ఆఫీసులకు లుంగీలతో వస్తే ఎలా ఉంటుందో!: ప్రముఖ పారిశ్రామికవేత్త కామెంట్
ABN , Publish Date - Jul 26 , 2026 | 08:29 AM
ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్న వేళ ఆఫీసుల్లో సంప్రదాయ వస్త్రధారణకు అనుమతిస్తే ఎలా ఉంటుందో? అంటూ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా పెట్టిన పోస్టు ఆసక్తికర చర్చకు దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లో ఇటీవల కాలంలో వడగాలులు పెరిగాయి. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో అక్కడి ఆఫీసుల్లో ఉద్యోగులు షార్ట్‌లు ధరించి వచ్చేందుకు అనుమతులు కూడా వచ్చేశాయి. ఈ పరిణామంపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా పలు సరదా వ్యాఖ్యలు చేశారు.
ఈ అంశంపై లింక్డ్ ఇన్ వేదికగా ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. జపాన్ పని ప్రదేశాల్లో కాలానుగూణంగా పలు మార్పులు వచ్చాయని అన్నారు. టై విషయంలో మొదలైన మినహాయింపులు ప్రస్తుతం షార్టులను అనుమతించే వరకూ వచ్చాయన్నారు. అయితే, ఆఫీసుల్లో మగాళ్లు ఇలా షార్టులతో తిరుగుతుండటంతో కొందరు మహిళా ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని కూడా అన్నారు. ఈ సందర్భంగా భారత్ గురించి కూడా ప్రస్తావించారు. ఉష్ణమండల ప్రాంతమైన భారత్‌లో కూడా ఉద్యోగులకు సౌకర్యవంతమైన దుస్తులు ధరించేలా మినహాయింపులు ఇవ్వొచ్చా? అన్న సందేహం వెలిబుచ్చారు. లుంగీలు, ధోతీలు వంటి సంప్రదాయ వస్త్రధారణకు కార్యాలయాల్లోకి అనుమతిస్తే ఎలా ఉంటుందో! అని సరదా వ్యాఖ్యలు చేశారు.
ఈ పోస్టుకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ధోతీలతో సరిపెట్టకుండా జనాలు బ్యాట్‌మ్యాన్‌లు, సూపర్ మ్యాన్‌లలా డ్రెస్ చేసుకుని వస్తే ఎవరు రెస్పాన్సిబుల్ అని కొందరు సరదా కామెంట్ చేశారు. కొన్ని రకాల పరిశ్రమల్లో భద్రతా కారణాల రీత్యా ఎలాంటి మినహాయింపులకు ఛాన్స్ ఉండదని కొందరు అన్నారు. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగులు ఇప్పటికే మధ్యేమార్గాన్ని ఎంచుకున్నారని, అనేక సంస్థల్లో స్మార్ట్ క్యాజువల్ దుస్తులు ధరించేందుకు అనుమతి ఉందని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
నిద్రలో ఉండగా షర్టులోకి దూరిన కోబ్రా.. చివరికి..
బస్సులో తప్పుగా ప్రవర్తించిన యువకుడు.. అందరిముందు చితకబాదిన యువతి..