Share News

ఆశీస్సులు అందించండి స్వామి.. చిన్మయానంద ఏఐ అవతార్‌తో మోదీ సంభాషణ

ABN , Publish Date - Oct 25 , 2026 | 09:37 AM

చిన్మయ మిషన్ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘చిన్మయ అమృత్ మహోత్సవ్ ప్రపంచ సమ్మేళనం’ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా దివంగత ఆధ్యాత్మిక గురువు స్వామి చిన్మయానంద హోలోగ్రాఫిక్ అవతారంతో మోదీ సంభాషించారు.

ఆశీస్సులు అందించండి స్వామి.. చిన్మయానంద ఏఐ అవతార్‌తో మోదీ సంభాషణ

ఇంటర్నెట్ డెస్క్: చిన్మయ మిషన్ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘చిన్మయ అమృత్ మహోత్సవ్ ప్రపంచ సమ్మేళనం’ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా దివంగత ఆధ్యాత్మిక గురువు స్వామి చిన్మయానంద హోలోగ్రాఫిక్ అవతారంతో మోదీ సంభాషించారు. 1993లో స్వామీజీని ప్రత్యక్షంగా కలిసిన సందర్భాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు. తాను చేపట్టబోయే కార్యక్రమాలకు ఆశీస్సులు అందించాలని కోరారు. ‘మిమ్మల్ని కలవడం నా అదృష్టం. ఇప్పుడు నేను చేయాలనుకుంటున్న పనులకు మీ ఆశీస్సులు కావాలి’ అని మోదీ పేర్కొన్నారు. దీనికి స్వామి చిన్మయానంద హోలోగ్రాఫిక్ రూపం స్పందిస్తూ.. మోదీ ప్రధానమంత్రి కావడంపై సంతోషం వ్యక్తం చేసింది. ‘నరేంద్రా.. భారత్‌ నీకు తోడుగా ఉంది’ అని పేర్కొంది. ఈ అనుభవాన్ని ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిగా మోదీ అభివర్ణించారు. సాధువుల ఆశీస్సులు తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. చిన్మయ మిషన్‌ ఒక సంస్థ మాత్రమే కాదని, అది ‘చిన్మయ విచార్‌’ కు ప్రతిరూపమని పేర్కొన్నారు.


33 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లనిపించింది

చిన్మయ అనే పదం అమరత్వానికి ప్రతీక అని నరేంద్ర మోదీ అన్నారు. చిన్మయ అమృత మహోత్సవ్‌ నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో స్వామి చిన్మయానంద దివ్య సాన్నిధ్యాన్ని మరోసారి అనుభూతి చెందానని పేర్కొన్నారు. ‘హోలోగ్రామ్‌లో చిన్మయ స్వామీజీని చూసినప్పుడు 33 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లు అనిపించింది. ఇది నాకు ఎంతో భావోద్వేగంతో కూడినది. 1993 ఫిబ్రవరి లేదా మార్చి నెలలో స్వామి చిన్మయానందను తొలిసారి కలిశాను. అమెరికాలోని చికాగోలో ప్రపంచ మతాల పార్లమెంట్‌ శతాబ్ది ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించేందుకు ఆయనను కలిశాను. నా అభ్యర్థనను స్వామీజీ అంగీకరించారు. అయితే కార్యక్రమానికి కొన్ని వారాల ముందే 1993 ఆగస్టు 3న ఆయన ఈ లోకాన్ని వీడివెళ్లారు’ అని మోదీ తెలిపారు. అదే ఏడాది సెప్టెంబర్‌ 11న చికాగోలో జరిగిన కార్యక్రమానికి తాను హాజరయ్యానని, ఆ సమయంలో స్వామీజీ లేని లోటు స్పష్టంగా కనిపించిందని మోదీ పేర్కొన్నారు.


9 వేల మందికి పైగా ప్రతినిధుల హాజరు

ఈనెల 23 నుంచి 25 వరకు మూడు రోజులపాటు భారత్‌ మండపంలో జరుగుతున్న చిన్మయ అమృత్ అంతర్జాతీయ సమ్మేళనానికి దేశ విదేశాల నుంచి 9,000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేశారు. చిన్మయ మిషన్‌ స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాదిపాటు నిర్వహించిన వేడుకలను ఈ సమ్మేళనంతో ముగించనన్నారు. కాగా.. స్వామి చిన్మయానంద 1951లో చిన్మయ మిషన్‌ను స్థాపించారు. వేదాంతం, భగవద్గీత బోధనలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ సంస్థ.. ఆధ్యాత్మిక విద్య, భారతీయ సంస్కృతి పరిరక్షణ, యువత సాధికారత, సామాజిక సేవ వంటి రంగాల్లో పనిచేసింది. ఈ వేడుకల్లో భాగంగా గత ఏడాది తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ.. చిన్మయ మిషన్‌ రూపొందించిన భగవద్గీత తమిళ పద్యం అనువాదాన్ని ఆవిష్కరించారు. దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం సమకూర్చారు.


ఈ వార్తలు కూడా చదవండి ..

పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా

ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష

Updated Date - Oct 25 , 2026 | 10:51 AM