డప్పుల దరువులో ఒక అడవి కథ
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:03 AM
అడవి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ డప్పు మోగుతుంది. నెమలి ఈకల తలపాగాలు ఊగుతాయి. గజ్జెల సవ్వడికి అడుగులు లయ కలుపుతాయి.
అడవి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ డప్పు మోగుతుంది. నెమలి ఈకల తలపాగాలు ఊగుతాయి. గజ్జెల సవ్వడికి అడుగులు లయ కలుపుతాయి. గోండు గూడాల్లో పండగ కళ ఉట్టిపడుతుంది. అది కేవలం నృత్యం కాదు.. తరతరాలుగా వస్తున్న ఓ సాంస్కృతిక సాక్ష్యం. ప్రకృతితో మమేకమైన ఆదివాసీ జీవనాన్ని, వారి విశ్వాసాలను, బంధుత్వాలను తనలో ఇముడ్చుకున్న సంప్రదాయం. దండారి వేడుకల్లో గుస్సాడీల అడుగులు పడినప్పుడల్లా అడవి బిడ్డల చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. నెమలి ఈకల వెనుక తరతరాల జ్ఞాపకం.. డప్పు దరువులో ఓ సమాజపు జీవన లయ.. కనిపిస్తాయి.
గోండు ఆదివాసీలకు గుస్సాడి ఒక నృత్యం మాత్రమే కాదు. అది వారి సామూహిక జీవనంలో భాగం. ముఖ్యంగా దండారి పండగ సమయంలో గుస్సాడి బృందాల సందడి కనిపిస్తుంది. దసరా తర్వాత ప్రారంభమయ్యే ఈ వేడుకలు దీపావళి వరకు కొనసాగుతాయి.
ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బృందాలు వెళ్తాయి. స్థానికులు వీరికి ఆతిథ్యం ఇస్తారు. పాటలు, వాద్యాలు, నృత్యాలతో వేడుక సాగుతుంది. బంధుత్వాలను పటిష్ఠం చేసుకోవడం, పరస్పరం పలకరించుకోవడం, సామాజిక సంబంధాలను కొనసాగించడం వంటి అంశాలకు ఈ పండగ వేదికగా మారుతుంది.
తలపాగానే ప్రత్యేక ఆకర్షణ
గుస్సాడి కళాకారుడి వేషధారణలో అన్నింటికన్నా ప్రత్యేకంగా కనిపించేది నెమలి ఈకల తలపాగా. పెద్ద పరిమాణంలో ఉండే ఈ తలపాగాను ఎంతో శ్రద్ధగా తయారు చేస్తారు. నెమలి ఈకలను అందంగా అమర్చి రూపొందించే ఈ అలంకరణ గుస్సాడి కళాకారుడికి ప్రత్యేక రూపాన్ని ఇస్తుంది.
తలపాగా ధరించిన కళాకారులు బృందంగా కదులుతూ... డప్పులు, ఇతర సంప్రదాయ వాద్యాల లయకు అనుగుణంగా నృత్యం చేస్తారు. వారి అడుగుల్లో వేగం కన్నా లయకు ప్రాధాన్యం కనిపిస్తుంది. ఒక్కో కదలికలోనూ తరతరాలుగా వస్తున్న శిక్షణ ప్రతిబింబిస్తుంది.

దేవతలకు మొక్కి వేషధారణ...
