకపోతే వీటిని ఏ రోజున, ఏ సమయానికి వేసుకున్నారో తప్పక నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెనోపాజ్ ప్యాచ్‌లను డాక్టర్ సలహా మేరకు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది.
మొటిమలకూ ప్యాచ్‌లే...
టీనేజీలో ఉన్న పిల్లలను వేధించే ప్రధాన సమస్య మొటిమలు. ముఖం మీద మొటిమలొస్తే... ఇంటి బయటకు రావాలంటేనే ఇబ్బందిగా ఫీలవుతుంటారు. మొటిమలు తగ్గేందుకు ఏవేవో క్రీములు పూసేస్తుంటారు. చిట్కాలు పాటిస్తుంటారు. యువతరం కోసం స్టయిలిష్ ‘యాక్నే ప్యాచ్’లు ట్రెండీగా మారాయి. ఈ ప్యాచ్‌లు మొటిమ మీద మాత్రం వేసుకొనేలా చిన్నగా ఉంటాయి. ఇవి చర్మంలోని అధిక నూనెను పీల్చుకొని... చీము, వాపును తగ్గిస్తాయి. అలాగే మొటిమను గిల్లకుండా నివారించేందుకు కూడా పనికొస్తాయి. రాత్రిపూట ముఖాన్ని శుభ్రంగా కడిగి వీటిని వేసుకుంటే సరిపోతుంది. కనీసం 6 నుంచి 8 గంటల పాటు ఈ ప్యాచ్ మొటిమ మీద ఉండేలా చూడాలి. వీటిలో సోలిసిలిక్ యాసిడ్ ప్యాచ్‌లు మొటిమలను త్వరగా తగ్గించేందుకు దోహదం చేస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు. అదేవిధంగా ముఖం మీద బ్లాక్‌హెడ్స్‌తో బాధపడేవారి కోసం కూడా ప్రత్యేకంగా ప్యాచ్‌లున్నాయి. బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట వీటిని అతికించడం ద్వారా... చర్మం లోపలి నుంచి బ్లాక్‌హెడ్స్‌ను నిర్మూలించే వీలుంటుంది.
పొగరాయుళ్ల కోసం..
పొగరాయుళ్ల కోసం ప్యాచ్‌లున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. పొగరాయుళ్లు ఈ దురలవాటును మానేయాలంటే ఇంతకుముందు కౌన్సిలింగ్ లేదా నికోటిక్ ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉండేవి. ట్యాబ్లెట్స్‌కు బదులుగా తాజాగా ‘నికోటిన్ ప్యాచ్’ వేసుకుంటే చాలంటున్నారు. ఇది పొగాకు వాడకాన్ని మానుకోవడానికి ఉపయోగించే ఒక ‘ట్రాన్స్ డెర్మల్ స్కిన్ ప్యాచ్’. దీనిని వేసుకుంటే... పొగతాగాలనే కోరికను అరికట్టేలా నికోటిన్‌ను స్థిరమైన మోతాదులో క్రమంగా రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తుంది. ఈ ప్యాచ్‌ను చేయి, ఛాతీ లేదా తుంటి ప్రదేశాల్లో వేసుకోవాల్సి ఉంటుంది. రోజూ ఒకేచోట కాకుండా వేర్వేరు చోట్ల వేసుకుంటే దురదలు రాకుండా ఉంటాయి. ఆయా బ్రాండ్‌లను బట్టి ప్యాచ్‌లను సాధారణంగా 16 లేదా 24 గంటల పాటు వేసుకోవాలి. నికోటిన్ వాడకాన్ని బట్టి ప్యాచ్‌ల్లో మోతాదు ఉంటుంది. వైద్యుడి సలహా మేరకు 10 నుంచి 12 వారాల పాటు వేసుకోవాలి. అయితే వీటి ఫలితాలను అంచనా వేయాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
ముడతలు రాకుండా..
కొందరు చిన్నవయసులోనే పెద్దవాళ్లలా కనిపిస్తుంటారు. దానికి కారణం జుట్టు రంగు, చర్మం మీద ముడతలు. జుట్టుకైతే రంగు వేసి మేనేజ్ చేయొచ్చు. కానీ ముడతల మాటో? అలాంటివారి కోసం ‘యాంటీ ఏజింగ్ ప్యాచ్’లు వచ్చాయి. శస్త్ర చికిత్స అవసరం లేకుండా ఈ ప్యాచ్‌లు పనిచేస్తాయంటున్నారు. వీటిలో ఉండే హైలురోనిక్ యాసిడ్ వల్ల చర్మం తేమతో, విటమిన్-ఇ వల్ల సాగకుండా నిగనిగలాడుతుంది. వీటిల్లో సిలికాన్, పేపర్ ప్యాచ్‌లు కూడా లభిస్తున్నాయి. ఇవి కండరాలు సడలిపోకుండా నిరోధిస్తాయి. ఫలితంగా చర్మం బిగుతుగా మారుతుంది. సౌందర్య ప్రపంచంలో వీటికి బాగా డిమాండ్ ఉంది. నుదురు, కళ్ల కింద, చెంపలు... ఇలా విడివిడిగా వేసుకునేలా ఈ ‘రింకిల్ ప్యాక్స్’ దొరుకుతాయి. వీటిని సాధారణంగా 2 నుంచి 8 గంటల పాటు లేదంటే రాత్రంతా వేసుకోవాల్సి ఉంటుంది.
