ఇండియా, పాక్ యుద్ధాన్ని ఆపాను.. ఎన్నికల ప్రచారంలో ట్రంప్
ABN , Publish Date - Oct 25 , 2026 | 10:42 AM
ఆపరేషన్ సింధూర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. నిరుడు భారత్, పాకిస్థాన్ మధ్య చోటుచేసుకున్న నాలుగు రోజుల మిలిటరీ ఘర్షణను తానే ఆపానని ట్రంప్ మరోసారి అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్ సింధూర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. నిరుడు భారత్, పాకిస్థాన్ మధ్య చోటుచేసుకున్న నాలుగు రోజుల మిలిటరీ ఘర్షణను తానే ఆపానని ట్రంప్ మరోసారి అన్నారు. ఇరు దేశాలు యుద్ధం కొనసాగిస్తే, అమెరికాతో వాణిజ్యం చేయలేరని, అంతేకాకుండా 250 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించానని చెప్పారు. శుక్రవారం ఫ్లోరిడాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘రెండు అణు దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య ఘర్షణను నేను ఆపాను. మీరు పోరాటాన్ని కొనసాగిస్తే అమెరికాతో వ్యాపారం చేయలేరని, రెండు దేశాలపైనా 250 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించాను. దీంతో ఆ దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. దాంతో యుద్ధం ముగిసింది’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఘర్షణలో 11 విమానాలు కూలిపోయాయని ఆయన తెలిపారు. తాను చాలా యుద్ధాలను ఆపానని, ఈ విషయంలో తనకు ఐక్యరాజ్యసమితి నుంచి ఎలాంటి సహాయం రాలేదని ట్రంప్ అన్నారు. ఐక్యరాజ్యసమితికి ఒక్క ఫోన్ కాల్ కూడా చేయకుండానే యుద్ధాలను ఆపానని, మరికొన్ని యుద్ధాలను కూడా ముగించాల్సి ఉందన్నారు. కాగా.. అమెరికా ప్రతినిధుల సభలో మొత్తం 435 సీట్లకు వచ్చే నెల 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి.
ట్రంప్ వాదనను కొట్టివేసిన భారత్
భారత్, పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణను నిలువరించడంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిందన్న ట్రంప్ వాదనను భారత్ ఇప్పటికే పలుమార్లు తోసిపుచ్చింది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాక్‌లో ఉగ్రవాద మౌలిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మే 7న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. మే 10న భారత్, పాకిస్థాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ నేరుగా చర్చలు జరిపి కాల్పుల విరమణపై ఒక ఒప్పందానికి వచ్చారని భారత్ స్పష్టం చేసింది. ఘర్షణ సమయంలో అమెరికాతో ఎలాంటి వాణిజ్య సంబంధిత చర్చలూ జరగలేదని కూడా భారత ప్రభుత్వం పేర్కొంది. తన సుంకాల హెచ్చరికల వల్లే భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణను ప్రకటించాయని ట్రంప్ చేస్తున్న వాదనలను భారత్ ముందు నుంచీ కొట్టివేసింది.
ఈ వార్తలూ చదవండి
అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..
గ్రీకు రెస్టారెంట్లో తొలి పరిచయం.. రాజీవ్ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..