Share News

అణ్వాయుధాల అభివృద్ధిని శాశ్వతంగా నిలిపివేయాలి.. ఇరాన్‌‌కు ట్రంప్ వార్నింగ్

ABN , Publish Date - Oct 25 , 2026 | 08:23 AM

ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులకు దిగే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అవసరమైతే ఆదివారమే తాము దాడులు చేపట్టవచ్చని, లేదా ఇరాన్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.

అణ్వాయుధాల అభివృద్ధిని శాశ్వతంగా నిలిపివేయాలి.. ఇరాన్‌‌కు ట్రంప్ వార్నింగ్

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులకు దిగే అవకాశం ఉందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అవసరమైతే ఆదివారమే తాము దాడులు చేపట్టవచ్చని, లేదా ఇరాన్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఇరాన్‌ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకుండా శాశ్వతంగా నిరోధించే హామీ ఆ ఒప్పందంలో ఉండాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై దాడి చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘దాడి చేసే అవకాశం ఉంది. అదే సమయంలో ఒప్పందం కుదిరే అవకాశమూ ఉంది. నేను ఏం చేయబోతున్నానో మీకు చెబుతానని అనుకుంటున్నారా?’ అని ట్రంప్‌ బదులిచ్చారు.


ఇరాన్‌ నాయకత్వం ఒప్పందానికి ఆసక్తి చూపుతోందని, అయితే ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటుందా అన్నదే అసలు ప్రశ్న అని ట్రంప్ పేర్కొన్నారు. 2025లో అమెరికా బీ2 బాంబర్లతో ఇరాన్‌పై దాడులు చేసిన అనంతరం సైనిక చర్యలను నిలిపివేసి ఉంటే, ఆ దేశం తిరిగి అణు సామర్థ్యాలను పెంపొందించుకుని అణ్వాయుధాన్ని తయారు చేసుకునే అవకాశం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అణు ముప్పును శాశ్వతంగా తొలగించడమే తన లక్ష్యమని తెలిపారు. సైనిక చర్యను కొనసాగించాలా లేక ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలా అన్నది ఆ దేశ నాయకత్వంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు.


దాడులకు సైనిక ప్రణాళికలు సిద్ధం

ఇరాన్‌పై తదుపరి దాడులకు సంబంధించి అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (సెంట్కామ్) పలు ప్రణాళికలను సిద్ధం చేసిందని ది హిల్‌ కథనం వెల్లడించింది. వైట్‌హౌస్‌ నుంచి అనుమతి లభిస్తే వాటిని అమలు చేసేందుకు సన్నద్ధంగా ఉందని ఓ అధికారి తెలిపినట్లు పేర్కొంది. ఆ ప్రణాళికలను రక్షణ మంత్రి పీట్‌ హేగ్‌సెత్‌కు సమర్పించేందుకు సెంట్కామ్‌ సిద్ధంగా ఉన్నట్లు మరో అధికారి వెల్లడించారు. అయితే, తుది నిర్ణయం తీసుకునే సమయం వచ్చే వరకు అన్ని అవకాశాలనూ పరిశీలించాలని ట్రంప్‌ భావిస్తున్నట్లు సమాచారం. నవంబర్‌ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల అనంతరం ఇరాన్‌పై అమెరికా మళ్లీ సైనిక చర్యలకు దిగే అవకాశం ఉందని యూరేషియా గ్రూప్‌కు చెందిన ఇరాన్‌ వ్యవహారాల నిపుణుడు గ్రెగరీ బ్రూ అభిప్రాయపడ్డారు. ఎన్నికల తర్వాత దాడులు పునఃప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన ‘ది హిల్‌’ తో అన్నారు. కాగా.. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్‌ రెండింటిలోనూ తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో నవంబర్‌లో మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై దాడులు చేసే అవకాశాన్ని ట్రంప్‌ గతంలోనూ ప్రస్తావించారు.


ఈ వార్తలూ చదవండి

అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..

గ్రీకు రెస్టారెంట్‌లో తొలి పరిచయం.. రాజీవ్‌ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..

Updated Date - Oct 25 , 2026 | 09:28 AM