అద్దె చెల్లించడానికి నకిలీ నోట్లు ముద్రించాడు..! రూ.37 లక్షల స్వాధీనం
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:57 AM
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ కిరాయిదారుడు ఏకంగా రూ.37 లక్షల విలువైన నకిలీ నోట్లు ముద్రించాడు. రూ.500 నోట్ల రూపంలో వాటిని ముద్రించాడు. ఇంటి ఓనర్‌కు అద్దె చెల్లించడానికి వాటిని ప్రింట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటి ఓనర్ అనుకోకుండా ఒకరోజు ఆ గది తలుపు బద్దలుకొట్టి చూడగా నకిలీ కరెన్సీ ముద్రణ బండారం బయటపడింది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ కిరాయిదారుడు ఏకంగా రూ.37 లక్షల విలువైన నకిలీ నోట్లు ముద్రించాడు. రూ.500 నోట్ల రూపంలో వాటిని ముద్రించాడు. ఇంటి ఓనర్‌కు అద్దె చెల్లించడానికి వాటిని ప్రింట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంటి ఓనర్ అనుకోకుండా ఒకరోజు ఆ గది తలుపు బద్దలుకొట్టి చూడగా నకిలీ కరెన్సీ ముద్రణ బండారం బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పుష్పక్ కృష్ణ భండార్కర్ అనే వ్యక్తి.. నాగ్‌పూర్‌లోని త్రిమూర్తి నగర్‌లో ఓ గదిలో అద్దెకు ఉండేవాడు. ఈ ఏడాది జనవరిలో అతని రెంటల్ అగ్రిమెంట్ ముగిసింది. అయినా కూడా అతను ఆ గదిని ఖాళీ చేయలేదు. అంతేకాకుండా అప్పటి నుంచి అద్దె కట్టలేదు. దీంతో గది ఖాళీ చేయాలని పుష్పక్‌ను యజమాని రమేష్ అడగగా.. అతను కత్తితో బెదిరించాడు. తర్వాత గది వదిలిపోయాడు.
కొన్ని నెలలపాటు అతను రాకపోయేసరికి యజమాని ఈనెల 24న ఆ గది తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా దిగ్ర్భాంతికి గురయ్యాడు. ఆ గదిలో ఒక బకెట్లో దాచి ఉంచిన నకిలీ నోట్ల కట్టలు, గదిలో చెల్లాచెదురుగా పడిఉన్న పేపర్ షీట్లు, ప్రింటర్ కనిపించాయి. దీంతో యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకుని నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నోట్లను లెక్కించడానికి కౌంటింగ్ మెషీన్ కూడా తెప్పించారు. వాటిని లెక్కించగా మొత్తం రూ.37 లక్షలుగా తేలింది. అన్ని రూ.500 డినామినేషన్లలోనే ఉన్నాయి. నకిలీ కరెన్సీతో పాట ప్రింటర్, ఇతర మెటీరియల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ రూ.48 లక్షలని తెలిపారు. నిందితుడు పుష్పక్ ఇంకా పరారీలోనే ఉన్నాడని, అతడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. అతను ముంబైలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో ముంబైకి ఒక బృందాన్ని తరలించారు.
ఈ వార్తలూ చదవండి
అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..
గ్రీకు రెస్టారెంట్‌లో తొలి పరిచయం.. రాజీవ్ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..