పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా
ABN , Publish Date - Oct 24 , 2026 | 08:55 PM
నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా శనివారం తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలను పాకిస్థాన్ రక్షిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తావిస్తూ, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మౌనం వహించేలా పొరుగు దేశమైన పాకిస్థాన్ ఒత్తిడి తెస్తోందని ఆయన అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా శనివారం తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలను పాకిస్థాన్ రక్షిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తావిస్తూ, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మౌనం వహించేలా పొరుగు దేశమైన పాకిస్థాన్ ఒత్తిడి తెస్తోందని ఆయన అన్నారు. శనివారం బారాముల్లాలో నిర్వహించిన ఎన్సీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిష్కారంకాని కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై సజీవంగా ఉంచుతూ జమ్మూకశ్మీర్ ప్రజలకు పాకిస్థాన్ రక్షణగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశించడానికి ఏమైనా కారణం ఉందా అని ప్రశ్నించారు. ప్రజలు పోరాడకపోతే అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
‘ధైర్యంగా ఉండండి. మనం వారిని (కేంద్ర ప్రభుత్వం) ఎదుర్కొందాం. మీరు ధైర్యం కూడగట్టుకోకపోతే అంతరించిపోతారు. అప్పుడు వారు మీ పేరు, మీ గుర్తింపును పూర్తిగా చెరిపేస్తారు’ అని ఫరూక్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వం మౌనంగా ఉండడానికి గల కారణాలను వివరించారు. అదే సమయంలో పాకిస్థాన్ అంతర్జాతీయ స్థాయిలో తెస్తున్న ఒత్తిడిని ఆయన ప్రస్తావించారు. ‘మన పొరుగు దేశం (పాకిస్థాన్) వారిపై ఒత్తిడి కొనసాగిస్తున్నందునే వారు (కేంద్రం) ప్రస్తుతం మౌనంగా ఉన్నారు. పాకిస్థాన్ ఎక్కడికి వెళ్లినా కశ్మీర్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని చెబుతోంది. అదే మనల్ని కాపాడుతోంది’ అని ఫరూక్ పేర్కొన్నారు.
ఫరూక్ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం
ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీనేతలు శనివారం తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్.. కశ్మీర్ సమస్యను ప్రస్తావించడం వల్లే కశ్మీరీలకు రక్షణ లభిస్తోందని ఫరూక్ పేర్కొనడాన్ని జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు సత్ శర్మ తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యలకు ఫరూక్ అబ్దుల్లా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే జమ్మూకశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను సమర్థించారు. కశ్మీర్లో భద్రత, స్థిరత్వం నెలకొనడానికి అక్కడి ప్రజలు, భారత ప్రభుత్వం చేస్తున్న కృషే కారణమని పేర్కొన్నారు.
ఈ వార్తలూ చదవండి
ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
సరదా కోసం వందే భారత్ రైలుపై రాళ్లు విసిరారు.. చివరకు