పార్కింగ్ స్థలం కోసం హత్య.. స్నేహితులే చంపేశారు..
ABN , Publish Date - Oct 24 , 2026 | 07:02 PM
పార్కింగ్ కోసం మొదలైన వివాదం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి జరిగిందీ ఘటన.
ఇంటర్నెట్ డెస్క్: పార్కింగ్ కోసం మొదలైన వివాదం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి జరిగిందీ ఘటన. అయితే ఆ వ్యక్తిని తన స్నేహితులే చంపినట్టు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్‌సర్‌లోని ఆనంద్ అవెన్యూలో అమిత్ సబర్వాల్ అనే వ్యక్తి నివాసముంటున్నారు. ఆయన స్నేహితులు అభీ షా, సన్నీ షా, రితిక్ షా (ముగ్గురూ అన్నదమ్ములు) కూడా అక్కడే నివసిస్తున్నారు. శుక్రవారం నైట్ పార్టీ నుంచి ఇంటికి వచ్చిన అమిత్.. తన పార్కింగ్ స్థలంలో స్నేహితులు స్కూటర్‌ను పార్క్ చేయడం చూశారు. దీంతో స్థలాన్ని ఖాళీ చేసి, తన వాహనానికి చోటు ఇవ్వాలని ఆయన అడిగారు. ఇందుకు స్నేహితులు నిరాకరించారు. ఇలా వీరి మధ్య గొడవ మొదలై.. మాటామాటా పెరిగింది. ఒక్కసారిగా క్షణికావేశానికి గురైన అభి షా దేశి తుపాకీతో అమిత్‌పై కాల్పులు జరిపారు.
ఈ దాడిలో అమిత్ సబర్వాల్ తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల శబ్దాలు విన్న ఆయన కుటుంబ సభ్యులు ఎవరో టపాసులు పేలుస్తున్నారనుకున్నారు. కానీ బయటకొచ్చి చూస్తే.. అమిత్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సీసీటీవీ పరిశీలించి, నిందితులు అభీ షా, సన్నీ షా, రితిక్ షాలను అదుపులోకి తీసుకున్నారు. అమిత్‌పై ఆరు రౌండ్లు ఫైర్ చేసినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
ఈ వార్తలూ చదవండి
ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
సరదా కోసం వందే భారత్ రైలుపై రాళ్లు విసిరారు.. చివరకు