ఆరోగ్యపరమైన ట్రాక్ రికార్డ్..
ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడానికి రక్త నమూనాలను పదేపదే తీయకుండా... శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను, హృదయ స్పందనలను, ఒత్తిడి స్థాయిలను, ఇతర ఆరోగ్య సమాచారాన్ని నిరంతరం మానిటర్ చేసే హెల్త్ ప్యాచ్‌లు కూడా ఉన్నాయండోయ్. వీటికి కొంత సాంకేతికత కూడా జోడై... ఎప్పటికప్పుడు ఫోన్‌కి సమాచారాన్ని చేరవేస్తాయి. ఈ ప్యాచ్‌లోని సెన్సర్ చర్మం కింద 5 మి.మీ లోతులోకి ప్రవే శించి, ఇంటర్‌స్టిషియల్ ఫ్లూయిడ్‌లోని గ్లూకోజ్ స్థాయిలను గుర్తిస్తుందన్నమాట. ఈ ప్యాచ్‌లు 24 గంటలు గ్లూకోజ్ స్థాయిలను పర్యవేక్షిస్తాయి. 10 నుంచి 14 రోజుల దాకా పనిచేస్తాయి. వీటిని ఎప్పుడు మార్చాలన్నది మాత్రం డాక్టర్లు చెబుతారు. మధుమేహ ప్యాచ్‌లను చేతి మీద అతికించుకోవచ్చు. గుండె పనితీరును తెలుసుకొనే ప్యాచ్‌లను మాత్రం ఛాతీపై అతికించాల్సి ఉంటుంది. ఈ ప్యాచ్ ఒక ఈసీజీలా పనిచేస్తుంది.
క్యాన్సర్ ప్యాచ్..
మార్కెట్లోకి క్యాన్సర్‌ను కనిపెట్టే ప్యాచ్‌లు కూడా వచ్చేశాయి. ఈ రకమైన ప్యాచ్‌ల్లో రెండు రకాలున్నాయి. ఒకటి... క్యాన్సర్‌ని గుర్తించే ప్యాచ్‌లైతే... రెండో రకం... క్యాన్సర్ చికిత్స వల్ల వచ్చే నొప్పులను తగ్గించేలా ఈ ప్యాచ్‌లు తయారయ్యాయి. సైంటిస్టులు క్యాన్సర్‌ని నిర్ధారించే పెయిన్‌లెస్ ప్యాచ్ కనిపెట్టారు. ఈ నానోనీడిల్ ప్యాచ్‌పై లక్షలాది మైక్రోస్కోపిక్ నీడిల్స్ ఉంటాయి. అవి వెంట్రుక కన్నా వెయ్యి రెట్లు సన్నగా ఉంటాయి. మామూలు బయాప్సీలా కణజాలాన్ని కోయాల్సిన పనిలేదు. ఈ నానో సైజు సూదులు కణాల నుంచి మాలిక్యులర్ సిగ్నల్స్‌ను సున్నితంగా గ్రహించి నిర్ధారిస్తాయి. క్యాన్సర్ తొలిదశల్లోనే ట్రాక్ చేయడం ఈ ప్యాచ్‌ల వల్ల సులభమవుతుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్యాచ్ క్యాన్సర్‌కే కాదు.. అల్జీమర్స్, ఊపిరితిత్తుల సమస్యల్లాంటి ఇతర జబ్బులను కూడా గుర్తించగలదని పరిశోధకులు అంటున్నారు. క్యాన్సర్ నివారణకు కీమోథెరపీ తీసుకున్న తర్వాత... ఆ నొప్పులు తగ్గేంచేందుకు కూడా ప్యాచ్‌లు వచ్చాయి. ప్రతీసారి మాత్రలు మింగకుండానే ఈ ప్యాచ్‌లే చర్మం ద్వారా రక్తంలోకి సమయానుసారంగా మందు పంపే ఏర్పాటు ఉంటుంది. అయితే వీటిని డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ లేకుండా వాడరాదు.
డీటాక్స్ చేస్తుంది...
