Share News

సద్దాం హుస్సేన్‌ చీజ్‌కేక్ ఫ్యాక్టరీలా వైట్‌హౌస్‌ పునరుద్ధరణ.. ట్రంప్‌‌పై ఒబామా విమర్శలు

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:37 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌ చేపడుతున్న పునరుద్ధరణ పనులపై సెటైర్లు వేశారు. వైట్‌హౌస్‌ను చూస్తుంటే, ఇరాక్‌ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ చీజ్‌కేక్ ఫ్యాక్టరీ ప్రారంభించినట్లు ఉందని ఒబామా వ్యాఖ్యానించారు.

సద్దాం హుస్సేన్‌ చీజ్‌కేక్ ఫ్యాక్టరీలా వైట్‌హౌస్‌ పునరుద్ధరణ.. ట్రంప్‌‌పై ఒబామా విమర్శలు

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌ చేపడుతున్న పునరుద్ధరణ పనులపై సెటైర్లు వేశారు. వైట్‌హౌస్‌ను చూస్తుంటే, ఇరాక్‌ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ చీజ్‌కేక్ ఫ్యాక్టరీ ప్రారంభించినట్లు ఉందని ఒబామా వ్యాఖ్యానించారు. ఓహియోలో జరిగిన మధ్యంతర ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైట్‌హౌస్‌లో జరుగుతున్న మార్పులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ట్రంప్‌ రాజకీయాల కన్నా మరమ్మతులు, నిర్మాణాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఆయన హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ టెలివిజన్‌ కార్యక్రమాల్లో కనిపిస్తే బాగుంటుందని చురక అంటించారు. ‘వైట్‌హౌస్‌ కన్నా పెద్దదైన బాల్‌రూమ్‌ నిర్మిస్తున్నారు. రోజ్‌ గార్డెన్‌లో మార్పులు, సౌత్‌ లాన్‌లో హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ ప్యాడ్‌ ఏర్పాటు చేస్తున్నారు. వైట్ హౌస్ అంతటా బంగారు రంగు అలంకరణలే కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే సద్దాం హుస్సేన్‌ చీజ్‌కేక్ ఫ్యాక్టరీని ప్రారంభించినట్లుంది. ఎక్కడ చూసినా బంగారమే’ అని ఒబామా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ కార్యక్రమంలో ఉన్న వారందరూ పగలబడి నవ్వారు.


ఓహియోలో డెమోక్రటిక్‌ అభ్యర్థులకు మద్దతు

ఓహియోలో జరిగిన ప్రచార కార్యక్రమం అనంతరం ‘ఎక్స్‌’లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థులకు ఒబామా మద్దతు ప్రకటించారు. గవర్నర్‌ పదవికి అమీ ఆక్టన్‌, అమెరికా సెనేట్‌ ఎన్నికల్లో షెరాడ్‌ బ్రౌన్‌ను గెలిపించాలని ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. ఓహియో ప్రజల తరఫున పోరాడడానికి ఆ అభ్యర్థులు తమ జీవితాలను అంకితం చేశారని పేర్కొన్నారు. ఒటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనాలని, అన్ని స్థాయిల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థులకు మద్దతు ఇస్తే, దేశాన్ని మెరుగైన దిశగా నడిపించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.


రక్షణ మంత్రిపైనా విమర్శలు

అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హేగ్‌సెత్‌పైనా ఒబామా విమర్శలు గుప్పించారు. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా సైనికులు గాయపడుతున్నారని, క్షిపణి నిల్వలు తగ్గిపోయాయని అన్నారు. హోర్ముజ్‌ జలసంధిపై ఇరాన్‌‌కు ఇప్పుడు వీటో అధికారం ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సమయంలో రక్షణ మంత్రి మాత్రం సైనికుల ఫిజిక్, టెస్టోస్టెరాన్‌ స్థాయుల వంటి అంశాలపై దృష్టి పెడుతున్నారని ఒబామా మండిపడ్డారు.


ఈ వార్తలూ చదవండి

అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..

గ్రీకు రెస్టారెంట్‌లో తొలి పరిచయం.. రాజీవ్‌ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..

Updated Date - Oct 25 , 2026 | 01:19 PM