Share News

పార్కులో మినీ లైబ్రరీ

ABN , Publish Date - Oct 25 , 2026 | 01:37 PM

పార్కుకు వెళ్లినా ఫోన్‌ వదిలిపెట్టని వారు కనిపిస్తూనే ఉంటారు. అయితే అహ్మదాబాద్‌లోని పరిమళ్‌ పార్కులో అడుగుపెడితే మాత్రం... పుస్తకాలు చదువుతున్నవారు కనిపిస్తారు.

పార్కులో మినీ లైబ్రరీ
Free Park Libraries

పార్కుకు వెళ్లినా ఫోన్‌ వదిలిపెట్టని వారు కనిపిస్తూనే ఉంటారు. అయితే అహ్మదాబాద్‌లోని పరిమళ్‌ పార్కులో అడుగుపెడితే మాత్రం... పుస్తకాలు చదువుతున్నవారు కనిపిస్తారు. దానికి కారణం... ఇద్దరు యువకుల ఆలోచన.

హీత్‌ దోషి, ఓం ఠక్కర్‌... ఇద్దరు మిత్రులు. పార్కుల్లో మినీ లైబ్రరీలు ఏర్పాటు చేయడం ద్వారా సందర్శకులకు పుస్తక పఠనంపై మక్కువ పెరిగేలా చేస్తున్నారు. ఈ లైబ్రరీలకు మెంబర్‌షిప్‌ కార్డులుండవు. పుస్తకాల బాక్స్‌ను పర్యవేక్షించేవారు ఉండరు. ఎవరైనా నచ్చిన పుస్తకాన్ని తీసుకుని చదువుకోవచ్చు. ఒకవేళ ఆ పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే మరో పుస్తకాన్ని ఆ బాక్స్‌లో పెట్టాల్సి ఉంటుంది. ఈ ఉచిత పార్క్‌ లైబ్రరీలు అందరి మన్ననలు అందుకుంటున్నాయి. ‘‘పార్కుల్లో కుటుంబంతో గడపడం, ప్రశాంతంగా కూర్చోవడం, విశ్రాంతి తీసుకోవడం చేస్తుంటారు. అందుకే చదవడం అనే అలవాటు ఈ వాతావరణానికి చక్కగా సరిపోతుందని మేము భావించాం’’ అంటారు హీత్‌.


xx.jpgఆలోచన వెనక...

అహ్మదాబాద్‌లోని పరిమళ్‌ గార్డెన్‌లో సాయంకాలం వాకింగ్‌ కోసం వస్తారు. పిల్లలు ఆడుకోవడానికి వస్తుంటారు. వృద్ధులు బెంచీలపై కూర్చుని సేదతీరుతుంటారు. అలాంటి పార్కులో ఒక చోట చిన్న పుస్తకాల బాక్స్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ బాక్స్‌ దగ్గర ఒక చిన్నారి కామిక్‌ పుస్తకాన్ని తీసుకోవడానికి ఆగుతాడు. ఒక వృద్ధుడు నవల తీసుకుని తిరగేస్తుంటాడు. ఇదంతా మినీ లైబ్రరీలు తెచ్చిన మార్పు. హీత్‌ దోషి, ఓం ఠక్కర్‌లకు కాలేజీలో చదువుతున్నప్పుడే ఈ ఆలోచన వచ్చింది. వాళ్లిద్దరూ 2023లో అహ్మదాబాద్‌లో ’యువర్‌ రీడింగ్‌ సర్కిల్‌‘ను ప్రారంభించారు. పుస్తకాలు ఇష్టపడేవారికి ఒక వేదికను కల్పించడమే దీని లక్ష్యం. ఆ సమయంలో వారికి పెద్దగా ప్రణాళికలేమీ లేవు. తమ చుట్టూ పఠన సంస్కృతిని పెంపొందించాలనేదే వారి లక్ష్యం. ఒకసారి కేరళలోని పెరుంకుళం గ్రామం గురించి సోషల్‌ మీడియా రీల్‌ ఒకటి వారి కంట పడింది. అక్కడ ప్రతీ కిలోమీటర్‌కు ఒక లైబ్రరీ ఉందనేది దాని సారాంశం. ‘‘ఆ ఆలోచన చాలా కాలం మా మనసుల్లో నిలిచిపోయింది. అహ్మదాబాద్‌లో ఎందుకు ప్రయత్నించకూడదని అనుకున్నాం. పబ్లిక్‌ పార్కుల్లో ఉచిత మినీ లైబ్రరీలను ఏర్పాటు చేశాం’’ అన్నారు హీత్‌.


book10.3.jpgరెండేళ్ల క్రితం పరిమళ్‌ గార్డెన్‌లో ఒక లైబ్రరీతో మొదలైన వారి ప్రయాణం... ఇప్పుడు అహ్మదాబాద్‌, వడోదర నగరాలతో కలిపి 13 లైబ్రరీలకు చేరుకుంది. మరో మూడు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు వారు ’విరక్త్‌ ఫౌండేషన్‌‘ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నమోదు చేశారు. క్రమక్రమంగా ఈ లైబ్రరీలు కేవలం పుస్తకాలు తీసుకునే ప్రదేశాలుగానే కాకుండా, కలిసి చదవడానికి, పుస్తకాల గురించి మాట్లాడుకోవడానికి ఉపయోగపడే వేదికలుగా మారుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

శీతాకాలం... సరస్సు ఖాళీ!

డప్పుల దరువులో ఒక అడవి కథ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 01:37 PM