శరీరంలో టాక్సిన్స్ వల్ల అలసట, నిద్రపట్టకపోవడం వంటి ఆరోగ్య సమస్యలుంటాయి. దీనికి సింపుల్ సొల్యూషన్.. ‘డీటాక్స్ ప్యాచ్’. మామూలుగా అయితే శరీరమే ఒక పెద్ద డీటాక్స్ మెషీన్. కానీ కొన్నిసార్లు జీవనశైలి వల్ల శరీరం మెల్లమెల్లగా పనిచేయడానికి మొరాయిస్తుంది. దాంతో శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతుంటాయి. అప్పుడే సరిగ్గా ఈ రకం ప్యాచ్‌లు అవసరమవుతాయి. వీటిని వెదురు వెనిగర్ లేదా మూలికా పొడులతో తయారుచేస్తారు. కాళ్లు శుభ్రంగా కడుక్కొని, రాత్రిపూట వీటిని అరికాళ్లకు అతికించుకోవాలి. ఉదయానికల్లా వాటి రంగు నల్లగా మారిపోతుంది. అంటే శరీరంలోని మలినాలను ప్యాచ్ గ్రహించేసిందన్నమాట. ప్యాచ్‌ని తీసి కాళ్లు నీటితో కడుక్కుంటే సరి. ఆన్‌లైన్లో ఇప్పటికే ఈ తరహా ప్యాచ్‌లు పాపులర్ అయ్యాయి.
బరువు తగ్గేందుకు...
బరువు తగ్గేందుకు జిమ్‌లు, కార్డియోలు, డైటింగ్‌లు... పాత పద్ధతి అంటున్నారు. వాటి స్థానంలో ‘స్లిమ్మింగ్ ప్యాచ్’లు లేటెస్ట్ ట్రెండ్. వీటిలో ఉండే విటమిన్లు, సహజ పదార్థాలు ఒంట్లో ఉండే కొవ్వును క్రమంగా తగ్గిస్తాయట. ఈ ప్యాచ్‌లను చేతులు, తొడలు, నడుము, బొడ్డు భాగంలో అతికించుకుంటారు. వీటిల్లో చాలావరకు గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్, కెఫిన్, గార్సినియా కాంబోజియా వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి చర్మం ద్వారా రక్తంలో కలిసి, జీవక్రియను వేగవంతం చేయడంతో పాటు ఆకలిని నియంత్రిస్తాయని చెబుతున్నారు. కాకపోతే వీటి ద్వారా బరువు తగ్గుతున్నట్టు ఎటువంటి శాస్త్రీయ ఆధారాల్లేవని అంటున్నారు డైటీషియన్లు. అయినప్పటికీ మార్కెట్లో ఈ ప్యాచ్‌ల పట్ల యువతరం ఆసక్తిని ప్రదర్శిస్తోంది.
ఇవేగాక ప్రయాణంలో మెడనొప్పి, నడుం నొప్పి రాకుండా వేసుకునే ప్యాచ్‌లు, ఆయా విటమిన్లను అందించే ప్యాచ్‌లు... ఇలా ప్యాచ్‌ల లిస్ట్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇంజెక్షన్లకు, మాత్రలకు ప్రత్యామ్నాయంగా ఈ ప్యాచ్‌ల వాడుక రోజురోజుకూ పెరుగుతోంది. స్టయిల్ అనండి... స్మార్ట్ అనండి... యువతరం ఈ తరహా ప్యాచ్‌లతో ముందుకు సాగేందుకు ఉత్సాహం చూపుతోంది. మనదేశంలో మెడికల్ ప్యాచెస్ మార్కెట్ విలువ సుమారు 19 వేల కోట్ల రూపాయల వరకు ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే యేడాదికి ఈ మార్కెట్ 8.8 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. అంటే... నొప్పితో ఔచ్ అన్న ప్రతీసారి... ఇంజెక్షన్ కోసమో, ట్యాబ్లెట్ కోసమో, క్రీమ్ కోసమో కాకుండా ప్యాచ్ వైపు చూస్తున్నారన్నమాట.
సౌమ్య నాగపురి ఎన్ని ప్యాచ్‌లో...
పెయిన్ రిలీఫ్ ప్యాచ్
కూలింగ్ ప్యాచ్
హీట్ ప్యాచ్
మోషన్ సిక్‌నెస్ ప్యాచ్
హార్మోనల్ ప్యాచ్
యాక్నే ప్యాచ్
నికోటిన్ ప్యాచ్
యాంటీ ఏజింగ్ ప్యాచ్
హెల్త్ మానిటర్ ప్యాచ్
క్యాన్సర్ ప్యాచ్
డీటాక్స్ ప్యాచ్
స్లిమ్మింగ్ ప్యాచ్
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News