గుస్సాడి ప్రదర్శన వెనుక ఆధ్యాత్మిక విశ్వాసాలూ ఉన్నాయి. గోండు సమాజంలో పూజలు, సంప్రదాయ ఆచారాలకు ప్రత్యేక స్థానం ఉంది. పండగ ప్రారంభంలో గిరిజనులు తమ కులదేవతలు, గ్రామదేవతలైన పద్మల్పురి కాకో, ఏత్మసూర్ పెన్లకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో గోదావరి తీరంలోని గుడిరేవు పద్మల్పురి కాకో ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించు కుంటారు. గుస్సాడి కళాకారులు ధరించే నెమలీకల కిరీటాలు (మల్ బూరా), ముఖానికి వేసుకునే ముసుగులు, కర్రలు, ఇతర అలంకరణ వస్తువులతోపాటు... డప్పు, డోలు, తుడుం, గుమేలా వంటి సంప్రదాయ వాద్యాలకు పూజలు చేసిన అనంతరమే నృత్యాలకు శ్రీకారం చుడతారు. ఈ వేడుకల్లో గిరిజన పెద్దలు, పూజారులు కీలక పాత్ర పోషిస్తారు. గుస్సాడి వేషధారణను
పవిత్రంగా భావించే కళాకారులు పండగ కాలంలో ప్రత్యేక నియమాలు పాటిస్తారు. కొన్ని ప్రాంతాల్లో గుస్సాడి కళాకారులను శివుని స్వరూపంగా భావించి గౌరవిస్తారు. ఇక వేడుకల ముగింపు దశలో కోలాబోడి పేరుతో ప్రత్యేక ఆచారాలు నిర్వహించి, దేవతలకు బియ్యం సమర్పించడం వంటి సంప్రదాయాలను పాటిస్తారు. వారి పాటల్లో ప్రకృతి ప్రస్తావనలు.. నృత్యంలో సామూహికత.. వేషధారణలో స్థానిక వనరుల ప్రభావం.. ఇలా గుస్సాడి మొత్తం గోండు జీవన ప్రపంచానికి అద్దంలా కనిపిస్తుంది. అందుకే ఈ కళను కేవలం ‘జానపద నృత్యం’గా చూడటం సరిపోదు. అది ఒక సమాజపు జ్ఞాపకాల భాండాగారం. పెద్దల నుంచి పిల్లలకు అందే సాంస్కృతిక వారసత్వం.
మరుగున పడుతున్న వేళ...
కాలం మారింది. జీవన విధానాలు మారాయి. ఆధునిక వినోదం పెరిగింది. యువతలో సంప్రదాయ కళలపై ఆసక్తి తగ్గింది. దీంతో ఒక దశలో గుస్సాడి కళ కూడా మరుగునపడే పరిస్థితి ఎదుర్కొంది. అయితే కొందరు కళాకారులు, గోండు పెద్దలు ఈ సంప్రదాయాన్ని కాపాడేందుకు ముందుకొచ్చారు.
గుస్సాడి కళకు విస్తృత గుర్తింపు తీసుకురావడంలో కనకరాజు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. మార్లవాయి ప్రాంతానికి చెందిన ఆయన చిన్నతనం నుంచే గుస్సాడి నేర్చుకున్నారు. కుటుంబ పెద్దల వద్ద శిక్షణ పొందిన ఆయన తర్వాతి తరాలకు ఈ కళను నేర్పడంలో జీవితాన్ని అంకితం చేశారు. వందలాది మందికి శిక్షణ ఇచ్చి గుస్సాడిని విస్తృతంగా ప్రచారం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో గణతంత్ర వేడుకల సందర్భంగా గుస్సాడి ప్రదర్శనకు నాయకత్వం వహించడం ఆయన జీవితంలో కీలక ఘట్టంగా నిలిచింది. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం కనకరాజుకు 2021లో పద్మశ్రీ పురస్కారం అందించింది. ఒక గిరిజన కళాకారుడి వ్యక్తిగత విజయంగా
మాత్రమే కాకుండా... గుస్సాడి అనే సంప్రదాయ కళకు దక్కిన జాతీయ గౌరవంగా దీనిని గోండు సమాజం భావించింది. కనకరాజు 2024లో కన్నుమూసినా.. ఆయన కాపాడిన కళ మాత్రం ఆయన శిష్యుల అడుగుల్లో కొనసాగుతోంది.
రేపటి తరానికి చేరాలంటే...
ఒకప్పుడు గ్రామాల్లో పండగ వచ్చిందంటే గుస్సాడి బృందాల కోసం ఎదురుచూసేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కొత్త తరంపై ఉంది. గుస్సాడి కళాకారులకు ఆర్థిక ప్రోత్సాహం.. యువతకు శిక్షణ.. పాఠశాలలు, కళాశాలల్లో ఆదివాసీ కళలపై అవగాహన.. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలకు అవకాశాలు.. ఇవన్నీ పెరిగితే ఈ కళ మరింత బలపడుతుంది.
ఆకం శివసాయి, నిజామాబాద్, 83281 93522