Share News

ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

ABN , Publish Date - Oct 24 , 2026 | 04:56 PM

ఢిల్లీలోని కృష్ణానగర్ ప్రభుత్వ పాఠశాలలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని పాఠశాల ఆవరణలో ఒంటిపై నిప్పు పెట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాలు కోల్పోయింది.

ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
Delhi School Student Suicide Attempt

ఢిల్లీ, అక్టోబర్ 24: ఢిల్లీలోని షాదరా జిల్లా కృష్ణానగర్‌లోని ప్రభుత్వ సర్వోదయ కన్యా విద్యాలయంలో పన్నెండో తరగతి చదువుతున్న పదిహేడేళ్ల విద్యార్థిని ఇవాళ (శనివారం) పాఠశాల ఆవరణలోనే ఒంటికి నిప్పు పెట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది.

బాలికను తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఘటనా స్థలంలో లభించిన మూడు పేజీల లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అంతకుముందు, పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగిందంటూ పీసీఆర్ (PCR) కాల్ రాగానే కృష్ణానగర్ పోలీసు స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పాఠశాల సెక్యూరిటీ గార్డు గది వెనుక సగం కాలిన స్థితిలో ఉన్న విద్యార్థినిని పోలీసులు గుర్తించారు.

ఘటనా స్థలంలో పరిశీలించగా విద్యార్థిని రాసిన మూడు పేజీల లేఖ (సూసైడ్ నోట్) పోలీసులకు లభించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం సదరు విద్యార్థిని తన పాఠశాల బ్యాగ్‌లో పెట్రోల్ వంటి రసాయన ద్రవంతో కూడిన సీసాని పాఠశాలకు తెచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించేందుకు క్రైమ్ సీన్ టీమ్‌ను రంగంలోకి దించారు. ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.

డీసీపీ (DCP) వెల్లడించిన వివరాల ప్రకారం, సదరు విద్యార్థిని వయస్సు పదిహేడేళ్లని కుటుంబ సభ్యులు తెలిపారని, విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి, ఘటనకు గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. లభించిన లేఖలోని విషయాలు, ఇతర ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని తెలిపారు. (Delhi School Student Suicide Attempt)


ఈ వార్తలూ చదవండి

అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..

గ్రీకు రెస్టారెంట్‌లో తొలి పరిచయం.. రాజీవ్‌ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..

Updated Date - Oct 24 , 2026 | 05:24 PM