స్పెయిన్-ఫ్రాన్స్ సరిహద్దులో కార్చిచ్చు బీభత్సం.. 2.5 లక్షల మందికి పైగా తరలింపు..
ABN , Publish Date - Jul 26 , 2026 | 10:12 AM
స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలను భారీ కార్చిచ్చు చుట్టుముట్టింది. తీవ్ర ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో 2.5 లక్షల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలను భారీ కార్చిచ్చు చుట్టుముట్టింది. తీవ్ర ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, బలమైన గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో 2.5 లక్షల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది, సైనిక బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి (Spain wildfires).
ఫ్రాన్స్‌లోని బోర్డో నగర పరిసరాల్లో మంటలు అత్యంత తీవ్రంగా వ్యాపిస్తున్నాయి. గిరోండ్, లాండెస్ ప్రాంతాల నుంచి సుమారు 1.97 లక్షల మందిని ఖాళీ చేయించారు. మంటల తీవ్రత కారణంగా కొన్ని ప్రాంతాల్లో రవాణా సేవలను నిలిపివేశారు. ప్రజల కోసం తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంటలను అదుపు చేసేందుకు సైనిక విమానాలు, అగ్నిమాపక హెలికాప్టర్లను రంగంలోకి దింపారు (France wildfires).
స్పెయిన్‌లో మాడ్రిడ్‌కు పశ్చిమాన అడవిలో చెలరేగిన మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. సుమారు 70 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దట్టమైన పొగతో మాడ్రిడ్‌లో గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఈ కార్చిచ్చు వల్ల వాలెన్సియా ప్రాంతంలో ఒక వ్యక్తి మరణించినట్లు అధికారులు వెల్లడించారు (Europe wildfire).
వాతావరణ మార్పులు, తీవ్రమైన వేడి తరంగాలు, దీర్ఘకాలిక కరువు పరిస్థితులే ఈ కార్చిచ్చు తీవ్రతకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. గాలుల వేగం తగ్గితేనే మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. యూరప్‌లోని పలు దేశాలు అగ్నిమాపక విమానాలు, సిబ్బందిని పంపించి సహాయ చర్యల్లో భాగం అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
సీజేపీ రాజకీయ పార్టీగా మారుతుందా.. సమాధానం ఏంటంటే..